కలెక్టరేట్(కాకినాడ), న్యూస్‌లైన్ : ఆధార్ బ్రిడ్జి పేమెంట్ విధానం కింద పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల కోసం, ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేసుకునేలా అర్హులైన విద్యార్థులను చైతన్యపరచాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు. అంబేద్కర్ భవన్‌లో ఆయా అంశాలపై ప్రిన్సిపాళ్లకు మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం లక్షా 35 వేల మంది కళాశాల విద్యార్థులు పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత కలిగి ఉన్నారన్నారు. వీరిలో ఇప్పటివరకూ 65,855 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. వీరిలో 29,533 మందికి బ్యాంకు అకౌంట్లు, 31,323 మందికి ఈ పాస్-ఆర్‌ఎఎస్‌ఎఫ్ అంశాల పరిశీలన పూర్తయిందన్నారు. కాగా, 14,414 మందికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తయిందన్నారు.
ఇంకా నమోదు చేయించుకోవాల్సిన విద్యార్థులందరూ నూతన విధానంలో రానున్న 10 రోజుల్లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని కళాశాలల్లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులు 55 వేల మంది ఉండగా వీరిలో ఇప్పటివరకూ సుమారు 20 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని, మిగిలిన 35 వేల మందిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రిన్సిపాళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ కార్నన్, అదనపు జాయింట్ కలెక్టర్ డి.మార్కండేయులు, ఆర్డీవోలు జవహర్‌లాల్ నెహ్రూ, వేణుగోపాలరెడ్డి, ప్రియాంక, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, డీఈఓ కె.శ్రీనివాసులురెడ్డి, డీఎస్‌డబ్ల్యూవో రామారావు, ఎన్‌ఐసీ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులను చైతన్యపరచండి : కలెక్టర్
Published Wed, Nov 20 2013 3:24 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement