బాహుదానదిలో ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటున్న గ్రామస్తులు
చిత్తూరు, కలికిరి: ‘ఇసుక ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే పెట్రోలు పోసి తగలబెడతాం’ అని ట్రాక్టరు యజమానులు బెదిరించారంటూ మహల్ కూరాకులపల్లె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని మహల్ వద్ద బాహుదానది నుంచి కలకడ మండలం ఎర్రకోటపల్లి, గంగాపురం, గుర్రంకోండ మండలంలోని పలు గ్రామాలు, స్థానిక మహల్, కేవిపల్లి మండలంలోని తిమ్మాపురం తదితర గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు ఇసుక తరలిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇసుక రవాణాను మహల్ కూరాకుల పల్లెవాసులు అడ్డుకున్నారు. ట్రాక్టర్ల యజమానులు కోపోద్రిక్తులై అడ్డుకున్న వారిపై పెట్రోలు పోసి తగలెట్టి ఇసుకను తరలిస్తాం తప్ప వదిలేదని దౌర్జన్యానికి దిగడంతో గ్రామస్తులు ఆదోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో మంగళవారం సైతం ట్రాక్టర్లను అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ట్రాక్టర్ల వివరాలను నమోదు చేసుకుని వదిలేశారు. దీంతో బుధవారం కూడా ట్రాక్టర్లు బాహుదానది నుంచి ఇసుకను తరలిస్తుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. ఈ విషయమై కలికిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాలుగు ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ వద్దకు తరలించారు. ఇసుక తరలింపుతో భూగర్భజలాలు అడుగంటి పొయి తాగునీరు, సాగునీటి సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తామే ట్రాక్టర్లను అడ్డుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment