సమైక్యాంధ్ర ఉద్యమ కెరటాలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. శనివారం జిల్లాలో పలుచోట్ల నిరసన కారులు ఆందోళనలు చేపట్టారు. అనకాపల్లిలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు సమ్మక్క సారక్క పండుగ చేపట్టి నిరసన తెలిపారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉద్యోగ,అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యం 500 అడుగుల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. కశింకోట మండలంలో కోలాటం ఆడారు. చోడవరంలో ఉపాధ్యాయులు చీపుళ్లతో రోడ్లు ఊడ్చారు. జి.మాడుగుల, చింతపల్లిలో దీక్షలు కొనసాగుతున్నాయి. నర్సీపట్నంలో ఏపీఎన్‌జీవో ఎస్‌టీ వర్గ ఉపాధ్యాయులు రోడ్డుపై థింసా నృత్యం చేశారు. శ్రీకన్య కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించిన దృశ్యమిది.
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: నిక నెహ్రూచౌక్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శనివారానికి 47వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను వైఎస్సార్ సీపీ నాయకులు కొణతాల లక్ష్మీనారాయణ (పెదబాబు) ప్రారంభించారు. దీక్షల్లో గవరపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎంఏఎల్ కళాశాల అధ్యాపకులు ఎ.జె.వి.ఎన్.రావు, డి.గిరిలక్ష్మి, ఎస్.రమణాజీ, వి.కె.ఎం.సన్యాసిరావు, కరణం నర్సింగరావు, కె.రాజశేఖర్, ఎం.హైమ, ఎన్.వరలక్ష్మి, ఎస్.శాంతిరూప కూర్చున్నారు.
ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శిబిరంలో గురజాడ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలుగుతల్లి, భారతమాత, ఖడ్గ బ్రహ్మన, తిక్కన, త్యాగరాజు, వివిధ దేశనాయకుల వేషధారణలు ధరించి పాల్గొన్నారు. కోయదొర వేషధారణలో ఉపాధ్యాయుడు కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, షిండేలకు జాతకాలు చూస్తూ చేసిన ఏకపాత్రాభినయం ఆలోచింపజేసింది. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు, ఎన్జీవో సంఘాల నేతలు పాల్గొన్నారు.
ఉద్యమాలు కేంద్రానికి పట్టవా?
పాడేరు రూరల్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతంలో చేపడుతున్న ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవా అని వైఎస్సార్ సీపీ పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త సీకరి సత్యవాణి ప్రశ్నించారు. మండలంలోని చింతలవీధి మెట్ట వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం సుమారు గంటన్నర సేపు పశువులు కాసి నిరసన తెలియపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ సంక్షోభంతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ నిలుపుదల అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీ నామా చేయకుండా డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ఓ వైపు రాజీనామాలు చేయకుండా, మరో వైపు శాసన సభను సమావేశ పర్చకుండా సీమాంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు పాంగి పాండురంగస్వామి, నిక్కుల సింహాచలం, లంకెల విశ్వేశ్వరరావు, ఎం.వి.ఆర్.పాత్రుడు, దిలీప్ పాల్గొన్నారు.
కేంద్ర కార్యాలయాల ముట్టడి
పాడేరు: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పాడేరులో శనివారం సమైక్యవాదులంతా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సేవలను అడ్డుకున్నారు. పట్టణ పరిధిలోని టెలీఫోన్ ఎక్చ్సేంజ్, కాఫీ బోర్డు డీడీ కార్యాలయం, పోస్టాఫీస్, మినుములూరులోని కాఫీ పరిశోధన కార్యాలయం, యూనియన్ బ్యాంకు, స్టేట్‌బ్యాంకు, గ్రామీణ వికాస్ బ్యాంకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ముట్టడించారు. కార్యాలయాలకు దగ్గరుండి తాళాలు వేశారు. జై సమైక్యాంధ్ర నినాదాలతో ఆయా కార్యాలయాలు హోరెత్తాయి. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రూడి అప్పారావు, కె.గంగన్నపడాల్, రత్నకుమార్, బుక్కా చిట్టిబాబు, రేగం సూర్యనారాయణ , పి.బొంజుబాబు, చిట్టిదొర, జి.వి.వి.ప్రసాద్, ప్రసాద్‌రావు, కె.రామారావు, ఇతర ఉద్యోగ, ఉపాధ్యాయులంతా పాల్గొన్నారు.
సీలేరులో...
సమైక్యాంధ్ర ఉద్యమం 60వ రోజుకు చేరుకోవడంతో సీలేరులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సమైక్యవాదులు శనివారం ముట్టడించారు. టెలీఫోన్ ఎక్స్చేంచ్, పోస్టాఫీస్, బ్యాంకుల సేవలను స్తంభింపజేశారు. రాష్ట్ర విభజనను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి సోనియా, కేసీఆర్‌లకు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
అనకాపల్లిలో సమ్మక్క, సార క్క జాతర
అనకాపల్లి రూరల్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం అనకాపల్లి నెహ్రూచౌక్ జంక్షన్‌లో సమ్మక్క, సారక్క జాతర ఘనంగా నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఉపాధ్యాయ జేఏసీ అనకాపల్లి డివిజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. తాత్కాలికంగా ఆలయాన్ని నిర్మించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సోనియా, కేసీఆర్, కవితల మనస్సు మార్చాలని కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం నెహ్రూచౌక్ జంక్షన్ నుంచి రాజా థియేటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మక్క, సారక్క తాత్కాలిక ఆలయం వద్ద సోనియాగాంధీ వేషధారణలోని వ్యక్తి బరువు బెల్లం తూకం వేశారు. ఆమె రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అమ్మవార్లకు సమర్పించారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ కలిసుంటేనే తెలుగుజాతి ఉనికి సాధ్యమవుతుందన్నారు. ప్రాంతీయతత్వం జాతీయసమగ్రతకు ముప్పని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ పరిరక్షణ సమితి సభ్యులు మాదేటి పరమేశ్వరరావు, కె.ఎన్.వి. సత్యనారాయణ, సీలా జగన్నాథరావు, వై.సత్యం పాల్గొన్నారు.
వాడవాడలా ఉద్యమం
Published Sun, Sep 29 2013 12:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement