చీరాల తహశీల్దార్ కార్యాలయంలో జ్ఞానభేరిపై కళాశాల అధ్యాపకులు, యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తున్న మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు
ప్రకాశం, చీరాల: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు తలనొప్పిగా మారాయి. నెలకు ఒకసారి సీఎం జిల్లాకు వస్తుండటంతో సదస్సులకు జనాలను తరలించడం, అందుకు బస్సులు అందించలేక తలలు పట్టుకుంటున్నారు. తరచూ జిల్లాకు సీఎం వస్తున్నారని సమాచారం వస్తే చాలు అధికారులు హడలి పోతున్నారు. జిల్లాకు గత రెండు నెలల వ్యవదిలోనే నాలుగు సార్లు జిల్లా పర్యటనకు సీఎం రావడం అందుకు ఏర్పాట్లు చేయలేక అధికారులు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఏర్పాట్లు ఒక ఎత్తయితే సీఎం సభలకు జనాలను తీసుకురావడం, పొదుపు సంఘాల మహిళలను తరలించడం, వారి తరలింపుకు కావాల్సిన బస్సులు ఏర్పాటు చేయడం, సభలకు హాజరయ్యే వారికి మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందించలేక అల్లాడుతున్నారు అధికారులు.
గతంలో పొదుపు మహిళలు, పురుషులను విధిగా తరలించేలా చర్యలు తీసుకున్న అధికారులు ఈ దఫా మాత్రం జ్ఞానభేరీ పేరుతో సీఎం సభకు విద్యార్థులను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం ఒంగోలులో నిర్వహించే జ్ఞాన భేరి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని అధికారులకు సమాచారం అందగానే అధికారుల హడావుడి అంతాఇంతా కాదు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను విధిగా సీఎం సభకు తరలింపు చేసేలా జిల్లా ఉన్నతాదికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో కళాశాలకు ఒక్కో ప్రభుత్వ అధికారిని నియమించి మరీ బలవంతంగా విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల నియామకంతో పాటుగా విద్యార్థులను సభకు తరలించాలని కోరుతూ గత మూడు రోజులుగా నియోజకవర్గ, మండల, ప్రత్యేకాధికారులు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో తిష్టవేసి మరి కళాశాలల్లోని విద్యార్థులను పంపించాలని బలవంతంగా ఆదేశిస్తున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల విద్యార్థులను సీఎం సభకు పంపించాలని కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశాలను కూడా నిర్వహించడం చూస్తుంటే అధికారులకు విద్యార్థుల చదువు కంటే సీఎం సభలే ముఖ్యంగా ఉన్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు.
పరీక్షల కాలంలో ఇదేంది బాబూ...
డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు విద్యార్థులకు కీలక సమయం. మార్చిలో జరగనున్న ఆఖరి సెమిస్టర్ పరీక్షలకు ఈనెలలో కీలకం. సీఎం జిల్లాకు జ్ఞానభేరితో వస్తున్నారని విద్యార్థులను ఎలా పంపించగలం అని కళాశాలల యాజమాన్యాలు అధికారులను వేడుకున్నా ఫలితం లేదు. పరీక్షలుంటే తర్వాత చదివించుకోండి ముందు విద్యార్థులను సభకు పంపించిండంటూ అధికారుల ఆదేశాలతో అధ్యాపకులు, యాజమాన్యాలు కంగుతింటున్నారు. ఒక్కో అధికారికి ఒక్కో కళాశాలను కేటాయించి మరీ విద్యార్థులను సభకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
డిగ్రీ కళాశాల్లోని విద్యార్థుల వివరాలు...
సీఎం జ్ఞానభేరి సభకు జిల్లాలోని అన్నీ డిగ్రీ కళాశాల విద్యార్థులను విధిగా పంపించాలని అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాల జారీ చేశారు. చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు, అద్దంకి, ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెట్ విద్యాసంస్థల్లో చదువుతున్న 6943 మంది విద్యార్థులను సీఎం సభకు పంపించాలని జ్ఞానభేరికి హాజరయ్యేలా రిజిస్టర్ కూడా చేయించి మరీ సర్క్యులర్‌ను విడుదల చేయడంతో పాటుగా కళాశాలలు విదిగా తమ విద్యార్థులను పంపించాలని ఆదేశించారు. విద్యార్థులను తరలించేందుకు బస్సులను కూడా ఆయా కళాశాలల యాజమాన్యాలే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో తరగతులను ఆపించి డీజిల్ ఖర్చులను భరించి మరీ సభలకు ఎలా పంపించగలం అంటూ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు.
అధ్యాపకులు, యాజమాన్యాలతోప్రత్యేక సమావేశాలు...
జ్ఞానభేరి సభలకు విద్యార్థులను తరలించేందుకు ఒక్కో డిగ్రీ కళాశాల నుంచి 500 మందిని తరలించాలని ఆదేశాలు రావడంతో మండల, నియోజకవర్గ అధికారులు కళాశాలల ప్రతినిధులు, యాజమాన్యాలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. మండల తహశీల్దార్ 500 మందిని, ఎంపీడీవో 500 మందిని, నియోజవర్గ ప్రత్యేకాధికారి విద్యార్థులు అందరిని సభలకు తరలించేందుకు సమావేశాలను ఏర్పాటు చేయడం పలు విమర్శ«లకు తావిస్తోంది. మొత్తం మీద సీఎం సారూ జిల్లాకు వస్తుంటే ప్రజలు, విద్యార్ధులు పొదుపు మహిళల తరలింపును అధికారులే దగ్గరుండి సభలకు తరలించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, యాజమాన్యాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment