సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ముచ్చటిస్తున్న కలెక్టర్
ప్రకాశం,పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది. నవంబర్ 2,3వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. పర్యటనలో భాగంగా వెలిగొండ సొరంగ నిర్మాణ పనులను సందర్శించనున్న నేపథ్యంలో కలెక్టర్ వినయ్‌చంద్, జేసీ నాగలక్ష్మీలతో పాటు పలు శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు.
షెడ్యూల్ ఇలా.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2వ తేదీ ఉదయం 9గంటలకుఅమరావతిలో హెలికాప్టర్‌లో బయలుదేరి సుమారు 10 గంటల ప్రాంతంలో వెలిగొండ సొరంగ నిర్మాణ పనుల ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా మొదటి సొరంగ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కన్వేయర్ బెల్ట్ ట్రయల్ రన్‌ను పరిశీలిస్తారు. అనంతరం 10.15 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకో ట్రైన్‌లో మొదటి సొరంగంలో ప్రయాణించి టన్నెల్‌ను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలిస్తారు. వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన కాట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏడు ప్యాకేజీల పనులపై రివ్యూ, పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తారు. అనంతరం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇక్కడి నుంచి 11.15కు హెలికాప్టర్‌లో బయలు దేరి 12 గంటలకు మార్టూరు మండలం డేగలమూడిలో జరిగే గ్రామదర్శినిలో పాల్గొని, 3 గంటలకు మార్టూరులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడ నుంచి 5.15 గంటలకు ఒంగోలు చేరుకుని బస చేస్తారని సాయంత్రం 7 గంటలకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. 3వ తేదీన పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం రోడ్డు మార్గాన లేదా, హెలికాప్టర్‌లో అమరావతికి చేరుకుంటారని తెలిపారు.
హెలిప్యాడ్ పరిశీలన: అనంతరం సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద గతంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లపై మార్కాపురం డీఎస్పీ రాయాంజనేయులుకు సూచనలు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతం చుట్టూ చిల్లచెట్లను తొలగించాలని ఆర్‌అండ్‌బీ ఈఈ మహేశ్వరరెడ్డికి సూచనలు చేశారు. అనంతరం సొరంగ నిర్మాణ పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ సీఈ గోపాల్‌రెడ్డి, ఎస్‌ఈ రెడ్డయ్య, ఈఈ అబూతాలిమ్, ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ రామాంజనేయులు, సీఐ మల్లికార్జునరావు, ఆర్‌అండ్‌బీ డీఈ మహేశ్వరుడు, తహశీల్దార్ రత్నకుమారి, ఎస్సై రామకోటయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment