పోలీస్ దందా!
మేడ్చల్‌కు చెందిన లక్ష్మి.. తన భర్త భాస్కర్ కన్పించడంలేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసును విచారిస్తున్న ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ను ఆమె రెండుమూడు సార్లు ఫోన్‌లో సంప్రదించింది. ఈ క్రమంలోనే గతనెల 27న రాత్రి ఆమెను స్టేషన్‌కు పిలిపించి అసభ్యకరంగా ప్రవర్తించాడు సదరు ఎస్‌ఐ. అక్కడితో ఆగకుండా ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడంతో రికార్డు చేసిన ఆమె పోలీస్ ఉన్నతాధికారుల్ని ఆశ్రయించింది. విచారణలో ఎస్‌ఐ బండారం బయటపడింది. ఇప్పుడా ఎస్‌ఐ కటకటాల వెనకున్నాడు.
ఇటీవల మేడ్చల్‌లో ఒక ఎస్‌ఐ ఏసీబీ వలలో చిక్కగా, మొయినాబాద్‌లో మధ్యవర్తిని నియమించుకొని అతని ద్వారా కేసులను డీల్ చేస్తున్న మరో ఎస్‌ఐపైనా బదిలీ వేటు పడింది.
- ఆరోపణలు ‘మూట’గట్టుకుంటున్న వైనం
- వరుస పరిణామాలతో మసకబారుతున్న ప్రతిష్ట
- మట్కా, ఇసుక వ్యాపారుల నుంచి మామూళ్లు
- కేసు వస్తే చాలు ‘సెటిల్‌మెంట్’కు ప్రాధాన్యం!
పోలీస్‌శాఖ వివాదాల సుడిలో కొట్టుమిట్టాడుతోంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిన ‘నాలుగో సింహం’ అక్రమార్కులతో జతకడుతోంది. అవినీతి, అక్రమాలు.. వేధింపులలో తరిస్తోంది. మట్కా మాఫియాతో కుమ్మక్కు, ఇసుక దందాల్లో చేతివాటం ప్రదర్శిస్తూ అందినకాడికి దండుకుంటోంది. రియల్ రంగానికి కొంగు బంగారంగా ఉన్న జిల్లాలో భూ వివాదాల్లో జోక్యానికి అంతే ఉండట్లేదు. నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులు అక్రమాల బాట పడుతూ పోలీసింగ్‌ను అపహాస్యం చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాలు పోలీసుశాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పోలీసు పోస్టింగ్స్‌లో ఓపక్క పైరవీలు మరోపక్క ‘పచ్చనోట్లు’ రాజ్యమేలుతున్నాయి. ఠాణా పరిధి, అక్కడ జరిగే ‘వ్యాపారం’ ఆధారంగా ఉన్నతాధికారులు ఒక్కో దానికి ఒక్కో రేటు కడుతున్నారు. పట్టణ ప్రాంతమైతే మరీ ఖరీదు.. మారుమూల ఠాణాయితే కాస్త తక్కువ ధర అన్నట్లు తయారైంది. సమర్థత, పనితీరు ప్రామాణికంగా చేయాల్సిన పోస్టింగ్‌ల్లో సిఫార్సుల కే పెద్దపీట వేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎస్‌ఐల బదిలీల్లో భారీగా నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 23 మంది ఎస్‌హెచ్‌ఓలను మార్చడం వెనుక అసలు మతలబు ఇదేనని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు ఒకే ఆర్డర్‌తో స్థానచలనం కలిగించడం ద్వారా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని అధికారులు చెప్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘చెల్లించిన’ వారికే మంచి పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
పోస్టింగ్‌లకు ‘ఫిక్స్’డ్ రేటు!
పోలీస్‌స్టేషన్లలో భారీ అవినీతి భాగోతానికి తెరలేచింది. ఠాణా అంతర్గత అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కూడా ఉన్నతాధికారులకు వాటాల రూపంలో అందజేస్తున్నారు. ప్రతి స్టేషన్ సగటున రూ.10 వేల చొప్పున పైస్థాయి అధికారులకు ముట్టజె బుతున్నారు. ఇంకోవైపు తాండూరులో మట్కా జూదం మళ్లీ జ డలు విప్పేందుకు స్థానిక పోలీసులు ఇచ్చిన ‘వెసులుబాటే’ కారణమని ప్రచారం జరుగుతోంది.
ఇసుక రవాణాను అడ్డుకోవడంలో పోలీసుల విభాగం పాత్ర పరిమితమే అయినా.. వికారాబాద్, తాండూరు డివిజన్లలో ఇసుక మాఫియా నుంచి నెలవారీ మామూళ్లు సర్వసాధారణమైపోయాయి. శివార్లలోని ఓ ఠాణా పరిధిలో ఒక ఎంటర్‌ప్రైజెస్‌పై కేసు నమోదు చే సి తర్వాత తమదైనశైలిలో ‘ఫ్రెండ్’షిప్ చేసుకున్న పోలీసులు భారీగానే నొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆరుట్లలో అనుమానాస్పదస్థితిలో యువతి మృతి చెందిన ఘటనలో పోలీసులు రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేయమని మూడు రోజులు ఠాణా చుట్టూ ప్రదక్షణలు చేసినా పట్టించుకోలేదు. చివరకు ఈ విషయం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి వెళ్లిన అనంతరమే.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
- ఇబ్రహీంపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని ఒక ఠాణాలో భూ తగాదాపై స్టేషన్‌కు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వింత అనుభవం ఎదురైంది. ప్రత్యర్థి పార్టీకి వత్తాసు పలుకుతూ కనీసం ఆవేదనను వినడానికి కూడా ఎస్‌ఐ నిరాకరించడంతో నిర్ఘాంత పోయారు. ఆఖరికి ఈ వ్యవహారంలో జాయింట్ కలెక్టర్, డీసీపీ జోక్యం చేసుకుంటే తప్ప వారి వాదన వినేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
- మేడ్చల్‌లో ఒక ఎస్‌ఐ ఏసీబీ వలలో చిక్కగా, మొయినాబాద్‌లో మధ్యవర్తిని నియమించుకొని అతని ద్వారా కేసులను డీల్ చేస్తున్న మరో ఎస్‌ఐపైనా బదిలీ వేటు పడింది. దొంగను రెడ్‌హ్యాండెడ్ పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే... అతడు పోలీసుల ‘కళ్లుగప్పి పరారైన’ సంఘటన నవాబ్‌పేట పీఎస్ పరిధిలో జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని విచారణలో తేలడంతో నలుగురు పోలీసులపై వేటు పడింది.