
ఇసుక పెత్తనం తమ్ముళ్లకే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: డ్వాక్రా రుణాలు మాఫీ అటకెక్కించడంతో.. మహిళలను సంతృప్తి పరచడానికి టీడీపీ ప్రభుత్వం ఇసుక రీచ్‌ల డ్రామా తెరపైకి తెచ్చింది. పోనీ మహిళలకే కట్టబెట్టారనుకుంటే పొరపాటే. మహిళల పేరు చెప్పి ఇసుక రీచ్‌లపై తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు. పెపైచ్చు తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యాలతో డ్వాక్రా మహిళలకు కన్నీళ్లు మిగిలాయి. అలాగే యథాతథంగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుండడం గమనార్హం.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం కొత్తదే అయినా.. జిల్లాలో మాత్రం పాత పద్ధతిలోనే ఇసుక రవాణా కొనసాగుతోంది. జిల్లాలో 72 ఇసుక రీచ్‌లను గుర్తించారు. అందులో ప్రస్తుతం 25 రీచ్‌లకు అనుమతులు వచ్చాయి. వీటిలో కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మరికొన్నిచోట్ల తమ్ముళ్ల బినామీలు అడ్డుతగులు తుండటంతో ప్రారంభం కాలేదు. కోవూరు నియోజక వర్గ పరిధిలో బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని జొన్నవాడ, మినగల్లు, విడవలూరు మండలం ముదివర్తి, కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం ఇసుక రీచ్‌లు టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్నట్టు సమాచారం.
‘అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేయాలని చూస్తే మీ అంతుచూస్తాం’ అని బెదిరిస్తున్నట్టు తెలిసింది. నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకులతోట ఇసుక రీచ్ బుధవారం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ తమ్ముళ్ల బినామీలు అడ్డుతగిలి దౌర్జన్యం చేశారు. ఇసుక రీచ్‌ను తమకే ఇవ్వాలంటూ ప్రారంభాన్ని అడ్డుకున్నారు. షామియానాను పడదోసి మహిళలపై దౌర్జన్యం చేశారు. దీంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంత సద్దు మణిగింది.
అయితే ‘రీచ్‌లో ఎవరైనా అడుగుపెడితే.. ఇసుకలోనే తొక్కేస్తాం’ అని బెదిరిస్తున్నట్టు మహిళలు భయపడుతున్నారు. దీంతో ఇక్కడ ఇసుక తవ్వకాలు ప్రారంభించలేదు. అదే విధంగా కోడూరుపాడు, ఎన్‌వీ గార్డెన్, పొట్టేపాళెం, గొల్లకందుకూరు, సజ్జీపురం, ముల్లుముడి తదితర ప్రాంతాల వద్ద స్థానికులు అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది.
బిల్లొకటే.. అనుమతి మూడింటికి
కొన్నిచోట్ల ఇసుక తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. బుచ్చిరెడ్డిపాళెం మండల పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వే బిల్లును చూపి మూడు ట్రాక్టర్ల నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా నాయుడుపేట పరిధిలోని ఇసుక రీచ్‌ల నుంచి పగలు నిబంధనల ప్రకారం తరలిస్తున్నా.. రాత్రి పూట మాత్రం ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. అదే విధంగా సూళ్లూరుపేట పరిధిలోనూ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.