రాజ్యసభలోనూ నిరాశే
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశంపై జిల్లా ప్రజల గరం గరం
కేంద్ర మంత్రులు చిరంజీవి, జేడీ శీలం, పనబాకల తీరుపై అసంతృప్తి
ఒంగోలు : రాజ్యసభలోనూ రాష్ట్ర విభజన బిల్లు పాస్ కావడంతో జిల్లా వాసులు అసంతృప్తికి లోనయ్యారు. జిల్లాకు ఏ మాత్రం అనుకూలంగా లేని బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర నేతల వైఖరిని దుయ్యబడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలు కూడా తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా గురువారం రాజ్యసభ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేస్తుంటే ఆంధ్రుల అభిమాన నటుడు చిరంజీవి, జిల్లాతో అనుబంధం ఉన్న జెడీ శీలం, నాలుగు నియోజకవర్గాలకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పనబాక లక్ష్మి తమకు ఏమీ పట్టనట్లుగా తమ స్థానాల్లో కూర్చోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాల విభజనకు వ్యతిరేక మంటూ నిరసన గళం విప్పిన రాజ్యసభ టీడీపీ ఎంపీ సుజనాచౌదరి.. గురువారం సభలో టీడీపీ విభజనకు అనుకూలమని ప్రకటన చేయడం విస్మయానికి గురి చేసింది.
విభజన వల్ల జిల్లాకు ఒరిగిందేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధికి జిల్లా ఆమడదూరంలో ఉన్న విషయం తెలిసిందే. ఎక్కడా ప్రత్యేకంగా పరిశ్రమలు లేవు. యూనివర్సీటీ, ప్రముఖ విద్యా సంస్థలు, ప్రత్యేకత పొందిన ఆస్పత్రులూ అంతకన్నా లేవు. ఇటువంటి సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలు బిల్లులో ఉంటే బాగుండేదని జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. అసలు సీమాంధ్ర తరఫున మాట్లాడేందుకు రాజ్యసభలో ఒక్క నాయకుడు కూడా లేక పోవడం శోచనీయమంటున్నారు.
బీజేపీకి చెందిన వెంకయ్యనాయుడు మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. యూపీఏ మళ్లీ అధికారంలోకి రాకుంటే సీమాంధ్రకు న్యాయం చేస్తామన్న ప్రధాని మాటలు నీటి మీద రాతల్లా మారే అవకాశం లేకపోలేదని జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పడం గమనార్హం. తెలుగుదేశం బండారం గురువారం బయట పడిందన్నారు. టీడీపీ నాయకుడు సుజనాచౌదరి కూడా తాము రాష్ట్ర విభజనను ఆహ్వానిస్తున్నామని చెప్పడంలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి ఏమిటో వ్యక్తమవుతోందన్నారు. కాంగ్రెసు పార్టీతో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు లాలూచీపడి రాష్ట్ర విభజన చేశాయని ఆరోపించారు.