విజయవాడ : సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా కృష్ణాజిల్లాలో సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్‌కు కొనసాగుతోంది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు రెండురోజులు సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక లావాదేవీలతో పాటు. అత్యవసర సేవలైన ఆస్పత్రులు మినహా విద్యాసంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు మూతపడ్డాయి. దీంతో బెజవాడ మొత్తం నిర్మానుష్యంగా మారింది.
మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు మేము సైతం అంటున్నారు. గురువారం నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. ఇంతవరకు అన్నిశాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు ఉద్యమంలోకి దిగినా విద్యుత్ ఉద్యోగులు మాత్రం పాక్షికంగా సమ్మెలో పాల్గొన్నారు. కానీ రోజురోజుకీ ఉద్యమ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో గురువారం నుంచి ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కం అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్స్ ఉద్యోగులు సుమారు 30 వేలమంది నిరవధిక సమ్మెలోకి దిగుతున్నారు.
దీనిలో భాగంగా లైన్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఉన్నతాధికారి స్థాయి వరకు ఉద్యోగులు, అధికారులు తమ వద్దనున్న ప్రభుత్వ సెల్‌ఫోన్ సిమ్‌లను నేడు తమ తమ కార్యాలయాల్లో అందజేయనున్నారు. సిబ్బంది సమ్మె కారణంగా తక్షణం విటిపిఎస్‌పై సమ్మె ప్రభావం పడుతుంది.