- రైతు, డ్వాక్రా రుణమాఫీలో చంద్రబాబు మాట తప్పడంపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు
- నేటి నుంచి మూడు రోజులు గ్రామాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మల దహనం
- రైతులు, ఐకేపీ మహిళలు తరలిరావాలని పిలుపు
రైతులను, డ్వాక్రా మహిళలను నమ్మించి మోసం చేసిన చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. వ్యవసాయ, బంగారు రుణాలు పూర్తిగా మాఫీ చేసి రైతులను, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీచేసి మహిళలను ఆదుకుంటామని చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు ఈ హామీలపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. దీనికి నిరసనగా గురువారం నుంచి మూడు రోజులపాటు ‘నరకాసురవధ’ పేరుతో గ్రామాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇచ్చిన మాటను నిలుపుకోవాలని చంద్రబాబు సర్కారుపై ఒత్తిడి పెంచనున్నారు.
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని, ఏ ఒక్కరూ చెల్లించొద్దని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రతి సభలోనూ చెప్పారు. బాకీ మాఫీ అయితే కష్టాల నుంచి గట్టెక్కవచ్చని రైతులు, మహిళలు భావించారు. టీడీపీకి ఓట్లేసి బాబును ముఖ్యమంత్రి పీఠమెక్కించారు. ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా గద్దెనెక్కాక చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నారు. బకాయిలను పూర్తిగా చెల్లించకుండా షరతులు విధించారు.
రుణమేదైనా కుటుంబంలో ఒక్కటి మాత్రమే మాఫీ చేస్తానని బాంబు పేల్చారు. అంతటితో ఆగక పంట రుణాలైతే రూ.1.50 లక్షల వరకు, బంగారు రుణాలైతే రూ.50వేల వరకు, డ్వాక్రా రుణాలైతే ఒక్కో మహిళకు 10 వేల రూపాయలు మాత్రమే మాఫీ చేస్తానని తేల్చిచెప్పారు. ఈ మాటలతో రైతులు, డ్వాక్రా మహిళలు ఖంగుతిన్నారు. ఇలా నమ్మించి గొంతుకోస్తాడని ఊహించలేదని మండిపడ్డారు.
రైతులు, మహిళలకు అండగా వైఎస్సార్ సీపీ పోరుబాట
ఏ మాట ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నారో దాన్ని నెరవేర్చని చంద్రబాబు సర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. గురువారం నుంచి మూడు రోజులు గ్రామ, మండలాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లాలోని 66 మండలాల పరిధిలోని గ్రామాల్లో ఆందోళనలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. ‘నరకాసురవధ’ పేరుతో దిష్టిబొమ్మలు దహనం చేయనున్నారు.
అన్ని పార్టీలూ కలిసి రావాలి
చంద్రబాబు ప్రజలను నమ్మించి గొంతు కోసినంత పనిచేశారు. లక్షల రూపాయల రుణభారంతో రైతులు అల్లాడిపోతున్నారు. వారి ఓట్లతో గెలిచి అధికారం దక్కించుకున్న తర్వాత రుణమాఫీ చేయకపోవడం దారుణం. ఏం చేయకుండానే రుణమాఫీ చేసినట్లుగా టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు. మాట మేరకు రుణమాఫీ చేసే వరకూ రైతులు, మహిళలకు అండగా వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. ప్రతి గ్రామంలోనూ ఆందోళనలు చేస్తుంది. ప్రజల కోసం చేస్తున్న ఈ ఆందోళనలకు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూడా కలిసిరావాలి.
-నారాయణస్వామి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ
మహిళలకు అండగా ఉంటాం
డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు పదేపదే చెప్పారు. ఆయన సంతకంతో ఉన్న కరపత్రాలను ఇంటింటికీ పంచారు. రుణాలు మాఫీ అయితే అప్పుల ఊబి నుంచి గట్టెక్కవచ్చని మహిళలు ఓట్లేశారు. ఇప్పుడు సంఘానికి లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తానంటున్నారు. తక్కిన 3, 4 లక్షల రూపాయలను ఎవరు మాఫీ చేయాలి. పైగా ఆ ఇంట్లో వ్యవసాయ రుణం మాఫీ చేస్తే డ్వాక్రా రుణాలు మాఫీ చేయరట. చెప్పిందకొకటి చేసేదొకటి. మోసం చేసిన చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టేందుకు మహిళలంతా కలిసిరావాలి.
-గాయత్రీ దేవి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ
రైతులకు అండగా నిలుస్తాం
సీఎం చంద్రబాబునాయుడు రైతుల రుణాలను మాఫీ చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తాం. రైతులకు న్యాయం జరిగేలా ఎన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. గురువారం నుంచి చేపట్టే కార్యక్రమాలకు రైతులు కలిసిరావాలి.
-ఆదికేశవులురెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ