మంత్రాలయం/నందవరం, న్యూస్‌లైన్: ప్రకతి సంపదకు అక్రమార్కుల రూపంలో చెదలు పట్టింది. ఫలితంగా కొండలు, గుట్టలు, నదులు, వాగులు, వంకలు తేడా లేకుండా తమ స్వరూపాన్నే కోల్పోతున్నాయి. అక్రమ గునపాలతో గోతులు మిగులుతున్నా అధికార గణం మాత్రం వేడుక చూస్తోంది. కొందరు అధికారులు సంబంధం లేదంటూ అక్రమ తరలింపులను గాలికి వదిలేయగా.. మరికొందరు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. రోజుకు టన్నుల కొద్ది ప్రకృతి సంపద అక్రమంగా తరలిపోతున్నా అబ్బే అలాందేమి లేదని తోసిపుచ్చుతున్నారు. ఉన్నతాధికారులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ప్రకృతి సంపద కరిగిపోయేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు.
మట్టి, ఇసుకతో కాసులు..
మంత్రాలయం నియోజకవర్గం, ఎమ్మినూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో మట్టి, ఇసుక అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. నదులు, గుట్టలను యథేచ్చగా నమిలేస్తూ జేబులు నింపుకొంటున్నా వారిని కట్టడి చేయాల్సిన అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. అక్రమాల పర్వం ఎంతలా సాగుతోందంటే రోజుకు ఇసుక, గ్రావెల్ రూపంలో 800 టన్నుల వరకు ప్రకృతి సంపద ట్రాక్టర్లు, లారీలో అక్రమంగా తరలిపోతోంది. మంత్రాలయం, మాధవరం, కోసిగి మండలం సాతనూరు, తుంబిగనూరు, అగసనూరు, కౌతాళం మండలం అచ్చోళి, గుడికంబాళి, నదిచాగి, పెద్దకడబూరు మండలం కంబలదిన్నె, జాలవాడి, దొడ్డిమేకల, నందవరం మండలం నాగలదిన్నె, గురుజాల తదితర గ్రామాల సమీపంలో నది నుంచి ఇసుకను యథేచ్చగా తరలిస్తున్నారు.
మంత్రాలయం మండలం చెట్నెహళ్లి, మోహినిపురం, పెద్దకడబూరు మండలం రాగిమాన్‌దొడ్డి, ఎల్‌ఎల్‌సీ కాలువ గట్లు, దుద్ది చెరువు, బూగేని చెరువు, బసలదొడ్డి చెరువు నుంచి మట్టి తవ్వకాలు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా అక్రమార్కులు తమదే రాజమార్గం అనే రీతిలో కార్యకలాపాలను సాగిస్తూ పంచాయతీల ఆదాయానికి గండికొడుతున్నారు. నందవరం మండలం నాగలదిన్నె, గురుజాలను గతంలో ఇసుక కేంద్రాలుగా గుర్తించిన అధికారులు గతంలో వాటికి టెండర్లు కూడా నిర్వహించారు. రెండేళ్లుగా వాటి జోలికెళ్లకపోవడంతో అక్రమార్కుల పంట పండుతోంది.
పైసా పెట్టుబడి లేకుండా లక్షలు..
ఈ అక్రమ మార్గంలో పైసా పెట్టుబడి లేకుండా లక్షలకులక్షల జేబులో వేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500 చొప్పున విక్రయిస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో రూ.2వేల నుంచి 2,500 వరకు అమ్ముకుంటున్నారు. మట్టి ధర రూ.1200 నుంచి రూ.1700 దాకా నడుస్తోంది. ఇలా సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్కులు లక్షలు ఆర్జిస్తుంటే అధికారులు మాత్రం వందలు, వేల జరిమానాతో సరిపెడుతున్నారు. అది కూడా ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు. రోజుకు ఎనిమిది వందల టన్నులకుపైగా ఇసుక, మట్టి తరలిపోతుంటే ఏడాదంతా కలిపి అధికారులు నమోదు చేసిన కేసులెన్నో తెలుసా.. పట్టుమని పది కేసులు. వసూలు చేసిన జరిమానా రూ. 35వేలే కావడం గమనార్హం. అవి కూడా మంత్రాలయం పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించినవే. మిగతా ప్రాంతాల అధికారులు పూర్తిగా నిద్రపోతున్నారు.
చర్యలు తీసుకుంటాం :
చంద్రశేఖర్, తహశీల్దార్, నందవరం
అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు వస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తాం. రెవెన్యూ తరపున ఎవరికీ అనుమతి ఇచ్చిందీలేదు. ఇలా రవాణా చేయడం చట్టరీత్యా నేరం. రెండు రోజుల్లో దాడులు ప్రారంభిస్తాం.
ప్రకృతి సంపదపై పంజా
Published Tue, Nov 26 2013 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement