మాట మార్చడంలో దిట్ట.. హామీలు విస్మరించడంలో అధిక అనుభవం.. నమ్మకద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. ఇలాంటి లక్షణాలన్నీ పుష్కలంగాఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్ని వంచించడంలో తనను మించినవారు లేరని మారో మారు నిరూపించుకోబోతున్నారు. బుధవారం జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన పేరుతో తన మోసాల చిట్టాలో మరో మైలు‘రాయి’ని చేరుకోబోతున్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో హడావుడిగా చేస్తున్న శంకుస్థాపనలు బాబు మార్క్ రాజకీయాలకు నిదర్శనమని ప్రజలు, ప్రజాసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఉలవపాడు: రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మరోమారు జనాన్ని వంచించి ఓట్లు దండుకునేందకే సీఎం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు కం షిప్‌యార్డు నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో మేజర్ పోర్టు నిర్మాణం జరిగితే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, గుంటూరు ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయన్నది అందరి భావన. 2012 ప్రాంతంలోనే రామాయపట్నం పోర్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దుగరాజపట్నం పోర్టు కోసమే కేంద్రం తొలుత మొగ్గు చూపినా అనుకూలతలు లేవని కేంద్రం నియమించిన నిపునుల కమిటీ తేల్చి చెప్పడంతో మరో పోర్టును ప్రతిపాదించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. రామాయపట్నం పోర్టును ప్రతిపాదించలేదు. దీంతో రామాయపట్నం ప్రతిపాదన ముందుకు రాలేదు.
వాస్తవానికి రూ.2,700 కోట్లతో 5500 ఎకరాలలో రామాయపట్నంలో పోర్టు కం షిప్ యార్డు నిర్మించాలన్నది ప్రతిపాదన. మొదటి దశలో రూ.7,300 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే జరిగి ఉంటే ఇప్పటికే మొదటి దశ పూర్తయి ఉండేది. వేలాది మందికి ఉద్యోగాలు లభించి ఉండేవి. పోర్టు కం షిప్ యార్డు నిర్మిస్తే రూ.లక్ష కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు దుబాయ్‌కి చెందిన కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్కో సైతం ఇక్కడి నుంచే ఎగుమతులు జరిపేది. రాయలసీమ ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఖనిజంతో పాటు సిమెంట్ ఉత్పత్తులు సైతం రామాయపట్నం నుంచే ఎగుమతులు జరిగేవి. రాష్ట్రంలోనే రామాయపట్నం అతిపెద్ద పోర్టుగా మారేది. కానీ చంద్రబాబు సర్కార్ రామాయపట్నం పోర్ట్ పై శ్రద్ద పెట్టలేదు. కేంద్రానికి రామాయపట్నం పోర్ట్ నిర్మించాలని లేఖ ఇచ్చిఉంటే ఇక్కడ భారీ పోర్ట్ కం షిప్‌యార్డు నిర్మాణం జరిగేది. రామాయపట్నం ప్రతిపాదనను కేంద్రానికి ఇవ్వని బాబు ఇపుడు తానే రామాయపట్నం మినీ పోర్ట్‌గా నిర్మిస్తానంటూ శంకుస్థానకు సిద్ధమయ్యారు. బాబు నిర్మించే పోర్ట్ ఎప్పటికి మొదలైతుందో తెలియని పరిస్థితి. కేవలం రాబోయే ఎన్నికల కోసమే చంద్రబాబు పోర్ట్‌కు శంకుస్థాపన రాయి వేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పోర్ట్ నిర్మాణం జరిగేది కాదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. చంద్రాబాబు మాటపై జనం సంగతి దేవుడెరుగు ఆ పార్టీ నేతలకే నమ్మకం లేకపోవడం గమనార్హం.
జిల్లాకు మూడేళ్ల కిందటే ట్రిపుల్ ఐటీ మంజూరైంది. ఇప్పటికీ భవనాలు నిర్మించక పోవడంతో వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయని నాలుగున్నరేళ్లుగా చెబుతునే ఉన్నారు. ఒక్క పరిశ్ర రాలేదు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచి వెలిగొండ నీళ్లిస్తున్నామన్నారు. ఈ రోజుకూ లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు సంబందించి 95 శాతం పనులు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే పూర్తి చేశారు. మిగిలిన 5 శాతం పనులు కూడా బాబు హయాంలో పూర్తికాలేదు. అమరావతి–అనంత ఎక్స్‌ప్రెస్ వే అన్నారు. భూసేకరణ కూడా జరగలేదు. చెప్పుకుంటూ పోతే జిల్లాకు సంబందించి బాబు వందలాది హామీలు ఇచ్చారు. బాబు వేసిన శిలాఫలకాలు ముళ్ల కంపల్లో కనుమరుగయ్యాయి. కందుకూరు ప్రాంతంలో పేపర్ మిల్లు, జిందాల్ స్టీల్ తదితర కంపెనీలకు భూములు అప్పగించేందుకే చంద్రబాబు అబద్దపు మాటలు చెపుతున్నారని జిల్లా వాసులకు తెలియంది కాదు. రాబోయే ఎన్నికల్లో జనాన్ని మరోమారు వంచించి ఓట్లు దండుకొనేందుకే చంద్రబాబు రామాయపట్నం పోర్టు శిలాఫలకం వేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
రామాయపట్నమే పోర్టుకు అనుకూలత
♦ కేంద్ర ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మాణానికి రామయపట్నం తీరం అనువైనదిగా ఇప్పటికే నివేదికనిచ్చింది.
♦ ప్రై వేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోర్టు కోసం అవసరమైన మేర ప్రభుత్వ భూములున్నాయి.
♦ ఇక్కడ సముద్రం సహజంగానే లోతుగా ఉంది. కాబట్టి షిప్‌యార్డు నిర్మాణానికి డ్రెడ్జింగ్ (ఇసుక తవ్వి బయటకు పోయడం) అవసరం ఉండదు.
♦ కేంద్ర నౌకాయాన శాఖలోని ఆర్థిక–రవాణా విభాగానికి చెందిన ఉన్నత స్థాయి అధికారి బిఎం అరోరా నేతత్వంలోని కమిటీ రామాయపట్నం తీరం ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమని నివేదిక ఇచ్చింది.
♦ గ్రానైట్, ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు భారీ స్థాయిలో ఎగుమతి చేయవచ్చు. దుబాయ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తరహాలో ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు చైనా, సింగపూర్ దేశాల కంపెనీలు వచ్చే అవకాశం ఉంది.
♦ రామాయపట్నం తీరం నుంచి జాతీయ రహదారి, రైలు మార్గం రెండు తీరంకు కేవలం 5 కి.మీ. లోపే ఉన్నాయి. – రామాయపట్నంలో ప్రతిపాదించి కేవలం పోర్టు నిర్మాణమే కాదు. షిప్ బిల్డింగ్ యూనిట్, షిప్ బ్రేకింగ్ యూనిట్ (డిస్‌మాల్టిల్), నేషనల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్. ఇవన్నీ వస్తే ఉద్యోగాల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.
♦ రామాయపట్నం పోర్టు వస్తే గ్రానైట్, ప్రత్తి, పొగాకు, ఆక్వా ఉత్పత్తులు, ఇనుప ఖనిజాల ఎగుమతులకు మరింత అనుకూలం.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా...
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.40 గంటలకుగుడ్లూరు మండలం రావూరులో హెలి పాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.55 కు ఎంఓయూ గ్యాలరీ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏసియా పేపర్ మిల్లు ప్రతినిధులతో మాట్లాడి గ్యాలరీని తిలకిస్తారు. 11.30 గ్యాలరీ వద్ద నుంచి బయలుదేరి 11.45కు రామాయపట్నం పోర్టు, పేపరు మిల్లు పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 12 గంటలకు జన్మభూమి సభ వద్దకు చేరుకుంటారు. అక్కడ స్టాల్స్‌ను పరిశీలించి సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సభలో పాల్గొని 2.15 గంటలకు బయలుదేరుతారు.2.30 కు హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 2.30 నుంచి 3 గంటలకు రిజర్వుడు టైమ్ లో ఉంటారు. 3గంటలకు బయలుదేరి 3.45 కు సెక్రటేరియట్‌కు చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment