- కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు
ఇబ్రహీంపట్నం : ఇసుక రీచ్‌ల నిర్వహణలో మాఫియా జోక్యాన్ని సహించబోమని కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు హెచ్చరించారు. బుధవారం ఆయన ఇబ్రహీంపట్నం ఫెర్రి, గుంటుపల్లి రీచ్‌లను సందర్శించారు. ఫెర్రిలో కొంతమంది రేవుల్లో పెత్తనం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు డ్వాక్రా కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.తమకు రేవు వద్ద పోలీసు రక్షణ కల్పించాలని కమిటీ సభ్యులు కోరారు.
ఆయన మాట్లాడుతూ డ్వాక్రా కమిటీలతోనే ఇసుక రీచ్‌లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మాఫియా జోక్యం చేసుకుంటే వారిపై తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండు రేవుల్లో మాఫియా సభ్యుల గురించి ఆయన ఆరా తీశారు. పడవలు, మిషన్లను పరిశీలించారు. సబ్ కలెక్టర్ నాగలక్ష్మీ, ఐకేపీ అసిస్టెంట్ ప్రాజక్ట్ మేనేజర్ కృష్ణంరాజు పాల్గొన్నారు.