సాక్షి, కాకినాడ : సమైక్య ఉద్యమం జిల్లావ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రారంభమై 23 రోజులైనా ఊరు..వాడా నిరసనలు హోరెత్తుతున్నాయి. దిండి-చించినాడ వంతెనపై రామరాజు లంక వాసుల వంటావార్పు వల్ల ఉభయగోదావరి జిల్లాల మధ్య మధ్యాహ్నం వరకు రాకపోకలు స్తంభించాయి. పాడిగేదెలు, గిత్తలతో సమైక్యవాదులు రావులపాలెం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలపడంతో 16వ నంబర్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజమండ్రిలో ఫ్యూచర్ కిడ్స్‌పాఠశాలకు చెందిన 1500మంది విద్యార్థులు ఆం ధ్రప్రదేశ్ మ్యాప్‌గా ఏర్పడి రాష్ర్టపతి, ప్రధాని, సోనియాలకు పోస్టుకార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేంద్రమంత్రులు ఎంఎం పళ్లంరాజు, కె.చిరంజీవి కనిపించడం లేదంటూ కి ర్లంపూడి పోలీస్‌స్టేషన్‌లో జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు.
నిరసనలతో హోరెత్తిన కాకినాడ
కాకినాడలో 23వ రోజు కూడా నిరసనలు హోరెత్తాయి. కాకినాడలోని జేఎన్‌టీయూ, ఏపీటీ, జీపీటీలతో పాటు బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకోవడంతో నాలుగోరోజు కూడా జరగలేదు. డీఆర్‌డీఏ, ఐకేపీల ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది మహిళా సమాఖ్య సభ్యులు మహా ర్యాలీ నిర్వహించారు.కలెక్టరేట్ ఎదుట పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలకు జేఏసీ రాష్ర్ట కో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు కేవీవీ సత్యనారాయణరాజు, రవికిరణ్‌వర్మ, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీ భావం తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేస్తున్న ప్రభుత్వ వాహన డ్రైవర్స్ సంఘం నేతలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీలు చైతన్యరాజు, వర్మల ఆధ్వర్యంలో చైతన్య విద్యార్థులు నగరంలో బైకు ర్యాలీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టడంతో వారికి సంఘీభావంగా నగరంలో ప్రైవేటు పాఠశాలలను గురు,శుక్రవారాలు మూసివేస్తున్నట్టు ప్రకటించారు.
ఉద్యమంలోకి మున్సిపల్ కమిషనర్లు
సీమాంధ్రలోని 33 మున్సిపాల్టీలకు చెందిన కమిషనర్లు రాజమండ్రిలో సమావేశమై సమైక్యాంధ్ర ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. విధులు నిర్వహిస్తూనే ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలుపుతామన్నారు. సియోన్ అంధుల పాఠశాల విద్యార్థులు ప్రభుత్వాస్పత్రి వద్ద ధర్నా చేశారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. బొమ్మూరులో న్యాయవాదులు మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించగా, మాజీ సర్పంచ్ మత్స్యేటి ప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయరహదారిైపై కోడిపందాలు ఆడి నిరసన తెలిపారు. రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో పీహెచ్‌సీలకు తాళాలు వేసి వైద్యులు, సిబ్బంది ర్యాలీ చేశారు. ఏలేశ్వరంలో సుమారు 2వేలమంది స్థానిక బాలాజీచౌక్‌లో సర్వమతప్రార్థనలు, వంటావార్పు, రాస్తారోకోలతో హోరెత్తించారు.
తుని గొల్ల అప్పారావు సెంటర్‌లో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టి పాదచారులకు బూట్ పాలిష్ చేశారు. రామచంద్ర పురంలో న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, సైకిల్‌షాపు ఓనర్లు, మెకానిక్‌ల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజోలులో ఉద్యోగ సంఘాల దీక్షలకు గజల్ శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. పెద్దాపురంలో జేఏసీ శిబిరానికి వచ్చిన ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్‌ను స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాను చేసి ఆమోదింప చేసుకోవాలంటూ నిలదీశారు.
ఉరకలేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆది నుంచి అగ్రభాగాన ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు గురువారం కూడా పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆమరణదీక్షకు సంఘీభావంగా పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి మోరంపూడి జంక్షన్‌లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వందలాది మంది మానవహారంగా ఏర్పడి కబడ్డీ, తాడాట వంటి ఆటలతో నిరసన తెలిపారు. రాష్ర్ట విభజనను తట్టుకోలేక మరణించిన వారికి సంతాపసూచకంగా మౌనం పాటించారు. రావులపాలెంలో జేఏసీ, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పాడిగేదెలు, గిత్తలతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా ట్రాఫిక్ స్తంభించింది.
కోరుకొండలో వైఎస్ విజయమ్మకు మద్దతుగా పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ జోతుల లక్ష్మీనారాయణ, యూత్ కన్వీనర్ గణపతిరావు చే స్తున్న ఆమరణ నిరాహారదీక్షలను బుధవారం అర్ధరాత్రి భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. ముమ్మిడివరంలో డీసీసీబీ మాజీ డెరైక్టర్ పెయ్యల చిట్టిబాబు, మెండు గోవిందరావు, పోలిశెట్టి నాగేశ్వరరావు, కాట్రు అప్పారావులు చేపట్టిన ఆమరణ దీక్ష నాల్గవ రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరంలో సుమారు 100 ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. పెదపూడి మండలం చింతపల్లి వద్ద పైన గ్రామానికి చెందిన విద్యార్థులు రాస్తారోకో చేయగా, ఎమ్మెల్యీ బొడ్డు భాస్కరరామారావు పాల్గొన్నారు. కడియం, బొమ్మూరులలో దీక్షాశిబిరాలకు పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు సంఘీభావం తెలిపారు.
కాకినాడలో కలెక్టరేట్ వద్ద జేఏసీతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, తుని నియోజకవర్గంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలకు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగలిలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ కూసుమంచి శోభారాణి, అడ్డతీగలలో చేపట్టిన దీక్షలకు వైఎస్సార్ సీపీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ అనంతబాబు సంఘీభావం తెలిపారు. మలికిపురంలో చేపట్టిన దీక్షల్లో పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గెడ్డం ఫిలిప్‌రాజు ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసనతెలిపారు.
బస్సుయాత్రకు అనూహ్య స్పందన
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బండార్లంక నుంచి అమలాపురం రూరల్, ఉప్పలగుప్తం, అల్లవరం మండల పరిధిలోని పలు గ్రామాల మీదుగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ వరకు సాగింది. మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, చింతా కృష్ణమూర్తి, మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు, ఇతర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో మాధవపట్నం నుంచి సామర్లకోట మీదుగా పెద్దాపురం వరకు సాగింది. సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం వద్ద వంటావార్పులో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. రెండు ప్రాంతాల్లో వందలాదిగా పార్టీ శ్రేణులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీలతో హోరెత్తించారు.
సమైక్యనాదం
Published Fri, Aug 23 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement