మీ పిల్లలు కౌమార దశలో ఉన్నారా? స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి. కొందరు యుక్త వయసుకు వచ్చిన విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లలోని ఇంటర్‌నెట్, యూట్యూబ్ ద్వారా అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు మానసిక నిపుణుల కౌన్సెలింగ్‌లో తేటతెల్లమైంది. వీరే అధికంగా కళాశాలల్లో ఈవ్‌టీజర్లుగా మారుతున్నారని తెలిసింది. వీరిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పర్యవేక్షణ పెంచకపోతే చెడుదారి పట్టే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో 445 ఉన్నత పాఠశాలల్లో 60 వేల మంది పదోతరగతి, 108 ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 45 వేల మంది ఇంటర్, 180కిపైగా ప్రభుత్వ/ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో మూడు సంవత్సరాల్లో కలిపి లక్షకి మందిపైగా డిగ్రీ విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో స్మార్ట్ ఫోన్ ఉన్న వారే అధికం. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు మాత్రం వీటికి కొంచెం దూరంగా ఉన్నా తల్లిదండ్రులు, అన్మదమ్ములు, అక్కాచెల్లెలు, ఇతర స్నేహితుల ద్వారా వీక్షణలో ఉంటారు. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో కనిపించే కోన్ని అశ్లీల దృశ్యాలు, చిత్రాలు పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థుల భావోద్వేగాలపై ప్రభావం చూపుతున్నాయి.
చదువుపై ధ్యాస ఉన్నా ఎప్పుడు సమయం లభిస్తే అప్పుడు ఫోన్లలో వీక్షిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన మానసిక నిపుణుల బృందాలు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న పలువురు విద్యార్థులను వ్యక్తిగతంగా, బృందాలుగా విచారించారు. పదే పదే అశ్లీల దృశ్యాలు చూడడంతో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడాలని అనిపిస్తున్నట్లు వారు చెప్పారు. మరోవైపు తాము చూసిన వీడియోలు తల్లిదండ్రులుగాని, ఇతరులుకాని చూడకుండా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
అనుబంధం తగ్గి..
యుక్త వయసుకు వచ్చిన పిల్లలు, వారి తల్లిదండ్రుల మధ్య అనుబంధం తగ్గిపోతుందని మానసిక నిపుణులు విశ్లేషించారు. ఉదయం ఏడు నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటి ముఖం చూడకపోవడం, దీర్ఘకాలం హాస్టళ్లలో ఉండడంతో తల్లిదండ్రులతో అనుబంధం తగ్గుతోందని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమ తల్లిదండ్రులు కేవలం చదువుకోవడానికి మాత్రమే డబ్బులు ఇస్తారని, తాము ఏమి చుదువుకుంటున్నామో, ఏమి చేస్తున్నామో చూడడం లేదని కొందరు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈవ్‌టీజింగ్ అంటే తమకు తెలియదని, సహ విద్యార్థుల సందడిలో తోటి విద్యార్థినులను ఏడిపించడం బాధగా ఉంటుందని చెబుతున్నారు.
తల్లిదండ్రులు చేయాల్సిన పని..
♦ స్నేహితులతో చదువుకుంటున్నామంటూ గది తలుపులు వేసుకొని లోపల ఉంటున్న పిల్లల వద్దకు అప్పుడప్పుడూ తల్లిదండ్రులు వెళ్లి వారేం చేస్తున్నారో గమనించాలి.
♦ కొందరు ఇంట్లో డబ్బు తీసుకొని తమతోపాటు చదువుకుంటున్న అమ్మాయిలతో కలసి విందుల్లో పాల్గొంటున్నారు. వీరు పుస్తకాలు, ప్రాజెక్టుల కోసమే నిజంగా ఖర్చు చేస్తున్నారా అని పరిశీలించారు.
క్రీడలు ఆడించాలి
వేధింపుల పాల్పడుతున్న విద్యార్థులు, యువకులను క్రీడల్లో నిమగ్నం చేయాలి. 90 శాతం మంది మానసికోల్లాసం లేకపోవడం పోవడంతోనే చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. ఇలాంటి వ్యసనాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గుర్తించి సకాలంలో క్రీడలు.. వారికిష్టమైన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే మంచిది. – శిరిగిరెడ్డి జయారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment