breaking news
tribal society
-
ధీరుడు కొమురం భీమ్
సాక్షి, న్యూఢిల్లీ: నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల్లో కొత్త శక్తిసామర్థ్యాలను, స్ఫూర్తిని నింపిన ధీరుడు కొమురం భీమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ముఖ్యంగా గిరిజన సమాజంపై ఆయన చెరగని ముద్ర వేశారని కీర్తించారు. నెలవారీ మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతిని గుర్తుచేస్తూ ఆయన పోరాట స్ఫూర్తిపై మోదీ ప్రసంగించారు. ‘20వ శతాబ్దం తొలినాళ్లలో దేశంలో కనుచూపుమేరలో స్వాతంత్య్రంపై నమ్మకం లేదు. బ్రిటిష్ పాలకులు భారత్‌ను దారుణంగా లూటీ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ సంస్థానంలో దేశభక్తులు అత్యంత హేయమైన అణచివేతను ఎదుర్కొన్నారు. క్రూరమైన, కనికరం లేని నిజాం దురాగతాలను భరించారు. పేదలు, అణగారిన, గిరిజన వర్గాలపై జరిగిన దురాగతాలకు అంతే లేదు. వారి భూములను లాక్కున్నారు. భారీ పన్నులు విధించారు. ఇది అన్యాయని ఎదిరించిన వాళ్ల చేతులు నరికేశారు. అలాంటి క్లిష్ట సమయాల్లో దాదాపు ఇరవై ఏళ్ల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. నిజాంకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఆ కాలంలో పెద్ద నేరం. అలాంటిది ఆ యువకుడు సిద్ధిఖీ అనే నిజాం అధికారిని సవాల్ చేశాడు. రైతుల పంటలను జప్తు చేయడానికి నిజాం సిద్ధిఖీని పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్ధిఖీని అంతంచేశాడు. అతను అరెస్ట్‌ను సైతం తప్పించుకోగలిగాడు. ఆ గొప్ప వ్యక్తే కొమురం భీమ్. అక్టోబర్ 22న ఆయన జయంతి చేసుకున్నాం. భీమ్ ఎక్కువ కాలం జీవించలేదు. కేవలం 40 ఏళ్లు మాత్రమే జీవించారు. నిజాం పాలకులకు కంటిమీద కునుకులేకుండా చేశారు. అంతటి యోధుడి ప్రాణాలను 1940లో నిజాం సైన్యం బలిగొంది. ఇంతటి గొప్ప వీరుని సాహసాలు, గొప్పతనం ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయతి్నంచాలని ప్రజల్ని కోరుతున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో మాట్లాడారు. ‘‘నా వినమ్ర నివాళులు. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు’’ అని అన్నారు.వందేమాతరం వేడుకలు ‘‘మనందరి హృదయాలకు దగ్గరైన ఒక గీతం గురించి మొదట మాట్లాడుకుందాం. అదే మన జాతీయగీతం వందేమా తరం. ఈ ఒక్క పదమే ఎన్నో భావోద్వేగాలను, ఉరిమే ఉత్సాహాలను తట్టిలేపుతుంది. భరతమాతతో మన అనుబంధాన్ని గుర్తుచేస్తుంది. వందేమాతర గీతా న్ని ఆలపించి 140 కోట్ల మంది ఐక్యశక్తిని చాటుదాం’’ అని మోదీ అన్నారు. కమ్మని కోరాపుట్ కాఫీ ‘‘చాయ్‌తో నా అనుబంధం మీకు తెల్సిందే. కానీ ఈసారి కాఫీ విషయాలు మాట్లాడుకుందాం. గత మన్ కీ బాత్‌లో ఏపీలోని అరకు కాఫీ గురించి చర్చించాం. ఇప్పుడు ఒడిశా ప్రజలు ఎంతో ఇష్టపడే కొరాపుట్ కాఫీ కబుర్లు చెప్పుకుందాం. కోరాపుట్ కాఫీ ఘుమఘుమలు అద్భుతం. అంతేకాదు అక్కడి కాఫీ గింజల సాగు సైతం స్థానికుల ఆదాయాన్ని పెంచుతోంది. కోరాపుట్ కాఫీ ఎంతో స్వాదిష్టమైంది. అది ఒడిశా గౌరవం. అసలు భారతీయ కాఫీ అంటేనే ప్రపంచం దేశాలు పడిచస్తాయి’’ అని మోదీ అన్నారు. -
దళారులే దిక్కు
రంపచోడవరం: గిరిజన సహకార సంస్థ లక్ష్యానికి దూరంగా పనిచేస్తోంది. గిరిజనులు సేకరించే చిన్న తరహా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించి వారికి బాసటగా ఉండాల్సిన సంస్థ అరకొరగా కొనుగోళ్లు చేస్తూ చేతులు దులుపుకుంటోంది. కొన్ని రకాల చిన్న తరహా అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే మానేసింది. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉండగా మార్కెట్లో రేటు లేదనే కారణాన్ని చూపుతూ కొనుగోలుకు దూరంగా ఉంది. ఈ ప్రాంతంలో గిరిజనులకు మంచి ఆదాయాన్నిచ్చే కొండచీపుళ్లు ధర పడిపోయిందన్న కారణంతో కొనుగోలు చేయడం లేదు. దీంతో గిరిజనులు వారు సేకరించిన చీపుళ్లను మారేడుమిల్లి తీసుకువచ్చి కట్ట రూ.50 నుంచి రూ.60కు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు రూ.70 నుంచి రూ.90కు అమ్ముకుని ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. వీటికి సంబంధించి జీసీసీ నిర్ణయించిన ధరకు దళారులు చెల్లించే ధరకు ఎంతో వ్యత్యాసం ఉంది. మొదటి రకం ధర (గ్రేడ్–1) రూ. 45, గ్రేడ్ –2 రూ. 40, గ్రేడ్ –3 రూ. 35గా నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో గిరిజనులు గ్రేడ్లతో సంబంధం లేకుండా ఒక కట్ట రూ. 50 ధరకు పైగా అమ్ముకుంటున్నారు. గతంలో కొనుగోలు చేసిన 20 వేల కొండ చీపుళ్లను కాకినాడ జిల్లా ఏలేశ్వరం గొడౌన్లో నిల్వ చేశారు. ఇవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏటా బయట మార్కెట్లో కొండచీపుళ్లకు రేటు ఉన్న జీసీసీ నామ మాత్రపు ధరతో కొనుగోలు చేస్తోంది. దీంతో తమ ఉత్పత్తులను జీసీసీ చెల్లించే ధర కంటే బయట వ్యాపారులకు ఎక్కువకు అమ్ముకుంటున్నారు. చింతపండు కిలో రూ.36 ధర నిర్ణయించగా బయట మార్కెట్లో వ్యాపారులకు భారీ ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకవాడ గండి చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. ఈరకాన్ని వ్యాపారులు రూ.180 నుంచి రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ మాత్రం ఈ రకాన్ని ఇతర ప్రాంతాల్లో లభ్యమయ్యే చింతపండుకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తోంది. దీంతో జీసీసీకి విక్రయించేందుకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. మారేడుమిల్లి ప్రాంత గిరిజనులకు శీకాయ మంచి ఆదాయ వనరు. దీనిని జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. గతంలో విదేశాలకు ఆర్గానిక్ శీకాయను సరఫరా చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఆ తరువాత జీసీసీ సరిగ్గా కొనుగోలు చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. జీసీసీ గిరిజనులు సేకరించే, పండించే సుమారు 34 రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు అవి అంతరించిపోకుండా చూడాల్సి బాధ్యత కూడా ఆ సంస్థపై ఉంది. కోవెల జిగురు కోసం చెట్టు బెరడును సేకరిస్తారు. దీంతో కొంత కాలానికి ఆ చెట్టు చనిపోతుంది. కోవెల చెట్లు అంతరించిపోకుండా వీటి మొక్కలను గిరిజనులతో నాటించి సంతతిని అభివృద్ధి చేయాల్సి ఉంది. జీసీసీకి సేకరణపై ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణలో లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనివల్ల చాలా వరకు కోవెల చెట్లు అంతరించిపోయాయి. నరమామిడి చెట్లది అదే పరిస్థితి. ఆయుర్వేద విలువలు ఉన్న తిప్ప తీగ, కొవెల జిగురు తదితర వాటి కొనుగోళ్లను పూర్తిగా తగ్గించింది. గానుగ పిక్కలు, కరక్కకాయలు, ముసిడి గింజలు, నల్ల జీడిపిక్కలు,నేపాల గింజలు రెల్ల చెక్క, తానికాయలు వంటి అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదు. -
పాడేరులో కొనసాగుతున్న బంద్
పాడేరు(విశాఖ): పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం పిలుపు మేరకు శుక్రవారం ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నారు. బంద్ నేపథ్యంలో గిరిజన నాయకులు బస్సులను కదలనివ్వకుండా ఎక్కడికక్కడే ఆపేయడంతో ప్రజారవాణా స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులను మొహరించారు. -
చీకటి దందా
భద్రాచలం, న్యూస్‌లైన్ చెంతనే గోదావరి ఇసుక తిన్నెలు గుట్టలుగా కనిపిస్తున్నా నిర్మాణదారులకు అది ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అధికారుల నిర్వాకంతోనే ఈ సమస్య ఏర్పడిందని నిర్మాణదారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక కొరత తీవ్రంగా ఉండటంతో దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బడాబాబులు సిండికేట్‌గా ఏర్పడి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో అమాయకులు బలైపోతున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటం విమర్శలకు తావిస్తోంది. భద్రాచలం మండలం బుట్టాయిగూడెం సమీపంలో ఇటీవల ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురై పెనుబల్లి చినబాబు అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాపారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గొమ్ముకొత్తగూడెం గోదావరి ఇసుక ర్యాంపు నుంచి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నట్లు ప్రచారం ఉంది. గొమ్ముకొత్తగూడెం గోదావరి ఇసుక ర్యాంపును గిరిజన సొసైటీ వారు నిర్వహించినప్పుడు చక్రం తిప్పిన సదరు వ్యక్తి, సొసైటీ కాలపరిమితి ముగిసిన తరువాత కూడా ఇలా రాత్రి వేళల్లో అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లు సమాచారం. అయితే గతం లో సొసైటీ వద్ద కొనుగోలు చేసిన ఇసుకను ఇంటి వద్ద నిల్వ చేసి, ప్రస్తుతం అవసరమైన వారికి విక్రయిస్తున్నామని ఆ వ్యక్తి అధికారులకు చెబుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదే వాస్తవమైతే అర్ధరాత్రి సమయంలో సరఫరా చేయడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక ఎక్కడా లభించకపోవడంతో ఇసుక దొంగలు తయారయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల కింద మంజూరైన నిధులతో చేపట్టే పనులకు కూడా ఇసుక లభించకపోవటంతో ఎదో రీతిన చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సమయంలోనే ఈ ఏడాది కాలంలో భద్రాచలం, చర్ల మండలాల్లో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. అయి నా అధికారయంత్రాంగం కఠినంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొసైటీల్లో తేలని లెక్కలు... పీసా చట్టం అమల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్‌ల నిర్వహణ బాధ్యతలను గిరిజన సొసైటీలకు అప్పగించారు. ఇలా భద్రాచలం ఏజెన్సీలో గోదావరి నదిలో ఎనిమిది ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేశారు. రెండో ఏడాది రీచ్‌లను తెరిపించే విషయంలో సవాలక్ష అవాంతరాలు వచ్చిపడ్డాయి. సొసైటీ చట్టాల ప్రకారం తొలి ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్వహణ ఖర్చుల లెక్కలు చూపిస్తేనే తిరిగి రెండో ఏడాది వీటిని తెరిచే అవకాశం ఉంటుంది. వీటి పర్యవేక్షణ బాధ్యతులు చూసిన అధికారులు ఈ విషయం లో మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలిసింది. వెంకటాపురం మండలంలోని మరికాల, మొర్రంవాని గూడెం, బూర్గంపాడు మండలం రెడ్డి పాలెం, భద్రాచలం ఇసుక రీచ్‌ల్లో పెద్ద ఎత్తున అవకతవకులు చోటుచేసుకున్నట్లుగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆదర్శ వంతమైన రీచ్‌గా అధికారులు ప్రచారం చేసుకున్న భద్రాచలం మండలంలోని గొమ్ముకొత్తగూడెం ఇసుక ర్యాంపులో పనిచేసిన కూలీలకు సవ్యంగా అందలేదని ఏకంగా ఐటీడీఏ కార్యాలయం ముందు వంటా-వార్పు నిర్వహించి మహిళలు నిరశన వ్యక్తం చేయటం జరిగింది. భద్రాచలం ఇసుక రీచ్ వద్ద ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఒడ్డున ఉన్నాయి. గిరిజన సొసైటీలచే నిర్వహించిన ఇసుక రీచ్‌ల నిర్వహణలో కొంతమంది బడా వ్యాపారస్తులు రంగప్రవేశం చేయటంతోనే సమస్య ఝఠిలం గా మారింది. రూ.25 కోట్ల మేర అక్రమ వ్యాపా రం జరిగిందనే ప్రచారం కూడా ఉంది. గోదావరి నది నుంచి ఒడ్డుకు తీసిన ఇసుకకు, అదే విధంగా విక్రయించిన ఇసుకకు తీవ్ర వ్యత్యా సం వస్తుండటంతో దీన్ని ఎలా సరిచేయాలనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నట్లుగా సమాచారం. గిరిజన సొసైటీల మాటున బీనామీలే రీచ్‌లను నిర్విహ స్తున్నారనే ఆరోపణ లు మొదట్లోనే వెల్లువెత్తినప్పటికీ అధికార యంత్రాంగం సకాలంలో దృష్టి సారించకపోవటంతో వీటిని రెండో ఏడాది ప్రారంభించేం దుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా నిర్మాణదారులకు ఇసుక కష్టాలు తప్పలేదు. నిలిచిన అభివృద్ధి పనులు... ఇసుక కొరతతో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వివిధ పథకాల క్రింద ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతుండగా, ఇసుక లభించకపోవటంతో వీటిని పూర్తి చేయటం తమ వల్లకాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఇందిరమ్మ పథకం క్రింద ఇండ్లు మంజూరైనప్పటికీ వాటిని పూర్తి చేసుకోలేని పరిస్థితి ఉందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ అది కార్యరూపంలో దాల్చటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఇసుక కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్మాణదారులు కోరుతున్నారు.


