భద్రాచలం, న్యూస్‌లైన్
చెంతనే గోదావరి ఇసుక తిన్నెలు గుట్టలుగా కనిపిస్తున్నా నిర్మాణదారులకు అది ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అధికారుల నిర్వాకంతోనే ఈ సమస్య ఏర్పడిందని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కొరత తీవ్రంగా ఉండటంతో దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బడాబాబులు సిండికేట్‌గా ఏర్పడి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో అమాయకులు బలైపోతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. భద్రాచలం మండలం బుట్టాయిగూడెం సమీపంలో ఇటీవల ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురై పెనుబల్లి చినబాబు అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాపారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గొమ్ముకొత్తగూడెం గోదావరి ఇసుక ర్యాంపు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం ఉంది. గొమ్ముకొత్తగూడెం
గోదావరి ఇసుక ర్యాంపును గిరిజన సొసైటీ వారు నిర్వహించినప్పుడు చక్రం తిప్పిన సదరు వ్యక్తి, సొసైటీ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా ఇలా రాత్రి వేళల్లో అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లు సమాచారం. అయితే గతం లో సొసైటీ వద్ద కొనుగోలు చేసిన ఇసుకను ఇంటి వద్ద నిల్వ చేసి, ప్రస్తుతం అవసరమైన వారికి విక్రయిస్తున్నామని ఆ వ్యక్తి అధికారులకు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే వాస్తవమైతే అర్ధరాత్రి సమయంలో సరఫరా చేయడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక ఎక్కడా లభించకపోవడంతో ఇసుక దొంగలు తయారయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల కింద మంజూరైన నిధులతో చేపట్టే పనులకు కూడా ఇసుక లభించకపోవటంతో ఎదో రీతిన చేసేందుకు కాంట్రాక్టర్‌లు సైతం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమయంలోనే ఈ ఏడాది కాలంలో భద్రాచలం, చర్ల మండలాల్లో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. అయి నా అధికారయంత్రాంగం కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సొసైటీల్లో తేలని లెక్కలు...
పీసా చట్టం అమల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను గిరిజన సొసైటీలకు అప్పగించారు. ఇలా భద్రాచలం ఏజెన్సీలో గోదావరి నదిలో ఎనిమిది ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. రెండో ఏడాది రీచ్‌లను తెరిపించే విషయంలో సవాలక్ష అవాంతరాలు వచ్చిపడ్డాయి. సొసైటీ చట్టాల ప్రకారం తొలి ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహణ ఖర్చుల లెక్కలు చూపిస్తేనే తిరిగి రెండో ఏడాది వీటిని తెరిచే అవకాశం ఉంటుంది. వీటి పర్యవేక్షణ బాధ్యతులు చూసిన అధికారులు ఈ విషయం లో మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలిసింది. వెంకటాపురం మండలంలోని మరికాల, మొర్రంవాని గూడెం, బూర్గంపాడు మండలం రెడ్డి పాలెం, భద్రాచలం ఇసుక రీచ్‌ల్లో పెద్ద ఎత్తున అవకతవకులు చోటుచేసుకున్నట్లుగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఆదర్శ వంతమైన రీచ్‌గా అధికారులు ప్రచారం చేసుకున్న భద్రాచలం మండలంలోని గొమ్ముకొత్తగూడెం ఇసుక ర్యాంపులో పనిచేసిన కూలీలకు సవ్యంగా అందలేదని ఏకంగా ఐటీడీఏ కార్యాలయం ముందు వంటా-వార్పు నిర్వహించి మహిళలు నిరశన వ్యక్తం చేయటం జరిగింది. భద్రాచలం ఇసుక రీచ్ వద్ద ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఒడ్డున ఉన్నాయి. గిరిజన సొసైటీలచే నిర్వహించిన ఇసుక రీచ్‌ల నిర్వహణలో కొంతమంది బడా వ్యాపారస్తులు రంగప్రవేశం చేయటంతోనే సమస్య ఝఠిలం గా మారింది. రూ.25 కోట్ల మేర అక్రమ వ్యాపా రం జరిగిందనే ప్రచారం కూడా ఉంది.
గోదావరి నది నుంచి ఒడ్డుకు తీసిన ఇసుకకు, అదే విధంగా విక్రయించిన ఇసుకకు తీవ్ర వ్యత్యా సం వస్తుండటంతో దీన్ని ఎలా సరిచేయాలనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నట్లుగా సమాచారం. గిరిజన సొసైటీల మాటున బీనామీలే రీచ్‌లను నిర్విహ స్తున్నారనే ఆరోపణ లు మొదట్లోనే వెల్లువెత్తినప్పటికీ అధికార యంత్రాంగం సకాలంలో దృష్టి సారించకపోవటంతో వీటిని రెండో ఏడాది ప్రారంభించేం దుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా నిర్మాణదారులకు ఇసుక కష్టాలు తప్పలేదు.
నిలిచిన అభివృద్ధి పనులు...
ఇసుక కొరతతో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వివిధ పథకాల క్రింద ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతుండగా, ఇసుక లభించకపోవటంతో వీటిని పూర్తి చేయటం తమ వల్లకాదని కాంట్రాక్టర్‌లు చేతులెత్తేస్తున్నారు. ఇందిరమ్మ పథకం క్రింద ఇండ్లు మంజూరైనప్పటికీ వాటిని పూర్తి చేసుకోలేని పరిస్థితి ఉందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది కార్యరూపంలో దాల్చటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇసుక కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్మాణదారులు కోరుతున్నారు.
చీకటి దందా
Published Mon, Dec 16 2013 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement