అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దివ్య కల్యాణ మహోత్సవం బుధవారం జరగనుంది. కల్యాణోత్సవం నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధార కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి గరుడ వాహనంపై, సీతారాములను పల్లకిలో ఊరేగిస్తారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు రామాలయం పక్కనే ఉన్న వేదికపై సత్యదేవుని దివ్య కల్యాణం ప్రారంభం అవుతుంది. ఇందుకోసం భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.