tirupathi railway station
-
భారత్ బంద్ ఎఫెక్ట్: విజయవాడలో స్పెషల్ రోబో టీమ్స్ ఏర్పాటు
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ పార్టీలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వెళ్లే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. భారత్ బంద్ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్లోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
బోసిపోయిన తిరుపతి రైల్వే స్టేషన్
తిరుపతి అర్బన్: సంక్రాంతి పండుగ సెలవులకు నగర జనం పూర్తిగా పల్లెలకు వెళ్లడంతో తిరుపతి రైల్వే స్టేషన్ ఆదివారం బోసిపోయి కనిపించింది. సాధారణంగా శని, ఆదివారాల్లో ఏ సమయంలోనైనా ఈ రైల్వే స్టేషన్ సాధారణ ప్రయాణికులు, యాత్రికులతో కిటకిటలాడుతుంటుంది. కానీ ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు రావాల్సిన వారి సంఖ్య, తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి రైల్వే స్టేషన్ ద్వారా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లేవారి సంఖ్య రెండు రోజులుగా బాగా తగ్గింది. దీంతో స్టేషన్‌లోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కార్యాలయం, ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాళ్లు ప్రయాణికులు లేక వెలవెలపోయాయి. ఫ్లాట్‌ఫాంలపై, స్టేషన్ సమీపంలో వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉండడంతో ఎప్పుడూ బిజీగా ఉండే వ్యాపారులు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. రైల్వే పోర్టర్లు రోజూ యాత్రికుల రాకతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. సంక్రాంతి నేపథ్యంలో వరుసగా వారం రోజులు సెలవులు రావడంతో పిల్లాపాపలతో కలిసి అన్నివర్గాల ప్రజలు గ్రామాలకు వెళ్లడంతో తిరుపతి-తిరుమలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. బుకింగ్ కౌంటర్లలో సిబ్బంది కూడా గంటలతరబడి ఖాళీగా కనబడుతున్నారు. కాగా, తిరుమలకు వెళ్లే ప్రయాణికులు రాని కారణంగా ఆదాయం కూడా బాగా తగ్గిందని రైల్వే వర్గాల సమాచారం. -
కొత్త కళ వచ్చేనా?
తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి ఎన్నడు? ఆదాయానికి తగ్గ ప్రాధాన్యం లభించేనా.. నేడు పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: వరల్డ్‌క్లాస్ స్థాయిలో తిరుపతి రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తామంటూ రైల్వేశాఖ ప్రకటించి నాలుగేళ్లయింది. ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అనంతరం మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామంటూ తిరుపతి పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రులు ప్రకటిస్తూ వచ్చారు. బుధవారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో ఈ సారైనా తిరుపతి రైల్వే స్టేషన్‌కు ప్రాధాన్యం లభిస్తుందని తిరుపతివాసులు ఆశిస్తున్నారు. దక్షిణమధ్య రైల్వేకి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న స్టేషన్‌గా తిరుపతికి పేరుంది. ప్రతిసారీ రైల్వే మంత్రి, సహాయ మంత్రి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉండడంతో దాదాపు దక్షిణమధ్య రైల్వే జోన్‌కు తీరని అన్యాయమే జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం రైల్వే సహాయ మంత్రిగా రాయలసీమకు చెందిన ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. ఈయన బాధ్యతలు చేపట్టి ఏడాది దాటినా తిరుపతి స్టేషన్ అభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం. జిల్లాలోని ప్రధాన రైల్వే సమస్యలు తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 15వేల మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు ఉన్నారు. వీరి కోసం తిరుపతిలో రైల్వే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సి ఉంది. తిరుపతి స్టేషన్లో ప్రయాణికుల భద్రతకు సరిపడా మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు లేవు. తిరుపతిలోని మెకానికల్, సేఫ్టీ, రైల్వే పోలీస్, ఎలక్ట్రికల్, శానిటరీ విభాగాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు శుభ్రమైన నీరు అందడం లేదు. తిరుపతి రైల్వేస్టేషన్‌కు నిత్యం వేలమంది వచ్చి పోతుంటారు. వీరు స్టేషన్ వద్ద తమ వాహనాలను పార్క్ చేసుకునేందుకు ప్రత్యేకంగా స్థలం లేదు. చిత్తూరు మార్గంలోని జాతీయ రహదారిపై మూడు చోట్ల రైల్వే గేట్లు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. పాకాల, మదనపల్లె, శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్లలో ఒకే రిజర్వేషన్ కౌంటర్ ఉండడంతో ప్రయాణికులు టిక్కెట్ల కొనుగోలులో అవస్థలు పడుతున్నారు. కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలి తిరుపతి నుంచి షిరిడీకి వారంలో రెండురోజుల పాటు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి. దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని పుణ్య స్థలాలను సందర్శించేందుకు వీలుగా ‘తీర్థా స్పెషల్’ రైలును తక్షణం ఏర్పాటు చేయాలి. శ్రీకాళహస్తి నుంచి మదన పల్లె లేదా నెల్లూరు నుంచి మదనపల్లె వరకు ప్యాసింజర్ రైలు ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు. దీనిని అమలు చేయాలి. తిరుపతి-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి. {పస్తుతం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు పాకాల, ధర్మవరం మార్గంలో నడుస్తున్న రైళ్ల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలి. కడప నుంచి మదనపల్లె మీదుగా బెంగళూరు వరకు ఏర్పాటు చేయనున్న కొత్త రైల్వేలైన్‌కు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలి. తిరుపతి నుంచి తమిళనాడులోని వేలూరు వరకు డబ్లింగ్ రైల్వేట్రాక్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలి. శ్రీకాళహస్తి నుంచి నడికుడి వరకు కొత్త రైల్వేలైన్ పనులను త్వరగా పూర్తి చేయాలి. -
అరచేతిలో పథకం
ఎన్నికలు వస్తే చాలు తిరుపతిపై ఆయన చాలా ప్రేమ కురిపిస్తారు. వందల వేల కోట్ల పథకాలకు హామీలు ఇస్తారు. ఆ తర్వాత తిరుపతివాసులకు మిగిలేది గుండు సున్న మాత్రమే. ఆయన పేరు చింతా మోహన్. తిరుపతి పార్లమెంట్ సభ్యులు. సాక్షి, తిరుపతి: చింతా మోహన్ అరచేతి లో స్వర్గం చూపుతున్నారు. ఆయ న చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. వందలు వేల కోట్ల రూపాయలతో కొత్త కొత్త పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇట్టే ప్రకటిస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెచ్చినట్టు చెప్పుకుంటారు. వీటిలో చాలా వాటికి క్షేత్రస్థాయిలో దిక్కూమొక్కూ ఉండదు. కొన్ని మాత్రం మొక్కుబడిగా అమల్లో ఉంటాయి. అధికారులను నయానోభయానో గుప్పెట్లోకి తెచ్చుకుని తాను ఏదో చేస్తున్నట్టు వారి చేత కూడా చెప్పిస్తారు. అక్కరకు రాకపోతే వారిపైనే అభాండాలు వేయడానికి వెనుకాడరు. జిల్లా స్థాయి ముఖ్యమైన సమావేశాలను ఇందుకు వేదిక చేసుకుంటారు. ఆ సమావేశాల్లో సంబంధిత అధికారులపై విమర్శలు గుప్పించి వారిని చులకన చేయడం, వివాదాస్పదం చేయడం ఆయనకు మహా సరదా అంటే అతిశయోక్తి కాదు. ఇక ఎన్నికల ముందు ఇచ్చే హామీలకు అంతే ఉండదు. ఆ హామీలను నెరవేర్చడంలో ఆయన చిత్తశుద్ధిని ప్రశ్నించక తప్పదు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో తిరుపతి కార్పొరేషన్‌కు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసింది. ఆయన మరణానంతరం ఆ పథకం అమలు నీరుగారిపోయింది. ప్రస్తుతం ఇందిరా ఆవాస్ యోజన కింద 7,004 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం జేఎన్ఎన్యూఆర్ఎంలో భాగమే. అయితే దీనిని కొత్త పథకంగా సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. కాగా తిరుపతి నగరానికి సంబంధించి చింతామోహన్ ఇచ్చిన హామీలు, అమల్లోకి వచ్చిన అంశాలు మచ్చుకు కొన్ని ... హామీలు... రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరిస్తాం. తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్స్టేడియం ఏర్పాటు. రూ.400 కోట్లతో తిరుపతి నగరాభివృద్ధికి కృషి(కిందటి ఏడాది తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో) మహిళా సంఘాల ద్వారా టీడీడీకి చక్కెర కొనుగోలు అప్పగింత. తిరుమలలో నిరుపేదలకు షాపుల కేటాయింపు, స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో మహిళలకు మెడికల్ షాపుల నిర్వహణకు అనుమతి.. నెరవేర్చిన తీరు... రేణిగుంట విమానాశ్రయం ఆధునికీకరణ ఏ మాత్రం ముందుకు సాగలేదు. కేవలం రాత్రివేళల్లో విమానాల ల్యాండింగ్‌కు పరిమితం. తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. కేవలం మోడల్ స్టేషన్‌కు పరిమితం చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఊసే లేదు. రూ.400 కోట్లు కాదు కదా ప్రత్యేకంగా నాలుగు రూపాయలు తెచ్చిన దాఖలాలు లేవు. టీటీడీకి చక్కెర కొనుగోలు బాధ్యత మహిళలకు అప్పగించే విషయంలో పురోగతి శూన్యం. తిరుమలలో షాపులు, స్విమ్స్, రుయాల్లో మెడికల్ షాపుల కేటాయింపుల్లోనూ చర్యలు లేవు. -
హైదరాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో ఆధునిక సదుపాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్, తిరుపతి సహా దేశవ్యాప్తంగా 24 ముఖ్యమైన రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి అధిర్‌రంజన్ చౌధురి తెలిపారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రైల్వేస్టేషన్లున్న ప్రదేశాల చారిత్రక నేపథ్యం, పర్యాటక ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటక మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఆధునీకరణ, సదుపాయాల వ్యయాన్ని రైల్వే, పర్యాటక శాఖలు భరిస్తాయన్నారు.