మార్టూరులో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ వినయ్‌చంద్
ప్రకాశం , పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో మండల పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏఆర్ అడిషనల్ ఎస్పీ తిమ్మారెడ్డి శివారెడ్డి, ఐయస్‌డబ్ల్యూ డీఎస్పీ గోపాలకృష్ణ, మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, ఇతర అధికారులు సందర్శించారు. ముఖ్యమంత్రి తొలుత మొదటి సొరంగ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కన్వేయర్ బెల్ట్ ట్రయల్‌రన్‌ను స్వయంగా పరిశీలించనున్న నేపథ్యంలో మోటార్లకు సంబంధించి రిమోట్ బటన్ ద్వారా కన్వేయర్ బెల్ట్‌ను రన్ చేసే ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం లోకో ట్రైన్‌లో మొదటి సొరంగంలో ప్రయాణించి టన్నెల్‌ను పరిశీలించనున్నారు.
దీంతో సొరంగంలో ముఖ్యమంత్రి ప్రయాణించే లోకో రైలు బోగీని పరిశీలించి, బోగీలో చేయవలసిన ఏర్పాట్లపై ప్రాజెక్టు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు లోకో రైలులో సొరంగంలో ప్రయాణించి సొరంగ ప్రాంతంలో చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫొటో గ్యాలరీ, కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వíßహించే ప్రాంతంలో చేపట్టే భధ్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, సీఐ మల్లికార్జునరావు, ఎస్సైలు రామకోటయ్య, బ్రహ్మనాయుడు, తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు పార్టీ నాయకులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సభను విజయవంతం చేద్దాం
మార్టూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు నవంబర్ 2వ తేదీన మార్టూరులో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయచంద్ అన్నారు. బుధవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జిల్లా మరియు స్థానిక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా స్థానిక రాజుపాలెం సెంటర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగి డేగరమూడి గ్రామంలో నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్ స్టేషన్ వెనుక వైపు గల బహిరంగ స్థలంలో నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. తన పర్యటనలో డేగరమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన గోకులంను, పార్కును ప్రారంభిస్తారని చెప్పారు. పర్యటనకు అవసరమైన పరిసర గ్రామాల్లోని రోడ్లు, మౌలిక వసతులు ఎలాంటి లోపం లేకుండా అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశానికి ముందు కలెక్టర్, ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు సభాస్థలిని, హెలిప్యాడ్‌ను, డేగరమూడి గ్రామాలను ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment