సాక్షి, తిరుపతి / పుంగనూరు : చిత్తూరు జిల్లాలో ఇసుక తవ్వకాలు ప్రాణాలు తోడేస్తున్నాయి. ఇప్పటికే గత మూడేళ్ల కాలంలో పదుల సంఖ్యలో మరణించగా తాజాగా ఆదివారం మట్టి పెళ్లలు విరిగిపడి మరో ముగ్గురు సజీవ సమాధి అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చదళ్ల చెరువులో ఆదివారం సాయంత్రం ఇసుక తీస్తుండగా మట్టి పెళ్లలు కూలి ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. చదళ్ల గ్రామానికి చెందిన వెంకట రమణారెడ్డి, భార్య జ్యోతమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. అప్పుడప్పుడు ఇసుక అమ్మకాలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆదివారం జ్యోతమ్మ (42) అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అనిల్‌కుమార్ (22), క్రిష్ణప్పగౌడు (48), మారకొండయ్య, రామచంద్రారెడ్డిలతో ఇసుక తీయడానికి రీచ్‌కు వెళ్లారు.
వాల్టా చట్టం ప్రకారం మీటరుకు మించి లోతు తవ్వకూడదు. కానీ, అనిల్‌కుమార్, క్రిష్ణప్పగౌడులు సుమారు 10–15 అడుగుల లోతులో ఇసుకను తీస్తుండగా అకస్మాత్తుగా పైనున్న చెట్టుతో పాటు మట్టిపెళ్లలు వారి మీద ఒక్కసారిగా కూలగా వారు అందులో కూరుకుపోయారు. అక్కడే ఉన్న జ్యోతమ్మ వారికి చేయి అందించే క్రమంలో మరోసారి మట్టిపెళ్లలు పడడంతో ఆమె కూడా అందులో కూరుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు జేసీబీతో సాయంతో మృతదేహాలను వెలికితీశారు.
రీచ్ వద్ద అధికారులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టకపోవడంవల్లే ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కాగా, మృతులందరూ ఒకే గ్రామానికి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతి చెందిన క్రిష్ణప్పగౌడుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అనిల్‌కుమార్ అవ్వకు విషయం తెలిసి తల్లడిల్లిపోయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయినాథ్ తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు మంత్రి అమర్నాథ్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి ఐదు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తక్షణ సాయంలో భాగంగా ముందుగా చంద్రన్న బీమా కింద ఆదివారం రెండేసి లక్షల రూపాయల చెక్కులను మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
మూడేళ్లల్లో 36మంది మృత్యువాత: ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా మూడేళ్ల కాలంలో అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా మొత్తం 36 మంది మృత్యువాత పడ్డారు. మరో 27 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటనలు ఉన్నాయి. ఇందుకు అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. టీడీపీ నేతలు వాగులు, వంకలు, చెరువులు, కాలువలు.. దేనినీ వదలకుండా ఇసుక, మట్టిని విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతుండడం ప్రధాన కారణం. అక్రమ తవ్వకాలవల్లే ఏర్పేడు దుర్ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. పలమనేరు పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు జరుగుతుండగా ఐదుగురు మరణించారు. కాగా, అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నేతలు వాల్టా చట్టానికి సైతం తూట్లు పొడుస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 63 ప్రాంతాల్లో మాత్రమే ఇసుక తవ్వుకునేందుకు అనుమతులుంటే మరో 15–20 ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తోడేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment