ప్లేస్ ఏదైనా ఆ బుడ్డోడు స్టిక్ పట్టాడంటే బీట్ అదిరిపోవాల్సిందే.. బేస్ కాస్త పెంచి బాదాడంటే బాక్సులు బద్దలైపోవాల్సిందే.. ఆ సౌండ్‌కి ఎవరైనా ముగ్దులైపోవాల్సిందే. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ రేంజ్ అది మరి. మూడేళ్లకే స్టేజ్ షోలు ప్రారంభించి, వీక్షకుల చేత ఔరా అనిపించుకున్నాడు. మేటి సంగీత కళాకారులతో మన్ననలు అందుకుని అనేక అవార్డులు, సత్కారాలు పొందుకున్నాడు.
విజయవాడ కల్చరల్: సంగీతం ఒక మహా సముద్రం.. సాధనే అందులో ప్రావీణ్యత వచ్చేలా చేస్తుంది.. సరైన శిక్షణ ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. ఇక తండ్రే మంచి శిక్షకుడైతే ఇక తిరుగుండదు. విజయవాడ పాతబస్తీకి చెందిన ముత్యాల చెర్రీ స్వరూప్ ఇదో కోవలోకి వస్తాడు. తండ్రి ప్రోద్బలంతో మూడేళ్లప్పుడే స్టిక్స్ చేతబట్టిన ఈ బుడతడు.. డ్రమ్స్ వాయించడంలో విశేష ప్రతిభ చూపిస్తున్నాడు. వెస్ట్రన్ ఐనా, జానపదమైనా, శాస్త్రీయమైనా బీట్ ఏదైనా తనకు కొట్టిన పిండి అని నిరూపిస్తున్నాడు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటికే వందకుపైగా ప్రదర్శనలతో అదరగొట్టేశాడు.
ప్రస్థానం సాగిందిలా..
చెర్రీ చిన్నతనంలో తండ్రి ముత్యాల పరమేష్‌తో పాటు డ్రమ్స్ వాయించే కార్యక్రమంలో పాల్గొనేవాడు. తండ్రి వాయించే శబ్దాలకు అనుగుణంగా కాళ్లు చేతులు, లయబద్ధంగా కదిలించేవాడు. కుమారుడిలోని తాళ జ్ఞానాన్ని గుర్తించిన పరమేష్ శిక్షణ ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే తండ్రిని మించిన శిష్యుడయ్యాడు. పట్టణం, నగరం అన్న తేడా లేకుండా దేశంలోని అనేక చోట్ల స్టేజ్ షోలు ఇచ్చాడు. అతిరథ మహారథుల మధ్య అనేక సార్లు తన ప్రతిభను ప్రదర్శించాడు.
అభినందనల మందార మాల..
చెర్రీలోని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ డ్రమ్స్ ప్లేయర్ శివమణి, వందేమాతరం శ్రీనివాస్, సినీ సంగీత దర్శకుడు కోటి, దేవిశ్రీ ప్రసాద్‌లు పలు సందర్భాల్లో పొగడ్తలతో ముంచెత్తారు. సినీ గేయ రచయత, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సినీ నటుడు చిరంజీవి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శైవపీఠాధిపతి శివస్వామి తోపాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు.
అవార్డులు ఇవి..
చెర్రీలోని ప్రతిభను గుర్తించిన పలు సంస్థలు బాలరత్న, బాల ప్రతిభ, వండర్ కిడ్ పురస్కారాలతో సత్కరించాయి.
Comments
Please login to add a commentAdd a comment