
తిరుపతి అర్బన్: సంక్రాంతి పండుగ సెలవులకు నగర జనం పూర్తిగా పల్లెలకు వెళ్లడంతో తిరుపతి రైల్వే స్టేషన్ ఆదివారం బోసిపోయి కనిపించింది. సాధారణంగా శని, ఆదివారాల్లో ఏ సమయంలోనైనా ఈ రైల్వే స్టేషన్ సాధారణ ప్రయాణికులు, యాత్రికులతో కిటకిటలాడుతుంటుంది. కానీ ఇతర ప్రాంతాల నుంచి తిరుమలకు రావాల్సిన వారి సంఖ్య, తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి రైల్వే స్టేషన్ ద్వారా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లేవారి సంఖ్య రెండు రోజులుగా బాగా తగ్గింది. దీంతో స్టేషన్‌లోని జనరల్ బుకింగ్, రిజర్వేషన్ కార్యాలయం, ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాళ్లు ప్రయాణికులు లేక వెలవెలపోయాయి. ఫ్లాట్‌ఫాంలపై, స్టేషన్ సమీపంలో వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉండడంతో ఎప్పుడూ బిజీగా ఉండే వ్యాపారులు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ గడిపారు.
రైల్వే పోర్టర్లు రోజూ యాత్రికుల రాకతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. సంక్రాంతి నేపథ్యంలో వరుసగా వారం రోజులు సెలవులు రావడంతో పిల్లాపాపలతో కలిసి అన్నివర్గాల ప్రజలు గ్రామాలకు వెళ్లడంతో తిరుపతి-తిరుమలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. బుకింగ్ కౌంటర్లలో సిబ్బంది కూడా గంటలతరబడి ఖాళీగా కనబడుతున్నారు. కాగా, తిరుమలకు వెళ్లే ప్రయాణికులు రాని కారణంగా ఆదాయం కూడా బాగా తగ్గిందని రైల్వే వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment