రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు బుధవారం సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు.
అడ్డగోలు విభజనపై సమైక్యాంధ్ర విద్యార్థి నేతల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు బుధవారం సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఉదయం 11 గంటల సమయంలో సచివాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఒక్క పెట్టున నినాదాలు చేశారు. పోలీసు బలగాలు ప్రధాన ద్వారం వద్ద ఉన్నప్పటికీ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నిం చారు. పోలీసులు విద్యార్థులను అరెస్టుచేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం వారిని సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు.
ధర్నా సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపకుంటే పార్లమెంటు గోడలను బద్దలు కొడతామని హెచ్చరించారు. కాగా, పోలీసులు విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేయడాన్ని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు లంకా దినకర్, కడియాల రాజేందర్, చలసాని శ్రీనివాస్, ప్రొఫెసర్ నడింపల్లి శ్రీరాం, ఏపీ రాష్ర్ట పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ వి. లక్ష్మణ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.