ఒంగోలు: సీఎం చంద్రబాబు పర్యటన జిల్లా వాసులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఆయన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు సైతం తిలోదకాలు ఇస్తూ అపప్రద మూటగట్టుకుంటున్నారు.
సీఎం శుక్రవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు నుంచే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఒక వైపు రవాణ శాఖ, మరో వైపు విద్యాశాఖ అధికారులు వెరసి తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజానీకం, విద్యాసంస్థల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. అందునా రెండు రోజుల సీఎం పర్యటన కావడంతో ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదీ..రవాణశాఖ అధికారుల తీరుముఖ్యమంత్రి పర్యటన అంటే ఎన్ని వాహనాలు కావాలో అన్ని వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యత జిల్లా రెవెన్యూ విభాగానిది. వాహనదారులు తీసుకొచ్చిన వాహనాలను
రవాణశాఖ అధికారులు తనిఖీ చేసి ఫిట్‌నెస్ బాగా ఉందని ధ్రువీకరించిన తర్వాతే వాటిని సీఎం టూర్‌కు అనుమతి ఇస్తారు. రవాణ శాఖ ఫిట్‌నెస్‌గానే ఉందని నిర్థారించిన తర్వాత వాటిని పోలీసుశాఖ స్వాధీనం చేసుకుంటుంది. సీఎం టూర్ ముగిసిన తర్వాత వాహనదారునికి ఒక్కో వాహనానికి అద్దె రూపంలో సంబంధిత మొత్తం చెల్లించాల్సిన బాధ్యత రెవన్యూ శాఖది. కానీ మన జిల్లాలో మాత్రం ఆది నుంచి వాహనాలు సమకూర్చడం, ఫిట్‌నెస్‌ను నిర్థారించి సీఎం కార్యక్రమం కోసం వాహనాలను పోలీసు శాఖకు అప్పగించడం మొత్తం వ్యవహారం రవాణాశాఖే చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు చోట్ల సీఎం పర్యటన ఉండడంతో వాహనాల కోసం రవాణ శాఖ అధికారులు రోడ్డెక్కారు. వాహనం ముచ్చటగా ఉందని భావిస్తే చాలు..
కారులో ఫ్యామిలీ ఉన్నా సరే అర్థాంతరంగా దించేసి సీఎం సభకు పెట్టాలంటూ హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించారు. ఒక్కో కాన్వాయ్‌కు 32 వాహనాల వరకు సమకూర్చాల్సి ఉంటుంది. వాటిలో అంబులెన్స్ తదితరాలు మినహాయిస్తే 20 వాహనాలు తప్పనిసరి. మార్టూరు మండలం నాగరాజుపల్లి, ఒంగోలు, వెలిగొండ మొత్తంగా మూడు కాన్వాయ్‌లకు కలిపి 60కుపైగా వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యత రవాణ శాఖ అధికారులు చేపట్టారు. అందులోనూ సీఎం కార్యక్రమం.. ఏ మాత్రం వాహనం ట్రబుల్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం లేకపోలేదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాలైతే రన్నింగ్ ఎలా ఉంటుందో అనే భావనతో ఎక్కువుగా ప్రైవేటు వాహనాలపై దృష్టి సారించారు. స్థానిక కర్నూల్ రోడ్డు బైపాస్ జంక్షన్‌లో వాహనాన్ని నిలిపి పత్రాలు సీజ్ చేసుకొని సీఎం సభకు పంపాలంటూ హెచ్చరికలు జారీ చేయడంతో ఓ డ్రైవర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిక్ వాహనాలను వదిలి పెట్టి ప్రైవేటు వాహనాలు పెట్టమని ఎలా హెచ్చరికలు జారీ చేస్తారంటూ అతడు అడ్డం తిరిగాడు. అంతే కాకుండా ఆయిల్ కొట్టించుకుని రవాణ శాఖ కార్యాలయంలో వాహనం ఉంచాలని ఆదేశించడం ఏంటి అంటూ మండిపడటం, ఇదే సమయంలో మీడియా అక్కడకు చేరుకోవడంతో రవాణ శాఖ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు.
పేరుకున్న బకాయిలు
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం నాలుగేళ్లలో జిల్లాకు సీఎం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్‌లకు సంబంధించి దాదాపు రూ.3.50 లక్షలు మాత్రమే విడుదలైనట్లు తెలుస్తోంది. ఇంకా రూ.6.50 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు వినికిడి. తాజాగా మరో మూడు కాన్వాయ్‌లకు నిధులు విడుదల కావాల్సి ఉండటం, మరో నాలుగు నెలల్లో ఎన్నికలు కూడా వస్తున్న దశలో వాహనాలను అద్దెకు తీసుకుంటే బకాయీల బెడద ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే రవాణ శాఖ అధికారులు ప్రైవేటు వాహనాలపై దృష్టి సారించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై రవాణ శాఖ అధికారులు మాత్రం ప్రైవేటు ముసుగులో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కింద నడుస్తున్న వాహనాలు ఉన్నాయని, సీఎం కాన్వాయ్ కోసం ప్రైవేటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవచ్చని చెబుతుండడం గమనార్హం.
సీఎం వస్తున్నారు.. బడులకు సెలవు ఇవ్వండి..
సీఎం జిల్లాకు వస్తున్నారని, శుక్రవారం పాఠశాలలకు సెలవు ఇవ్వాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. ఎక్కడా సీఎం వస్తున్న సందర్భంగా సెలవు అంటూ ప్రకటించవద్దని సూచించారు. మరి..బడికి ఎందుకు సెలవు ఇచ్చారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తామేం సమాధానం చెప్పాలంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రశ్నిస్తే అధికారులు ఎలాగోలా ఒకరోజు మేనేజ్ చేసుకోండంటూ సూచించడం గమనార్హం. ప్రభుత్వం సూచించిన రోజు సెలవులు ఇవ్వాలని, సెలవు రోజు బడిపెడితే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్న అధికారులే అనధికారికంగా సెలవు ప్రకటించాలని ఒత్తిడి తెస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల ప్రణాళికలను సిద్ధం చేసుకొని బడులు నిర్వహిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలకు ఈ వ్యవహారం తలబొప్పి కట్టిస్తోంది.
సీఎం సభకు బడి బస్సులు
మరో వైపు కాస్త దూరంలో ఉన్న టూర్‌కు విద్యార్థులను తీసుకెళ్లాలన్నా బడి బస్సుకు నిర్ణీత దూరం ఉంటుందని, అంతవరకు మాత్రమే తిప్పాలంటూ ఆంక్షలు విధించే రవాణ శాఖ సైతం సీఎం సభ కావడంతో బడి బస్సులకు సైతం ఆంక్షలు పక్కన బెట్టేసింది. నాగరాజుపల్లి సభకు బడులకు సెలవులు ఇచ్చి మరీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న వ్యవహారం కావడంతో బస్సులకు ఆయిల్, డ్రైవర్లకు అవసరం అయ్యే అదనపు భారం తదితరాల వ్యయం కూడా విద్యాసంస్థల యాజమాన్యాలే వహించాల్సి రావడంతో పాటు నెలకు రెండుసార్లు సీఎం టూర్లు ఉంటుంటే బడులకు సెలవులు ఎలా ఇస్తారంటూ పలు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగిన సందర్భాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా స్వచ్ఛందంగా వాహనాలను సేకరించుకోవడం, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేలా చేసుకోవాల్సిన కార్యకమంలో బలవంతంగా బడులకు సెలవులు ఇచ్చి, బడి బస్సులను పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తుండటం విడ్డూరంగా ఉందని పలువురు బహిరంగంగా పేర్కొంటుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment