మళ్లీ మొదలైంది.. | Illegal sand mining in the name of government works | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదలైంది..

Published Sun, Jun 18 2017 8:49 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

మళ్లీ మొదలైంది.. - Sakshi

మళ్లీ మొదలైంది..

► ప్రభుత్వ పనుల పేరుతో అక్రమంగా ఇసుక రవాణా
► ఏర్పేడు ఘటన తర్వాత కొత్త  ఎత్తుగడ అవలంబిస్తున్న ఇసుకాసురులు
► నీరు–ప్రగతి పేరుతో అక్రమదందా


ఏర్పేడు ఘటన తర్వాత కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఇసుకాసురులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ పనుల పేరుతో తెల్లబంగారం దోపిడీకి తెరతీస్తున్నారు. వీరి అక్రమాలకు అధికారులు.. పాలకులు వంతపాడుతుండడంతో పరిస్థితి మళ్లీ మొదటి కొస్తోందని రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్లకు ముఖ్యమంత్రి ఫొటో ఉన్న బ్యానర్‌ కుట్టుకుని మరీ ఇసుక దందా చేస్తుండడం గమనార్హం.

ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు   
పదిరోజుల నుంచి అమ్మపాళెం సమీపంలో ఉన్న స్వర్ణముఖి నది నుంచి ఇసుకను అడ్డు అదుపులేకుండా తరలిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. గతంలో రెండు పంట లు సాగు చేసేవాళ్లం. మూడేళ్ల నుంచి ఒకే పంటతో సరిపెట్టుకుంటున్నాం. – చంద్రారెడ్డి, రైతు, అమ్మపాళెం

శ్రీకాళహస్తి రూరల్‌ : ఇసుక అక్రమ రవాణా శ్రీకాళహస్తి మండలంలో మళ్లీ జోరందుకుంది. దీంతో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏర్పేడు ఘటన తర్వాత కొంత వెనుకంజ వేసిన ఇసుకాసురులు పది రోజుల నుంచి మళ్లీ చెలరేగుతున్నారు. నెలరోజుల వ్యవధిలో శ్రీకాళహస్తి మండలంలో కోట్లాది రూపాయలు ఇరిగేషన్‌ పనులు మంజూరయ్యాయి. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఎక్కడో ఒక దగ్గర ప్రభుత్వ పనులు చేస్తున్నట్లు వారి వద్ద పర్మిట్‌ పొందుతున్నారు.

అనంతరం ట్రాక్టర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటోతో కూడిన బ్యానర్‌ కట్టుకుని ఇసుక వ్యాపారాన్ని  కొనసాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై స్థానిక అధికారులు దాడులు నిర్వహించి ఉన్నత అధికారులకు అప్పజెప్పడంతో వారు నామమాత్రపు అపరాధ రుసుం కట్టించుకుని వదిలివేస్తున్నారు. ఫలితంగా çస్వర్ణముఖి నదిలోని ఇసుకను విచ్చలవిడిగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే ఇసుక వ్యాపారం చేపడుతుండడంతో వారిని అడ్డుకోవడానికి స్థానిక అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

రాత్రింబవళ్లు తేడా లేకుండా స్వర్ణముఖినది నుంచి ట్రాక్టర్లతో ఇసుకను రాజమార్గంలో తరలిస్తున్నారు. ఇసుక రవాణాను అడ్డుకుంటున్న వారిపై అక్రమార్కులు దాడులకు దిగుతున్నారని అమ్మపాళెం, పుల్లారెడ్డి కండ్రిగ, సుబ్బానాయుడు కండ్రిగ, తొండమనాడు గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

ప్రభుత్వ పనుల సాకుతో..
శ్రీకాళహస్తి మండలంలో ప్రతి పంచాయతీలో ఇరిగేషన్‌ శాఖకు చెందిన చెక్‌డ్యామ్‌ పనులు మంజూరయ్యాయి. అయితే సంబంధిత కాంట్రాక్టర్లు స్వర్ణముఖినది నుంచి ఇసుక తీసుకెళ్లి పనులు చేయాలంటే రవాణా చార్జీలు ఎక్కువ అవుతాయన్న కారణంతో స్థానికంగా ఉండే చెరువుల మొరవ కాలువలు, వంకలు, వాగుల్లో ఉన్న ఇసుకను తరలించి పనులు చేస్తున్నారు. చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం పేరుతో తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి అధికారుల వద్ద పర్మిట్లు పొందుతున్నారు.

ఈ వంకతో స్వర్ణముఖి నది నుంచి ఇసుకను తిరుపతి, సత్యవేడు తదితర ప్రాంతాలకు తరలించి అక్కడ నుంచి బెంగళూరు, చెన్నై రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాళెం, పుల్లారెడ్డికండ్రిగ, ఓటిగుంట, సుబ్బానాయుడు కండ్రిగ, తొండమనాడు తదితర ప్రాంతా ల నుంచి ఈ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. దీంతో స్వర్ణముఖి నదిలో భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి.

వాహనాలను సీజ్‌ చేస్తున్నాం
ఎలాంటి పర్మిట్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లును పట్టుకుని సీజ్‌ చేస్తున్నాం. స్వర్ణముఖి నది నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సంబం ధిత రైతులు తమకు సమాచారం అందిస్తే(9440900722) వెంటనే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.  – సుదర్శన్‌ప్రసాద్, సీఐ, శ్రీకాళహస్తి రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement