
ఎస్‌బీఐలో క్యాషియర్ చేతివాటం
బద్వేలు అర్బన్: భారతీయ స్టేట్‌బ్యాంక్ బద్వేలు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నాగశేఖర్‌రెడ్డి చేతివాటం ప్రదర్శించారు. కొంద రి ఖాతాదారుల అకౌంటు నుంచి సుమారు రూ.14లక్షలు నగదు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో మరో రూ.5లక్షలు గల్లంతు చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంక్ మేనేజర్ సామ్య విచారణ చేపట్టి సదరు ఉద్యోగిపై బుధవారం బద్వేలు అర్బన్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటప్ప తెలిపిన వివరాల మేరకు..
మైదుకూరు సమీపంలోని దువ్వూరు మండలం కానగూడూరు గ్రామానికి చెందిన ఎ. నాగశేఖర్‌రెడ్డి గత ఏడాది ఫిబ్రవరి 26వ తేదీన ఎస్‌బిఐ బద్వేలు బ్రాంచ్‌లో కస్టమర్ అసిస్టెంటుగా విధులలో చేరారు. అయితే ఈ ఏడాది మే,జూన్ నెలలో కోనేరు లక్ష్మిదేవి ఖాతా నుంచి రూ.5.88లక్షలు, జాండ్లవరం వెంకటసుబ్బయ్య ఖాతా నుంచి రూ.7.20లక్షలు, కోనేటి గుర్రమ్మ ఖాతా నుంచి రూ.2.02లక్షలు మొత్తం రూ.14.74 లక్షలు డ్రా చేసుకున్నారు.
అలాగే ఫిక్స్‌డ్ డిపాజిట్లపేరుతో పడిగపాటి కళ్యాణ్ నుంచి లక్ష, పి. రామక్రిష్ణారెడ్డి నుంచి లక్ష, పి.వెంకటసుబ్బారెడ్డి నుంచి లక్ష, కళ్యాణి నుంచి రూ.50వేలు, వెంకటల క్షుమ్మ నుంచి రూ.50వేలు చొప్పున రూ.4లక్షల మేర నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి మోసగించారు. ఈ విషయం తెలియడంతో ఎస్‌బిఐ రీజినల్ మేనేజర్ జె.ఎస్.ఆర్. ప్రసాద్ ఆదేశాల మేరకు బద్వేలు బ్రాంచ్ మేనేజర్ ఎం.సామ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగశేఖర్‌రెడ్డి జూలై నెల 17వ తేదీ నుంచి విధులకు కూడా హాజరు కానట్లు తెలిసింది. బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఎస్‌ఐ నాగమురళి తెలిపారు.