వాడవాడలా సమైక్యాంధ్ర ఆందోళనలు | Samaikyandhra protests paralyse Rajahmundry | Sakshi
Sakshi News home page

వాడవాడలా సమైక్యాంధ్ర ఆందోళనలు

Published Wed, Sep 11 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

Samaikyandhra protests paralyse Rajahmundry

సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 42వ రోజుకు చేరినా అదేవాడి.. వేడితో సాగింది. సందేశాత్మక ప్రదర్శనలతో వివిధ వర్గాల సమైక్యవాదులు ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి రగిలించారు. మాక్ పార్లమెంట్, ఓటింగ్ వంటి కార్యక్రమాలతో ఆలోచన రేకెత్తించారు. ‘తెలుగువారి ఐక్యతను విచ్ఛిన్నం చేసి, సీమాంధ్రుల నుంచి రాజధానిని లాక్కుని పారిపోతున్న కేసీఆర్‌ను ప్రజలు అడ్డుకుని దాడిచేసి గుణపాఠం చెప్పారు. ప్రజల దాడితో సొమ్మసిల్లిన కేసీఆర్‌ను తెలుగుతల్లి చేరదీని హైదరాబాద్ అందరిదీ అని హిత బోధ చేస్తుంది.’ ఇదీ పెద్దాపురంలో బార్ అసోసియేషన్, న్యాయశాఖ ఉద్యోగులు, జేఏసీ ప్రతి నిధులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రదర్శించిన వినూత్న రూపకం ఇతివృత్తం. తెలుగుతల్లి హైదరాబాద్ బొమ్మను పొదివి పట్టుకుని నిలుచుంటే కేసీఆర్ దాన్ని ఎత్తుకు పారిపోతాడు. దీంతో ప్రజలు తిరగబడి కేసీఆర్‌పై దాడి చేస్తారు. అపుడు సొమ్మసిల్లిన కేసీఆర్‌కు తెలుగుతల్లి తాగడానికి నీళ్లు ఇచ్చి, హైదరాబాద్‌ను లాక్కున్నందుకే   ఈ గతి పట్టిందని హితబోధ చేస్తుంది. ఈ రూపకం పలువురిని విశేషంగా ఆకర్షించింది.
 
 మాక్ పార్లమెంట్, ఓటింగ్ 
 రామచంద్రపురం పట్టణంలో ఉపాధ్యాయులు మాక్ పార్లమెంట్, ఎన్నికలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు, సోనియాకు మధ్య పోటీ పెట్టా రు. వెయ్యిమంది నుంచి ఓట్లు సేకరించగా అం దరూ సోనియాకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 
 
 రాజమండ్రిలో..
 కోటగుమ్మం సెంటర్‌లో వ్యాపార సంస్థల జేఏసీ దీక్షల్లో ముస్లింలు పాల్గొన్నారు. డీవైఈఓ కార్యాలయంలో హెచ్‌ఎంల సంఘం దీక్షలు ఆరో రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల దీక్షలు, జేఏసీ ఫెడరేషన్ దీక్షలు, మున్సిపల్ ఉద్యోగులు, ఏపీఎన్జీఓలు, మున్సిపల్ కార్మికుల దీక్షలు కొనసాగు తున్నాయి. ఇంటర్మీడియెట్ బోర్డు ఉద్యోగులు ఇన్నీసుపేటలో జూనియర్ కళాశాల ఎదుట దీక్ష లు ప్రారంభించారు. ధవళేశ్వరంలో ఏపీఎన్జీఓలు, కడియంలో బాధ్యత స్వచ్ఛంద సంస్థ, వెలుగుబంటి చారిటబుల్ ట్రస్టు, పేపరుమిల్లు కార్మికుల దీక్షలు సాగుతున్నాయి. 
 
 కాకినాడలో..
 సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కలెక్టరేట్ వద్ద చేస్తున్న రిలే దీక్షల్లో మంగళవారం ఐడియల్ కళాశాల పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా దీక్షలో పాల్గొన్నారు. దండోరా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజననకు యత్నిస్తున్న దుష్టశక్తుల దిష్టిబొమ్మను కలెక్టరేట్ వద్ద దహనం చేశారు. ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, న్యాయ, రిజిష్ట్రేషన్ శాఖల ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, విద్యార్థులు దీక్షలు చేస్తున్నా రు. మత్స్యశాఖ ఉద్యోగులు జగన్నాథపురంలో వంటావార్పు చేపట్టారు. అనుబంధ శాఖల ఉద్యోగులతో ర్యాలీ చేశారు. రమణయ్యపేట వద్ద వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం ఎదు ట జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 
 
 కోనసీమలో...
 అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో జేఏసీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బండారులంక అభ్యుదయ కళానికేతన్, అమలాపురం మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు  కళారూపాలు ప్రదర్శించారు. వానపల్లిపాలెంలో పంచాయతీ పాలకవర్గం దీక్ష చేపట్టింది. మానవహారంగా ఏర్పడి సభ్యులు నినాదాలు చేశారు. ఎన్.కొత్తపల్లిలో జేఏసీ దీక్ష శిబిరంలో సర్పంచ్ లంకే రామకృష్ణవర్మ 24 గంటల దీక్ష ప్రారంభించా రు. గొల్లవిల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, భీమనపల్లిలో విద్యార్థులు, అల్లవరం ఎంపీడీఓ కార్యాలయంలో గోడిలంక పంచాయతీ పాలకవర్గం దీక్ష చేసింది. అల్లవరంలో వివిధ రాజకీ య పక్షాల సమావేశం చర్చించింది. ముమ్మిడివరంలో గౌడ సంఘం నిరసన ర్యాలీ జరిపి కేసీఆర్ దిష్టిబొమ్మ దహ నం చేసింది. కొత్తపేటలో జెడ్పీ హైస్కూల్ టీచర్లు, వానపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారిణి  సుమలత, మహిళా సిబ్బంది దీక్షల్లో పాల్గొన్నారు. రావులపాలెం, ఆలమూరుల్లో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. 
 
 టీడీపీ మహా ధర్నా
 ఆలమూరు మండలం జొన్నాడ వద్ద జాతీయ రహదారిపై తెలుగుదేశం పార్టీ మహాధర్నా చేసింది. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజక వర్గాల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట ఇన్‌చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యం వహించగా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు. హైవేపై వంటా వార్పూ నిర్వహించారు. ఆత్రేయపురంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో కళ్లకు గంతలతో 21 మంది సర్పంచ్‌లు దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. గొర్రెలతో గొర్రెల కాపరులు నిరసన ప్రదర్శన చేశారు. అంబాజీపేట సెంటర్‌లో జర్నలిస్టులు దీక్షలు చేశారు. గాడిదకు వినతి పత్రాలు ఇచ్చారు. మామిడికుదురులో పీఈటీలు వెనక్కి నడిచి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై డ్రిల్. యోగాసనాలతో నిరసన తెలిపారు. మలికిపురంలో ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలు సాగుతున్నాయి. రాజోలులో రైతులు ర్యాలీ చేశారు. రాజోలు, టేకిశెట్టిపాలెంలో ఉద్యోగ జేఏసీ, తాటిపాకలో పొలిటికల్ జేఏసీల దీక్షలు. మోరి పోడులో యూటీఎఫ్ దీక్షలు సాగుతున్నాయి. 
 
 మెట్టసీమలో... 
 పెద్దాపురం, సామర్లకోటల్లో తహసీల్దారు కార్యాలయాల వద్ద దీక్షలు కొనసాగుతున్నా యి. సామర్లకోటలో స్కూళ్లు బంద్ అయ్యాయి. అబ్కారీ డిపోకు తాళం వేశారు. పెద్దాపురంలో జేఏసీ, బార్ అసోసియేషన్, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. తునిలో జేఏసీ దీక్షల్లో పాన్‌షాప్‌ల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఎన్జీఓల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయులకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కుసుమంచి శోభారాణి పాల్గొన్నారు. 
 
 ఉత్తరాల ఉద్యమం ప్రారంభం
 రాష్ట్ర విభజన ఆపాలంటూ లక్ష ఉత్తరాలు రాసే కార్యక్రమం పిఠాపురం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యాన గొల్లప్రోలులో ప్రారంభమైంది. ఉపాధ్యాయ పోరాటసమితి నేతలు మహ్మద్ అబ్జలుల్లాఖాన్, మేడసాని సత్యనారాయణలు 72గంటల దీక్ష చేపట్టారు. పిఠాపురం ఉప్పాడ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, కొత్తపల్లి, గొల్లప్రోలు సెంటర్లలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఏలేశ్వరంలో తొట్టి రిక్షాలు తొక్కుతూ నిరసన తెలిపారు. ఉద్యోగులు బాలాజీ చౌక్‌లో రాస్తారోకో చేశారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడిల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కిర్లంపూడిలో విద్యార్థులు, గండేపల్లిలో జర్నలిస్టులు, కేబుల్ ఆపరేటర్లు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దీక్షల్లో పాల్గొన్నారు. జగ్గంపేట పొలిటికల్ జేఏసీ శిబిరంలో విశ్వబ్రాహ్మణులు, జేఏసీ శిబిరంలో పంచాయతీ కార్యదర్శులు దీక్షల్లో పాల్గొన్నారు. మంత్రి తోట నరసింహం సంఘీభావం తెలిపారు. గండేపల్లిలో దీక్షలను మంత్రి ప్రారంభించారు. జగ్గంపేటలో విశ్వబ్రాహ్మణులు పనిముట్లతో ర్యాలీ చేశారు. 
 
 రాష్ట్రం ముక్కలైతే ఇంతే...
 రాష్ట్రం ముక్కలైతే ఉరితాళ్లే గతి ఉంటూ సీతానగరంలో సమైక్య వాదులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. జేఏసీ ఆధ్వర్యం లో రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండల కేంద్రాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. రాజానగరంలో పంచాయతీ సిబ్బంది దీక్షల్లో పాల్గొన్నారు. అనపర్తి, రంగంపేట, బిక్కవోలు మండల కేంద్రాల్లో, మండపేటలో జేఏసీ దీక్ష లు కొనసాగుతున్నాయి. రామచంద్రపురం డివిజన్ కాజులూరు, జగన్నాథగిరిల్లో చేసిన వంటావార్పుల్లో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు.  కె.గంగవరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్మించారు. రంపచోడవరంలో వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు వంటా వార్పు, రాజవొమ్మంగిలో నాయీబాహ్మ్రణులు ర్యాలీ నిర్వహించారు. 
 
 వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. 
 రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు కోటగుమ్మం సెంటర్‌లో వాహనాలను కడిగి నిరసన తెలిపారు. బీసీ, ఎస్సీ  విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలో జేఏసీ ఆధ్వర్యంలోని దీక్ష శిబిరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గ కోఆర్డినేటర్ గొల్ల బాబూరావు, క్రమశిక్షణ సంఘం సభ్యులు బుచ్చిమహేశ్వరరావు, కోఆర్డినేటర్లు గుత్తుల సాయి సంఘీభావం తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై కుర్చీల్లో వినాయక విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. మామిడికుదురులో రిలే దీక్షలలో గెద్డాడ గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు విభాగం రాష్ట్ర సభ్యుడు జక్కంపూడి తాతాజీ, కోఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, మత్తి జయప్రకాష్ హాజరయ్యారు. రావులపాలెం మండలం గోపాలపురం వద్ద హొటళ్ల నిర్వాహకుల సంఘం వంటావార్పు లో వైఎస్సార్ కాంగ్రెస్ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. పార్టీ మద్దతుదారుడు ఐ.కుమార్  ఉప్పురాశిపై కూర్చుని రిలే దీక్ష చేయగా జగ్గిరెడ్డి సంఘీభావం తెలిపారు. మలికిపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే దీక్షలు కొనసాగున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement