
‘గట్టు’ కీడు తలపెట్టెనోయ్!
ఇళ్లస్థలాల పూడికకు డ్రెయిన్ గట్ల తవ్వకం రూ.కోట్లు విడుదలైనా.. నిబంధనలకు తూట్లు పట్టించుకోని అధికారులు నేతల అండదండలతోనే నిర్వాకం
భీమవరం : సొంతలాభం కొంతమానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్.. వట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్.. అన్నారు ప్రముఖ కవి గురజాడ. ఆయన మాటలను ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఏమోగానీ స్థానిక కాంట్రాక్టర్ సొంతలాభం కోసం ‘గట్టు’ కీడు తలపెట్టారు. ఇళ్ల స్థలాల పూడికకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిం చినా... అక్రమంగా డ్రెయిన్ల గట్లను తవ్వేస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు, అధికారపార్టీ నేతలు వత్తాసు పలు కుతున్నారు. భీమవరం పట్టణంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఎమ్మె ల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రోత్సాహంతో స్థానికంగా 82 ఎకరాలు, భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో సుమారు 16.50 ఎకరాలు సేకరించారు. ఈ భూములను మెరక చేసి లబ్ధిదారులకు అందించాల్సిన సమయంలో ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ స్థలాల మెరక చేపట్టకపోవడంతో ఇళ్లస్థలాల పట్టాల కోసం పేదలు అధికారపార్టీ నేతలపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎట్టకేలకు మెరక పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
రూ. ఏడు కోట్లు మంజూరు చేసినా...
భీమవరంలో కేటాయించిన 82 ఎకరాల మెరకకు రూ.ఏడు కోట్లు విడుదలయ్యాయి. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మట్టిని ఇతర ప్రాంతాల నుంచి సేకరించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా యనమదుర్రు, గొంతేరు డ్రయిన్ల గట్లను కొల్లగొట్టి మెరక పనులు చేస్తున్నారు. దీనివల్ల గట్లు బలహీనమవుతున్నాయి. వర్షాకాలంలో యనమదుర్రు, గొంతేరు డ్రెయిన్లు పొంగిప్రవహిస్తుంటాయి. ఒక్కొక్కసారి గట్లకు గండ్లుపడి డ్రెయిన్ వెంబడి పొలాలు, గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ నేపథ్యంలో డ్రెయిన్లలోని మట్టిని తీసి గట్లను పటిష్టం చేయాల్సి ఉండగా, గట్లను బలహీనం చేసి ఇళ్లస్థలాల మెరకకు తరలించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గట్లను కొల్లగొట్టి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా.. డ్రెయినేజీ శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మట్టి తరలింపునకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనధికారిక అనుమతులిచ్చినట్టు తెలుస్తోంది.
అవసరం దృష్ట్యా అనుమతి
భీమవరంలో పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాల మెరక అవసరం దృష్ట్యా గొంతేరు డ్రెయిన్ గట్టు మట్టిని తోలుకునేందుకు అవకాశమిచ్చినట్టు డ్రెయినేజీ శాఖ ఈఈ డి.వెంకటరమణ చెప్పారు. మత్స్యపురి వద్ద గతంలో గొంతేరు డ్రెయిన్‌లో పూడిక తొలగింపు పనులు చేయించామని, ఆ మట్టి ఎక్కువగా ఉండడంతో దానిని గట్టుపై గుట్టగా వేశామని, ప్రస్తుతం గట్టువద్ద అంత మట్టి అవసరం లేనందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దానిని తోలుకునేందుకు అనుమతి ఇచ్చామని చెప్పుకొచ్చారు.
సీఏడీ భూముల మట్టీ తరలింపు
నిబంధనల ప్రకారం.. సీఏడీ(సర్కార్ అగ్రికల్చర్ డవలప్‌మెంట్) భూముల్లోనూ తవ్వకాలు జరపకూడదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయి. భీమవరం మండలంలోని సుమారు 15వేల ఎకరాల సీఏడీ భూములుండగా, 800 ఎకరాలు ఇప్పటికే చెరువులుగా మారాయి. ఈ మండలంలోని గొల్లవానితిప్పలో కేటాయించిన ఇళ్లస్థలాల మెరక కోసం ఆ గ్రామ పరిసరాల్లోని సీఏడీ భూములను కొంతమంది అధికారపార్టీ నేతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఒకటి, రెండు రోజులు తవ్వకాలు ఆపేసి తరువాత మళ్లీ చేస్తున్నారు. దీనిపై అధికారపార్టీ నేతలను అడుగుతుంటే దాళ్వా వరి సాగు కీలక దశలో ఉన్నందున మట్టి అందుబాటులో లేకనే డ్రెయిన్ల గట్లను, సీఏడీ భూముల మట్టిని వినియోగిస్తున్నట్టు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. అయితే మెరకకు మట్టిని ప్రభుత్వమే సమకూర్చితే కాం ట్రాక్టర్‌కు అంతపెద్దమొత్తం ఎందుకివ్వాలని, దీనిలో నేతలకూ వాటాలున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది.