అరచేతిలో పథకం
ఎన్నికలు వస్తే చాలు తిరుపతిపై ఆయన చాలా ప్రేమ కురిపిస్తారు. వందల వేల కోట్ల పథకాలకు హామీలు ఇస్తారు. ఆ తర్వాత తిరుపతివాసులకు మిగిలేది గుండు సున్న మాత్రమే. ఆయన పేరు చింతా మోహన్. తిరుపతి పార్లమెంట్ సభ్యులు.
సాక్షి, తిరుపతి:
చింతా మోహన్ అరచేతి లో స్వర్గం చూపుతున్నారు. ఆయ న చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. వందలు వేల కోట్ల రూపాయలతో కొత్త కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇట్టే ప్రకటిస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెచ్చినట్టు చెప్పుకుంటారు. వీటిలో చాలా వాటికి క్షేత్రస్థాయిలో దిక్కూమొక్కూ ఉండదు. కొన్ని మాత్రం మొక్కుబడిగా అమల్లో ఉంటాయి. అధికారులను నయానోభయానో గుప్పెట్లోకి తెచ్చుకుని తాను ఏదో చేస్తున్నట్టు వారి చేత కూడా చెప్పిస్తారు. అక్కరకు రాకపోతే వారిపైనే అభాండాలు వేయడానికి వెనుకాడరు. జిల్లా స్థాయి ముఖ్యమైన సమావేశాలను ఇందుకు వేదిక చేసుకుంటారు. ఆ సమావేశాల్లో సంబంధిత అధికారులపై విమర్శలు గుప్పించి వారిని చులకన చేయడం, వివాదాస్పదం చేయడం ఆయనకు మహా సరదా అంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు అంతే ఉండదు. ఆ హామీలను నెరవేర్చడంలో ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించక తప్పదు. మహానేత
వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో తిరుపతి కార్పొరేషన్‌కు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసింది. ఆయన మరణానంతరం ఆ పథకం అమలు నీరుగారిపోయింది. ప్రస్తుతం ఇందిరా ఆవాస్ యోజన కింద 7,004 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలో భాగమే. అయితే దీనిని కొత్త పథకంగా సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కాగా తిరుపతి నగరానికి సంబంధించి చింతామోహన్ ఇచ్చిన హామీలు, అమల్లోకి వచ్చిన అంశాలు మచ్చుకు కొన్ని ...
హామీలు...
రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరిస్తాం.
తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్‌స్టేడియం ఏర్పాటు.
రూ.400 కోట్లతో తిరుపతి నగరాభివృద్ధికి కృషి(కిందటి ఏడాది తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో)
మహిళా సంఘాల ద్వారా టీడీడీకి చక్కెర కొనుగోలు అప్పగింత.
తిరుమలలో నిరుపేదలకు షాపుల కేటాయింపు, స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో మహిళలకు మెడికల్ షాపుల నిర్వహణకు అనుమతి..
నెరవేర్చిన తీరు...
రేణిగుంట విమానాశ్రయం ఆధునికీకరణ ఏ మాత్రం ముందుకు సాగలేదు. కేవలం రాత్రివేళల్లో విమానాల ల్యాండింగ్‌కు పరిమితం.
తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. కేవలం మోడల్ స్టేషన్‌కు పరిమితం చేశారు.
ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఊసే లేదు.
రూ.400 కోట్లు కాదు కదా ప్రత్యేకంగా నాలుగు రూపాయలు తెచ్చిన దాఖలాలు లేవు.
టీటీడీకి చక్కెర కొనుగోలు బాధ్యత మహిళలకు అప్పగించే విషయంలో పురోగతి శూన్యం.
తిరుమలలో షాపులు, స్విమ్స్, రుయాల్లో మెడికల్ షాపుల కేటాయింపుల్లోనూ చర్యలు లేవు.