backlog of posts
-
ముందు లిమిటెడ్.. తరువాత రెగ్యులర్ డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముందుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి లిమిటెడ్ డీఎస్సీ నిర్వహించనున్నారు. గత డీఎస్సీల్లో మిగిలిపోయిన రిజర్వుడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం విద్యాశాఖకు మార్చిలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుత టీచర్ల బదిలీల ప్రక్రియ అనంతరం ‘లిమిటెడ్ డీఎస్సీ’ని నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా బ్యాక్లాగ్ పోస్టులను రోస్టర్ వారీగా కేటాయించి లిమిటెడ్ డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లిమిటెడ్ డీఎస్సీకి 403 బ్యాక్లాగ్ పోస్టులను అధికారులు గుర్తించారు. ఈ లిమిటెడ్ డీఎస్సీ వల్ల ముందు ఆయా వర్గాల వారికి మేలు చేకూరనుంది. ఆ పోస్టులకు అర్హులైన ఆ కేటగిరీ అభ్యర్థులు లేకపోతే వాటిని జనరల్ కోటాలో తదుపరి డీఎస్సీలో భర్తీచేసే అవకాశాలున్నాయి. 2019 స్పెషల్ డీఎస్సీలో 78 పోస్టులు ఖాళీ 2019 స్పెషల్ డీఎస్సీలో మిగిలిన పోస్టులకు ప్రత్యే క నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అప్పట్లో 600కు పైగా పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 78 పోస్టులు మిగిలిపోయాయి. వాటి భర్తీకి ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇవి పూర్తయిన తరువాత రెగ్యులర్ డీఎస్సీకి చర్యలు తీసుకోనున్నారు. ఈ డీఎస్సీకి ముందుగా టీచర్ ఎలిజిబు లిటీ టెస్టు (టెట్) నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈసారి టెట్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఈ కసరత్తు చేస్తోంది. టెట్ అనంతరం రెగ్యులర్ డీఎస్సీని నిర్వహించే అవకాశాలున్నాయ ని తెలిపారు. బదిలీలు పూర్తయితే ఈ డీఎస్సీకి ఎన్ని పోస్టులో తేలనుంది. 2020–21 విద్యాసంవత్సరం కోసం 8,700 కొత్త పోస్టులను నోటిఫై చేయాలని విద్యాశాఖ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఇటీవల 2018 డీఎస్సీకి సంబంధించి మూడువేల ఎస్జీటీ పోస్టులను భర్తీచేశారు. ప్రస్తుత బదిలీల్లో గ్రామీణ ప్రాంత స్కూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేసినట్లు మంత్రి ప్రకటించినందున ఆ మేరకు రానున్న డీఎస్సీకి పోస్టులు అందుబాటులో ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎక్కడ ఎంతమేర అవసరముందో విద్యాశాఖ ప్రతిపాదనలు ఇస్తే ప్రభుత్వ అనుమతితో ఆమేరకు టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించే అవకాశముంటుంది. -
ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు
జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం శ్రీకాకుళం అర్బన్: ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం ఆదేశించారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం అనంతరం వివిధ అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాక్లాగ్ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సేకరించాలన్నారు. జూన్ 30 నాటికి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, వికలాంగ అభ్యర్థుల ఖాళీల భర్తీకి తగు చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్డీఏ- వెలుగులో బ్యాంకులకు తిరిగి చెల్లింపులు చేయని స్వయం సహాయక సంఘాల వివరాలు తదితర అంశాలపై నివేదిక అందజేయాలని ఏపీడీ వై.వి.రమణమూర్తిని ఆదేశించారు. సీఎంఆర్ బియ్యంను గిడ్డంగిలకు తరలించే అంశంపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జె.సీతారామారావును ఆదేశించారు. రెండవ పంటలో ఇప్పటి వరకూ 25,387 మెట్రిక్ టన్నుల బియ్యం వచ్చిందని జిల్లా మేనేజర్ తెలియజేయగా వాటిని సక్రమంగా నిల్వచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు, రైతులకు విత్తనాలు, ఎరువులు పంపిణీకి ప్రణాళిక రూపొందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.