ఉధృతంగా తాలిపేరు ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం అర్థరాత్రి నుంచి పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు తోతట్లు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళఖాతంలో 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఖమ్మం.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 72.10 మీటర్లకు చెరడంతో అధికారులు 16 గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 74, 440 క్యూసెక్కుల కాగా, ఔట్ ఫ్లో 75, 440 క్యూసెక్కుల చేరుతోంది. భారీ వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 404 అడుగులకు చేరింది. సత్తుపల్లిలోని జీవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో నీళ్లు చేరడంతో 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఆదివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా సత్తుపల్లిలో 5.04 సెం.మీ, పెనుబల్లిలో 5.86 సెం.మీ వేంసూరు 3.64, కల్లూరు 3.58 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఆసిఫాబాద్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టులోని నీటి ప్రవహం ఎక్కువగా ఉండటంతో 5 గేట్లు ఎత్తివేశారు. భారీ వర్షాలతో గుండివాగు, తుంపల్లివాగులు ఉప్పొంగుతున్నాయి. ఆసిఫాబాద్‌లోని ఎనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో డోర్లి 1, 2 ఖైరిగుడా ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిండు కుండలా ఉంది. ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
కరీంనగర్.. ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 20.175 టీఎంసీలకు కాను ప్రస్తుత నీటి మట్టం 18.50 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజుల్లో ప్రాజెక్టు పూర్తికి నీటి మట్టం చేరనుంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,60,190 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 80,023 క్యూసెక్కులు. జగిత్యాల జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఆత్యధికంగా బీర్పుర్, జైన, కోల్వాయిర్‌లో 28 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎండపల్లి, గుల్లోటలో 24 సెం.మీ, ధర్మపురిలో 22.9, సిరికోండ 22 సెం.మీల వర్షపాతం నమోదైంది. ధర్మపురి మండలం ఆయసాయిపల్లె వద్ద వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో 63వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
నిజామాబాద్.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటి సామర్ధ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.34 టీఎంసీలకు చేరింది. ఎగువన ఆదిలాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి వరద మరితం పెరిగే అవకాశం ఉంది. డిచ్‌పల్లి, భీమ్‌గల్, వేల్పుర్ మండలాల్లో ఆదివారం ఉదయం భారీ వర్షం నమోదైంది. బాన్సువాడ, బిర్కూర్, నసురుల్లబాద్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. మెండొరా మండలంలో 105.2 మి.మీ, శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో 80 మి.మీ వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment