నరసన్నపేట రూరల్( పోలాకి) : పోలాకి మండలంలోని పలు తీర ప్రాంత గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు అంగీకరించడం లేదు. మేం గ్రామాల్లోనే ఉంటామంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల ఎదుట స్పష్టం చేసిన సంఘటన శనివారం సంభవించింది. హుదూద్ తుపాను నేపథ్యంలో తీరగ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఎంతటి తుపాను వచ్చినా మేం గ్రామాలను కదలమని, ఇళ్లలోనే ఉంటామని మత్య్సకారులు అంటుండటంతో అధికారులకు ఏమీ పాలు పోవడం లేదు. మండలంలోని రేవు అంప్లాం,కొత్తరేవు, కోడూరుల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కోడూరు కేంద్రానికి రావాలని గుప్పడిపేట, గుల్లవానిపేట,రాజపురం గ్రామాలకు చెందిన ప్రజలకు ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గ్రామాలను వదిలిరామని చెప్పడంతో అధికారులు నిరాశతో వెనుదిరిగారు. గతంలో పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు పడ్డామని ఇళ్లలోనే బాగుంటుందని వాదిస్తున్నారు. తుపాను తీవ్ర అధికంగా ఉన్నందున అధికారులకు సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. శనివారం ఆయన తీర గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. రాత్రి నుంచి తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని, చాలా ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరించారు. నరసన్నపేట సీఐ చంద్ర శేఖర్ తదితరులు కూడా ప్రజలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. తహశీల్దార్ రామారావు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో పాల ప్యాకెట్‌లు, కిరోసిన్, తాగు నీరు, బియ్యం, పప్పులు, గ్యాస్‌లతో పాటు అవసరమైన సరుకులు సిద్ధం చేశామన్నారు.
పునరావాస కేంద్రాలకు రాని ప్రజలు
పూండి: వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు బాధితులు చేరుకోవడం లేదు. అధికారులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ శనివారం రాత్రి 7 గంటల వరకు ఇళ్లను వదిలి వచ్చేందుకు వారు అంగీకరించలేదు. దీంతో అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వజ్రపుకొత్తూరు, పీఎంపురం, పాతటెక్కలి, గరుడభద్ర, గోవిందపురం పునరావాస కేంద్రాల్లో 500 బందికి వంటలు సిద్ధం చేశారు. రాత్రికి పరిస్థితి మారితే బలవంతంగా తరలించేందుకు చర్యలు తీసుకుంటామని తుపాను ప్రత్యేకాధికారులు డీఆర్‌డీఏ ఏపీడీ, పంచాయితీరాజ్ ఈఈ ఆర్. వరప్రసాద్ బాబు టి.సరోజ చెప్పారు. పునరావాస కేంద్రాల్లో 5 వేల లీలర్ల మంచి నీటి ట్యాంక్‌లు సిద్ధం చేశామని ఆర్‌డబ్ల్యూస్ డీఈఈ డి. సూర్యనారాయణ, ఏఈఈ టి.గౌతమి చెప్పారు. వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ కె.రవికిషోర్ పూడి లంక వాసులును పీఎంపురం పునరావాస కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు.
కేంద్రాలకు వచ్చేందుకు ససేమిరా..!
ఎచ్చెర్ల: తుపాను పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు మండలంలోని పలు తీరప్రాంత గ్రామాల ప్రజలు ఇష్టపడడం లేదు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంత నచ్చజెప్పినా ఇళ్లు విడిచి వచ్చేందుకు ముందుకు రావ డం లేదు. ప్రత్యేకాధికారి కె.మనో రమ, తహశీల్దార్ బందర వెంకటరావు, ఎస్‌ఐ ఉదయ్ కుమార్ శనివారం రాత్రి వరద ముప్పు ఉన్న గ్రామాల ప్రజ లను పునరావాస ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. అయినా వారు అంగీకరించక పోవడంతో వాహనాలను గ్రామాల్లో మొహ రించారు. అత్యవసర పరిస్థితి వస్తే అర్థరాత్రయినా తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బొంతల కోడూరు పంచాయతీ లావేటి పేట, రుప్ప పేట, పాత దిబ్బలపాలేం, డిమత్స్య లేశం, బడివానిపేట, బుడగుట్లపాలేం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలో 1400 మంది ప్రజలకు సరిపడా భోజనాన్ని వండారు. ఎమ్మెల్యే కళావెంకటరావు బడివాని పేట సహాయ కేంద్రాన్ని పరిశీలించారు.
సగం మందే పునరావాస కేంద్రాలకు..
ఇచ్ఛాపురం: తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు శనివారం సాయంత్రం తరలించారు. అయితే మొత్తం 5 గ్రామాలకు సంబంధించి సుమారు 4,500 మందికి గాను 2 వేల మంది కూడా తరలి వెళ్లలేదు. చిన్నలక్ష్మీపురం,పెద్ద లక్ష్మీపురం, శివకృష్ణాపురం గ్రామాల నుంచి ప్రజలను ఈదుపురం పునరావాస కేంద్రాలకు తరలించారు. పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రానికి మరికొందరిని ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ముందు వచ్చేందుకు నిరాకరించిన తరువాత అధికారుల విజ్ఞప్తి మేరకు పునరావాస కేంద్రాలకు బయలుదేరారు. డొంకూరు గ్రామ ప్రజలు మాత్రం వచ్చేందుకు నిరాకరించారు. దాంతో అత్యవసరమైతే వారిని తరలించేందుకు బస్సులను అక్కడ సిద్ధంగా ఉంచారు. వాటితో పాటు సుమారు పది స్విమ్మింగ్ బోట్లు కూడా సిద్ధం చేశారు.
పునరావాస కేంద్రాలకు ససేమిరా..!
Published Sun, Oct 12 2014 3:14 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
Advertisement
Advertisement