
బడికి తీసుకొద్దాం..
- గిరిజన విద్యార్థుల డ్రాపవుట్ల నిరోధానికి చర్యలు
- ‘సాక్షి’ కథనంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన విద్యార్థులు మధ్యలోనే బడి మానేయడం (డ్రాపవుట్), అసలు బడికే వెళ్లకపోతుండడంపై ‘బడికి దూరం.. బతుకు భారం’ శీర్షికన సాక్షి శనివారం ప్రచురించిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గిరిజన విద్యార్థుల డ్రాపవుట్లను తగ్గించేందుకు వెంటనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సోమవారం ఆదేశించింది. దీంతోపాటు అసలు బడికే వెళ్లని వారి సంఖ్య (అవుట్ ఆఫ్ స్కూల్స్) కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో... దానిపైనా దృష్టిసారించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించింది.
దీంతోపాటు డ్రాపవుట్స్, అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లల అంశంలో ప్రత్యక్ష పర్యవేక్షణకు హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయంలో, జిల్లా శాఖల కార్యాలయాల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. 2014-15లో డ్రాపవుట్స్‌కు సంబంధించి మండలాల వారీగా వివరాలను రాజీవ్ విద్యామిషన్ (సర్వశిక్షా అభియాన్) ప్రాజెక్టు అధికారుల ద్వారా ఈ నెల 20వ తేదీలోగా తెప్పించుకోవాలని, 30వ తేదీలోగా డ్రాపవుట్ పిల్లలను గుర్తించాలని డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులను గిరిజన సంక్షేమ శాఖ ఆదేశించింది.
డ్రాపవుట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మండలాలకు దగ్గరగా ఉన్న ఆశ్రమ పాఠశాలలు, కసూర్భాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), మినీ గురుకులాలను గుర్తించి మే 10వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు శిక్షణాకేంద్రాలను నిర్వహించాలని నిర్దేశించింది. ఎస్‌సీఈఆర్‌టీ, బ్రిడ్జికోర్సు నమూనాను తీసుకుని.. డ్రాపవుట్లకు ప్రాథమిక, ఉన్నత స్థాయిలో విడివిడిగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.