జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం
శ్రీకాకుళం అర్బన్: ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించాలన్నారు. జూన్ 30 నాటికి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, వికలాంగ అభ్యర్థుల ఖాళీల భర్తీకి తగు చర్యలు చేపట్టాలన్నారు.
డీఆర్‌డీఏ- వెలుగులో బ్యాంకులకు తిరిగి చెల్లింపులు చేయని స్వయం సహాయక సంఘాల వివరాలు తదితర అంశాలపై నివేదిక అందజేయాలని ఏపీడీ వై.వి.రమణమూర్తిని ఆదేశించారు. సీఎంఆర్ బియ్యంను గిడ్డంగిలకు తరలించే అంశంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జె.సీతారామారావును ఆదేశించారు. రెండవ పంటలో ఇప్పటి వరకూ 25,387 మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చిందని జిల్లా మేనేజర్ తెలియజేయగా వాటిని సక్రమంగా నిల్వచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు, రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీకి ప్రణాళిక రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు
Published Tue, Jun 9 2015 1:20 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement