పట్టపగలే దోపిడీ
► ముఖ్యమంత్రి సాక్షిగా చెలరేగిపోతున్న ఇసుక మాఫియా
► తరలిపోతున్న లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక..
► రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు
► వాల్టా చట్టానికి తూట్లు.. ‘ఏర్పేడు ఘటనే’ ఇసుక దందాకు నిదర్శనం
► రాజధాని నిర్మాణం ముసుగులో యథేచ్ఛగా తరలింపు
► నది గర్భం నుంచి డ్రెడ్జర్లతో తోడిపోస్తున్న వైనం
► చోద్యం చూస్తున్న అధికారులు
► గుంటూరులో అడ్డూ అదుపూ లేదు..
రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోయి పట్టపగలే యథేచ్ఛగా భారీ వాహనాల్లో తరలిస్తోంది. నదులు, వాగులు, వంకలను వదలకుండా ఇసుక తవ్వి జేబులు నింపుకుంటున్నారు. ఇసుక మాఫియా ఆగడాలపై విన్నవించడానికి వచ్చి చిత్తూరు జిల్లా ఏర్పేడులో15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఈ దందా రాష్ట్రమంతటా ఎలా సాగుతోందో స్పష్టం చేసింది. ఏర్పేడు ప్రాంతంలో ఇసుక మాఫియా.. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న దోపిడీలో ఇసుమంత కూడా కాదు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇసుక మాఫియా ఇక్కడ మాత్రమే ఉన్నట్లు మాట్లాడటం దారుణం అని జనం విస్తుపోతున్నారు. కృష్ణా, గుంటూరులో నదిలోని ఇసుకను డ్రెడ్జర్ల ద్వారా తోడేస్తుండటం ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది.
అమరావతి: గుంటూరు జిల్లాలో ప్రకృతి సహజ సంపద అయిన ఇసుకను అక్రమంగా దోచేస్తూ అధికార పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, ధనార్జనే ధ్యేయంగా వీరు డ్రెడ్జర్లు, పొక్లెయినర్లతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ దందాలో జిల్లాకు చెందిన ఓ మంత్రితోపాటు, మరో ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలు, వారి బంధువులు, అనుచరులు ఇసుక మాఫియా నడుపుతుండటంతో అధికారులు సైతం వీరి జోలికి వెళ్లడం లేదు. రేపల్లె నియోజకవర్గంలో పెనుమూడి, రావి అనంతవరం రేవుల్లో అక్కడి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. కూలీలను తొలగించి ప్రొక్లయినర్ల ద్వారా ట్రాక్టర్లు, లారీల్లో లోడు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు దండుకుంటున్నారు. నది మధ్యలో నుంచి డ్రెడ్జర్లు ద్వారా ఇసుకను తోడి ఒడ్డుకు చేరుస్తున్నారు. దీంతో గతంలోకంటే రెట్టింపు ఆదాయం ఇసుక మాఫియాకు వస్తోంది. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలతోపాటు అన్ని శాఖల అధికారులకు ఇసుక మాఫియా నుంచి నెలవారీ మామూళ్ళు అందిస్తున్నారు. ఇసుక రీచ్‌ల్లో భారీ స్థాయిలో డ్రెడ్జర్లతో లోతుగా ఇసుకను తోడేస్తుండటంతో నది మధ్యలో భారీ అగాధాలు ఏర్పడ్డాయి.
పెదకూరపాడునియోజకవర్గంలోని రాజధాని నగరమైన అమరావతి మండలంలో మునగోడు, మల్లాది, దిడుగు, ధరణికోట, అమరావతి, వైకుంఠపురం రీచ్‌లు ఉండగా, మల్లాది, దిడుగు రీచ్‌ల నుండి మాత్రమే ఉచిత ఇసుక తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. అయితే కొద్దికాలం అధికారుల పర్యవేక్షణలో ఈవ్యవహారం జరిగినప్పటికీ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అనుచరులు దాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు తెర తీశారు. ఇసుక మాఫియా డ్రెడ్జర్ల ద్వార నది మధ్యలో తీసిన గుంతల వల్ల పుష్కరాల సమయంలో నదిలో దిగి ఆరుగురు విద్యార్థులు జల సమాధి అయ్యారు. అచ్చంపేట మండలం కోనూరు, కస్తల, కోగంటివారిపాలెం ఇసుక రీచ్‌ల నుండి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద డ్రెడ్జర్లు ద్వారా ఇసుక పడవల్లోకి తోడి ప్రొక్లయిన్ల ద్వారా లారీల్లో నింపుతూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. రోజుకు 200 లారీల ఇసుక ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియాకు అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉండటంతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉండే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌ల్లో సైతం ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.
ఒట్టిపోతున్న కాళంగి, స్వర్ణముఖి, పెన్నా
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పెన్నా, స్వర్ణముఖి, కాళంగి నదీ గర్భాలను ఇసుకాసురులు జేసీబీలతో తోడేస్తున్నారు. లారీలు, ట్రక్కుల్లో ఇసుకను చెన్నై, బెంగళూరు మహా నగరాలకు తరలించి ఏడాది కాలంలో రూ.150 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఈ అక్రమాల వెనుక అధికార పార్టీ ముఖ్య నేతల హస్తం ఉండటంతో పోలీసు, రెవెన్యూ అధికారులతో పాటు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల అధికారులు, సిబ్బంది నెల మామూళ్లు తీసుకుని లారీలకు రైట్ రైట్ చెబుతున్నారు. జిల్లాలోని పెన్నా, కాళంగి, సర్ణముఖి నదుల తీరంలోని కలువాయి, సోమశిల, కోటితీర్థం, ఉలవపల్లి, మాముడూరు, టీకే పాడు, మడపల్లి, తెలుగురాయపురం, పడమటి కంభంపాడు, కోలగట్ల, అప్పారావుపాలెం, పొదలకూరు మండలం సూరాయపాలెం, ఇరువూరు, మహమ్మదాపురం, కోట మండలం పుచ్చలపల్లి, దొరవారిసత్రం, తడ, సూళ్లూరుపేట, వాకాడు మండలాల నుంచి ప్రతి రోజు వందలాది లారీల ఇసుక బెంగళూరు, చెన్నై మహా నగరాలకు అక్రమంగా తరలిపోతోంది.
విజయనగరంలో కనిపించని తనిఖీలు
విజయనగరం జిల్లాలో ఎక్కడా తనిఖీలు జరగడం లేదు. టోల్ ఫ్రీ నంబర్‌కు వెళ్లిన ఫిర్యాదు మేరకు విజయవాడ హెడ్ ఆఫీసు నుంచి సమాచారం వస్తే అప్పుడు మాత్రమే తనిఖీలను నామమాత్రంగా చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి జోక్యం కానరావడం లేదు. జిల్లాలోని వేగావతి, చంపావతి, ఏడొంపుల గెడ్డ, నాగావళి, సువర్ణముఖి, గోస్తనీ నదుల ద్వారా ఈ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా 14 మంది టీడీపీ నేతల ప్రమేయం ఉంది. ఇందులో ప్రముఖ నాయకులుగా చలామణీ అవుతున్న ఎస్ కోట, నెల్లిమర్ల, పారాది, గజపతినగరం, రామభద్రపురం ప్రాంతాలకు చెందిన నాయకులు ఉన్నారు. నెలకు రూ.4.60 కోట్ల విలువైన ఇసుక తరలిపోతోంది.
కాసులు కురిపించే కల్పతరువు
ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నాయకులకు ఉచిత ఇసుక ఆదాయ వనరుగా మారింది. సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లాలనుకున్న వారు ట్రాక్టర్‌కు, లారీకి ఇంత అని ముట్టచెప్పుకోవాల్సిందే. మన్నేరు, ఉప్పుటేరు, పాలేరు, ముసి, గుండ్లకమ్మ నదీ పరివాహక ప్రాంతాలు అధికారపార్టీ నాయకులకు ఆవాసాలుగా మారిపోయాయి.
వంతెన ప్రాంతాలనూ వదలట్లేదు..
విశాఖ జిల్లాలో నదీ గర్భంలోనే కాకుండా గ్రోయిన్స్, చెక్‌డామ్స్ తదితర ఇరిగేషన్ స్ట్రక్చర్స్ వంటి ప్రాంతాలతో పాటు వంతెనల కింద కూడా యథేచ్చగా తవ్వకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా శారదా, వరాహ, సర్ఫ నది పరివాహక ప్రాంతాల్లో తవ్వకాలు సాగుతున్నాయి. తనిఖీలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. మైనింగ్ శాఖకు చెందిన విజిలెన్స్ బృందాలు తప్ప టాస్క్‌ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా లేవు. పోలీసుల పాత్ర నామమాత్రం. ఎక్కడైనా వాహనాలు కన్పిస్తే వారి వద్ద మామూళ్లు తీసుకోవడం వదిలేయడం తప్ప పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అనకాపల్లి, మాకవరపాలెం వంటి ప్రాంతాల్లో శారద, వరాహ, సర్ఫ వంటి నదుల్లో జేసీబీలు వినియోగిస్తున్నారు.
కృష్ణ.. కృష్ణా..
కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు కనుసన్నల్లో ఇసుక వ్యాపారం గత మూడేళ్లుగా జరుగుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, పెద్దకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే ఈ దందా మొత్తం నడుస్తోంది. వీరి ఆజ్ఞ లేకుండా ఇసుక రేణువు కూడా రీచ్ నుంచి కదలదు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోనే ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర నేతృత్వంలో రూ.100 కోట్ల వ్యాపారం జరిగింది. అమరావతి, క్రోసూరు, లింగాయపాలెం రీచ్‌ల పరిధిలో ఎమ్మెల్యేలు శ్రీధర్, శ్రావణ్‌కుమార్‌లతోపాటు స్థానిక నేతలు కలిసి రూ. 800 కోట్ల మేర ఇసుక విక్రయాలు జరిపినట్లు తెలిసింది.
కృష్ణా జిల్లా పరిధిలో మంత్రి దేవినేని, ఎమ్మెల్యే బొండా ఉమా ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా ద్వారా రూ. 600 కోట్లు కొల్లగొట్టినట్లు సమాచారం. కృష్ణా నదిలోని ఇసుకను డ్రజ్జర్లు, డ్రగ్గింగ్ మిషన్లు ద్వారా తోడేస్తున్నారు. జేసీబీలు సైతం వినియోగిస్తున్నారు. ఇప్పటి దాకా కోటిన్నర క్యూబిక్ మీటర్ల మేర ఇసుకను తవ్వేసి విక్రయించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా ఇసుక తవ్వకాలపై ఆధారపడి జీవిస్తున్న వారిని రీచ్‌ల్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్న ఘటన గుంటూరు జిల్లాలోని లింగాయపాలెంలో చోటు చేసుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులో తెలుగుదేశంలో నేతలు ఇసుక ర్యాంపు వేసి ఇసుక తవ్వి తెలంగాణకు తరలిస్తున్నారు. రావిలాల, వేదాద్రి వద్ద కృష్ణానదిలో ఇసుక రీచ్‌ల నుంచి ట్రాక్టర్లలో తరలించి బలుసుపాడు మీదుగా పాలేరు నదికి అవతల ఉన్న నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
‘తూర్పు’న మితిమీరిన దోపిడీ
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లి, తాతపూడి, కపిలేశ్వరపురంలో నాలుగు ఇసుక ర్యాంపుల తవ్వకాలు అధికార పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ర్యాంపులో మూడు యూనిట్లు ధర రూ.900 అని బోర్డు పెట్టినప్పటికీ రూ.1500 నుంచి రూ.రెండు వేలు వరకూ అమ్ముతున్నారు. నేషనల్ హైవేకు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉండటంతో తాతపూడి ర్యాంపునకు, నాణ్యత బాగుంటుందన్న కారణంగా కోరుమిల్లి ర్యాంపునకు అధిక సంఖ్యలో వాహనాలు తరలి వస్తున్నాయి. ఆయా ర్యాంపుల నుంచి రోజుకు 500పైగా లారీలు ద్వారా ఇసుక తరలివెళ్తోంది. తుని నియోజకవర్గ పరిధిలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వరుసకు సోదరుడు, తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయనేది బహిరంగ రహస్యం. రోజుకు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల విలువ చేసే ఇసుక తరలిపోతోంది. లారీకి రూ.రెండు వేలు, ట్రాక్టరుకు రూ.ఐదు వందలు, ఎడ్లబండికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం కుమార్ టాకీస్ వద్ద ఇసుక ర్యాంపు వద్ద రెండు యూనిట్ల ఇసుకను రూ.1,750 చొప్పున విక్రయిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ర్యాంపునకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు దోపిడీ జరుగుతోంది.
ఇసుక జాతర..
వైఎస్సార్ జిల్లాలో అధికారికంగా 16 ఇసుక రీచ్‌లు కొనసాగుతున్నప్పటికీ, వాస్తవంగా జిల్లాలోని ఏ నదినీ, వాగును.. వంకనూ వదల్లేదు. ప్రధానంగా కొండాపురం ప్రాంతం నుంచి ఇసుక సరిహద్దులు దాటి కర్ణాటకకు వెళ్తోంది. ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి వద్దనున్న ఇసుక క్వారీ నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోదరుల కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. ఆర్టీపీపీలో నిర్వహిస్తున్న పనులన్నింటికి ఇసుకను తరలిస్తోంది వీరే. ఇటీవల హనుమాన్‌గుత్తి ప్రజలు తిరగబడితే పోలీసుల సహకారంతో దోపిడీ కొనసాగిస్తున్నారు. నందలూరు వద్ద చెయ్యేరు నది నుంచి ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి సమీప బంధువులు, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నారు. చిత్రావతి, పెన్నా, పాపాఘ్ని, చెయ్యేరు నదుల నుంచి పెద్ద ఎత్తున అనధికారికంగా ఇసుక తరలిపోతున్నా అధికారులు కిమ్మనడం లేదు. పాపాఘ్ని నదిలో టీడీపీ నేతలు పుత్తా నరసింహారెడ్డి, సతీష్‌రెడ్డి అనుచరులు పెద్దఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. మాఫియా తరహాలో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని ఇసుకను తరలించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వేంపల్లె సమీపంలో పాపాఘ్ని నదికి ఒక్కోసారి ట్రాక్టర్లు ఎక్కువగా రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందంటే దందా ఏస్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
యథేచ్ఛగా కర్ణాటకకు..
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామం వద్ద వేదావతి హగరి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. రోజు 150 నుంచి 170 ట్రాక్టర్ల మేర ఇసుకను అక్రమంగా తీసుకెళుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతల అనుచరులు ఈ దందాను కొనసాగిస్తున్నారు. ఉరవకొండ, గుంతకల్లు, వజ్రకరూర్ తదితర ప్రాంతాలకు ఇసుక రవాణా చేసి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఇసుక దందాలో అడ్డగోలుగా సంపాదించారు. ఒక్కో ప్రజాప్రతినిధి రోజూ రూ.10 లక్షల ఆదాయమే లక్ష్యంగా తవ్వకాలు సాగించారు. ‘ఉచితం’ అమలు చేసిన తర్వాత జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. అధికారులు నిర్ధేశించిన ప్రాంతాల్లో కాకుండా ఇసుక లభ్యత ఎక్కడ ఉంటే అక్కడల్లా తవ్వకాలు సాగిస్తూ బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
‘పోలవరం’ దెబ్బతింటుందంటున్నా..
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక దొంగలు ప్రకృతి వనరులను దర్జాగా దోచేస్తున్నారు. అనుమతులు లేని ప్రాంతాల్లో తవ్వకాలు సాగించడంతోపాటు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌కు ముప్పు కలిగిస్తున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి సమీపంలో నదిలోంచి ఇసుక తవ్వడం వల్ల ప్రాజెక్ట్‌కు ముప్పు ఏర్పడుతుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మొత్తుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తవ్వకాలను సీడబ్ల్యూసీ నిషేధించినా.. అక్కడ హద్దులు నిర్ణయించి ఎర్రజెండాలు పాతినా టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ ప్రాంతం నుంచి కడెమ్మ కాలువ వరకు దాదాపు కిలోమీటరు పొడవునా ఇసుక తవ్వకాల చేయకూడదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. అయినా ఇక్కడ యథేచ్ఛగా తవ్వకాలు సాగిసోతున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి అండతో ఇక్కడ ఇసుక అక్రమ దందా నడుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్‌వర్క్స్ పనుల కోసం ఉపయోగిస్తున్న యంత్రాలనే ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్నారు. ఇలా తవ్విన ఇసుకను వందలాది వాహనాల్లో బయటి ప్రాంతాలకు తరలించుకుపోయి విక్రయిస్తున్నారు.
దర్జాగా దందా
చిత్తూరు జిల్లాలో టీడీపీ నాయకులంతా ఏకమై ఇసుకను కొల్లగొడుతున్నారు. చిన్నా చితక కుంటల దగ్గర నుంచి నదుల వరకు దేన్నీ వదలకుండా తోడేస్తున్నారు. జిల్లా స్థాయి సంఘం 114 ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చింది. 90 రీచ్‌ల్లో ఇప్పటికే పరిమితికి మించి ఇసుకను తరలించారు. ఇంకా తరలిస్తున్నారు. అధికార పార్టీలోని కొంత మంది నాయకుల రోజువారి ఆదాయం రూ.50 లక్షలకు పైగా ఉంటుందంటేనే వీరి తవ్వకం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసుకకు బెంగళూరు, చెన్నై నగరాల్లో మంచి గిరాకీ ఉంది. ఓ మాజీ మంత్రి తనయుడి అండతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడి నుంచి చెన్నై నగరానికి ఇసుకను తరలిస్తున్నారు. వీరి ధాటికి పట్టణానికి నీరు అందించడానికి తవ్విన బావులు ఎండిపోయాయి. కొన్ని చోట్ల నదిలో ఇసుక మొత్తం అయిపోయి రాళ్లు తేలుతున్నాయి. పూతలపట్టు, చిత్తూరు రూరల్ మండలం బీఎన్‌ఆర్‌పేటలో ఇష్టానుసారం తవ్వకాలు సాగుతున్నాయి.
ప్రతిపక్ష పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ అయి కీలక పదవి చేపట్టిన నాయకుడి సహాయంతో పలమనేరు నియోజకవర్గంలో ఇసుక రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కౌండిన్య నది పరీవాహక ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోని తెలుగుదేశం నాయకులు ఈ అక్రమ రవాణాకు నాయకత్వం వహిస్తున్నారు. పెద్దపంజాణి మండలంలో హంద్రీ–నీవా పనుల ముసుగులో ఇసుకను రాష్ట్రం దాటిస్తున్నారు. దీంతో ఈ ప్రాంత ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వెల్లువెత్తుతోంది. పెనుమూరు, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల్లోని కలవకుంట, ఆలత్తూరుల నుంచి ఇసకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటాయి. బోర్లు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. నిమ్మనపల్లి మండలం బహుదా నది, నాగలాపురం మండలం సురుటుపల్లి , ములకల చెరువు మండలం గురుడుపల్లి రీచ్‌లో దాదాపు ఇసుక అయిపోయింది. దీంతో ఆయా మండల స్థాయి నాయకులు కోట్లకు పడగలెత్తారు. కుప్పం మండలం పెద్దవంకలో ఇసుక అక్రమ రవాణా భారీ ఎత్తున జరుగుతోంది. ఇక్కడి జెట్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కేడర్ ప్రకారం అక్రమ ఆదాయాన్ని పంచుకుంటున్నారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రికి దూతగా పనిచేస్తున్న ఒకరు ఈ దందాకు నాయకత్వం వహిస్తున్నారు.
నిబంధనలు ‘తుంగ’లోకి
కర్నూలు జిల్లాలో టీడీపీకి చెందిన ముఖ్య నాయకుల అనుచరులు తుంగభద్ర, హంద్రీ నదిలో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. పోలీసు, మైనింగ్ అధికారుల అండతో ఇసుకను హైదరబాద్‌కు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాతో తమ పొలాలు ఎండిపోతున్నాయని, ఎర్రగుడి, మన్నెకుంట, గోరంట్ల గ్రామానికి చెందిన రైతులు హైకోర్టును ఆశ్రయించగా కేసుల నమోదుకు ఆదేశించింది. జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేత తనయుడి అనుచరులు గోరంట్ల, ఎర్రగుడి, మన్నెకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లో హంద్రీ నదిలో ఇసుకను ట్రాక్టర్లలో తరలించి పొలాల్లో డంప్ చేసి రాత్రి వేళల్లో లారీలకు లోడ్ చేసి హైదరబాద్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు 34 మందిపై కేసులు నమోదు చేయగా, కేవలం ఐదుగురిని మాత్రమే అరెస్టు చేశారు. రాజకీయ పలుకుబడి ఉన్నందున వారు బహిరంగంగానే తిరుగుతున్నప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారంటూ కోర్టుకు పోలీసులు తప్పుడు నివేదిక సమర్పించారు. కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత అనుచరుడు తుంగభద్ర నదిలో కొత్తకోట, ఈర్లదిన్నె ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా హైదరబాద్‌కు తరలిస్తున్నారు.
క్యూకట్టిన ట్రాక్టర్లు..
శ్రీకాకుళం జిల్లాలో పగలు, రాత్రి జేసీబీలతో తవ్వేస్తూ భారీ లారీల్లో విశాఖపట్నం తరలిస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అనుచరులు గుంటూరు ముఠాతో చేతులు కలిపి ఇసుక వ్యాపారానికి తెరలేపారు. కొత్తూరు ప్రాంతంలో పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పాలకొండ నియోజకవర్గంలో ఇసుక మాఫియా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో యథేచ్ఛగా కొనసాగుతుంది. నాగావళి, వంశధార నదీ తీరాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల పరిధిలో వంశధార నదీతీరం నుంచి భారీగా ఇసుకను తవ్వించి లారీల్లో విశాఖ ..ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంత్రి కిమిడి కళావెంకట్రావు ప్రాతినిథ ్యం వహిస్తున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో నాగావళి నది నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతోంది.