నిర్మల్, న్యూస్‌లైన్ :
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తమ విలువైన భూములు, ఇళ్లు కోల్పోయారు జిల్లా వాసులు. అలాంటి జిల్లావాసుల భూములకు నీరందించే సరస్వతీ కాలువ అధ్వానంగా మారింది. ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతినగా, పిల్లకాలువలు ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీంతో ఏటా చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందడం లేదు.
పుష్కలంగా నీరు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగాన ఉన్న మహారాష్ట్రలో, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ఆశించిన స్థాయిలో వర్షాలు కురియడంతో జలాశయం నీటితో కళకళలాడింది. ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన నాడే ప్రాజెక్టు గేట్లు ఎత్తి మిగులు జలాలు గోదావరిలోకి వదిలారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు ఉంటూ వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో అంటే 1091 అడుగులు ఉంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని భూములకు రబీలో పుష్కలంగా నీరందే అవకాశాలు ఉన్నాయి.
అధ్వానం..
ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా జిల్లా రైతాంగానికి మాత్రం అది అందని ద్రాక్షగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. దీనికి ప్రధాన కారణం జిల్లా రైతాంగ భూములకు నీరందించే సరస్వతీ కాలువే. నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్, కడెం మండలాల్లో మొత్తం 47 కిలోమీటర్ల పొడవుతో 28 డిస్ట్రిబ్యూటరీలు కలిగి 35వేల ఎకరాలకు సాగునీరందించడంతోపాటు దాదాపు 52 చెరువులు నింపే సరస్వతీ కాలువ అధ్వానంగా మారింది. ప్రధాన కాలువతోపాటు, డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతినగా పిల్లకాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని అనవాళ్లు లేకుండా పోయాయి. లక్ష్మణచాంద మండలం బాబాపూర్, వడ్యా ల్, వెల్మల్ నుంచి నర్సాపూర్(డబ్ల్యు) వరకు, మామడ మండలం కొరిటికల్, చందారం, నల్దుర్తిల వద్ద ప్రధాన కాలువ, లక్ష్మణచాంద మండలం మల్లాపూర్, కొరిటికల్ వద్ద డిస్ట్రిబ్యూటరీలు దెబ్బతిన్నాయి. ఇక పిల్లకాలువలు శిథిలావస్థకు చేరుకొని ఆనవాళ్లు లేకుండాపోయాయి.
శాశ్వత మరమ్మతు కరువు..
సరస్వతీ కాలువ మరమ్మతులు ఆరేడేళ్ల క్రితం చేపట్టారు. అయితే పనుల పర్యవేక్షణ సరిగా లేక చేసిన పనులు అధ్వానంగా మారాయి. దీంతో భారీ వర్షాలకు తోడు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వంటి వాటి వల్ల ప్రధాన కాలువ కోతకు గురవుతోంది. గతంలో మామడ మండలం చందారం వద్ద, కొరిటికల్ వద్ద, లక్ష్మణచాంద మండలం బాబాపూర్ వద్ద, నిర్మల్ మండలం సోఫీనగర్ శివారులో ప్రధాన కాలువ కోతకు గురైంది. దీంతో కాలువ కింద ఉన్న పంట భూముల్లోకి నీరంతా వెళ్లి దెబ్బతిన్నాయి. ఇక కోతకు గురైన చందారం, కొరిటికల్ వద్ద పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టలేదు. తాత్కాలికంగా సంచులు వేసి పనులు కానిచ్చేశారు.
ఏటా చివరి ఆయకట్టుకు ప్రశ్నార్థకమే..
ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీలతోపాటు పిల్లకాలువలు దెబ్బతినడంతో ఏటా చివరి ఆయకట్టు రైతాంగానికి నీరందడం ప్రశ్నార్థకంగా మారింది. లక్ష్మణచాంద మండలం పార్‌పెల్లి, చామన్‌పల్లి, మాచాపూర్, ధర్మారం గ్రామాల రైతులకు కాలువలు సక్రమంగా లేక నీరందడం లేదు. దీంతో రైతులు తీవ్ర వేదనలో పడిపోతున్నారు. మామడ మండలం పొన్కల్ గ్రామ రైతులైతే తమ పంటపొలాలకు నీరందించుకునేందుకు రేయింబవళ్లు కాలువ వద్దే ఉంటూ నీటిని మళ్లించుకునే పరిస్థితి ఎదురవుతోంది. ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా పంట పొలాలకు మాత్రం నీరందకపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు ఇలా ఉండడంతో ఈ రబీలో కూడా రైతులకు మళ్లీ కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు చేయించి రబీలో తమ పంటపొలాలకు నీరందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకొని తమ కష్టాలను గట్టెక్కించాలని రైతులు కోరుతున్నారు.
అయ్యో..సరస్వతీ..
Published Mon, Nov 18 2013 6:55 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement