వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్‌ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌’ అంటున్న యువత.. | Why More Couples Are Now Opting For Dual Income No kids | Sakshi
Sakshi News home page

వామ్మో ఇదేం సంస్కృతి..! ‘డ్యూయల్‌ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌’ అంటున్న యువత..

Published Sun, Dec 15 2024 4:00 PM | Last Updated on Sun, Dec 15 2024 4:40 PM

Why More Couples Are Now Opting For Dual Income No kids

పూర్వం వయస్సు మీద పడుతున్నా పెళ్లికాకపోతే ‘ఏమి ఇంకా పెళ్లి చేయలేదా’.. అనేవారు. పెళ్లయ్యాక ‘ఏమి ఇంకా పిల్లలు కాలేదా’ అని దెప్పిపొడిచేవారు. కానీ నేటి యువజంటల్లో కొందరు మాకు పిల్లలే వద్దని తెగేసి చెబుతున్నారు. పెళ్లి చేసుకుంటాం.. గానీ ఇప్పుడే పిల్లలను కనేది లేదని అంటున్నారు. ‘చదువు, ఉద్యోగం పేరుతో ఇన్నాళ్లు కష్టపడుతూనే ఉన్నాం. కనీసం ఇప్పుడైనా ఎంజాయ్‌ చేస్తాం. మాకు కావాలనుకున్నప్పుడు మాత్రమే పిల్లలను కంటాం’అని భీష్మించుకుని కూర్చుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు మాత్రమే ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు నగరానికి కూడా పాకుతోంది.                   
పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే కట్నకానుకలు మాట్లాడుకోవడం ఒకప్పుటి మాట. ఇప్పుడు కొన్ని షరతులు.. అంటూ కొత్త కొత్త అంశాలు పెద్దల ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా అమ్మాయి తరఫు వాళ్లు తగ్గేదేల్యా.. అంటున్నారు. నిన్నటి వరకు ‘ఇంట్లో అత్తామామలు, ఆడబిడ్డలు ఉండకూడదని.. ఇంటికి మాటిమాటికి చుట్టపు చూపుతో బంధువులు రాకూడదని... మా పిల్ల వారికి చాకిరి చేయలేద’ని తెగేసి చెప్పేవారు. కానీ ఇప్పుడు కొందరు ‘అమ్మాయిని ఇస్తాము గానీ మా పిల్ల ఇంకా ఇప్పుడే చిన్నది...ఇప్పుడిప్పుడే పిల్లలను కనాలని ఇష్టం తనకు లేదని, ఈ అంగీకారానికి అబ్బాయి ఒప్పుకుంటేనే పెళ్లి అని చెబుతున్నారు. 

స్కూల్, ఇంటర్, డిగ్రీ/బీటెక్, ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతూ ఎలాంటి ఎంజాయ్‌ చేయలేదని, ఇప్పుడు పెళ్లి, ఆ తర్వాత పిల్లలు అంటే.. సరదాలు, సంతోషాలు ఇంకెప్పుడు అంటూ చెబుతున్నారు. ఈ అంగీకారమేదో బాగుందని ఒప్పుకుంటున్న మగరాయుళ్లూ ఉన్నారు. ఈ మేరకు ఇద్దరి అంగీకారంతో వివాహాలు హాయిగా జరిగిపోతున్నాయి. కానీ ఏ ఒక్కరూ పైకి ఈ విషయం బయటకు మాత్రం చెప్పడం లేదు. వివాహమయ్యాక వీకెండ్‌లో ఇద్దరూ హాయిగా విహారయాత్రల పేరిట ఎంజాయ్‌ చేస్తున్నారు. 

నచ్చినచోటకు వెళ్లడం, నచ్చినది తినడం, నచ్చిన ప్రదేశాలు చూడటం, ఇష్టమొచ్చిన హోటళ్లలో బస చేయడం వంటి సరదాలు తీర్చుకుంటున్నారు. ఇలాంటి సంస్కృతిని ఆంగ్లంలో ‘డ్యూయల్‌ ఇన్‌కమ్‌ నో కిడ్స్‌’ (డింక్‌)గా పిలుస్తారు. ఈ లైఫ్‌స్టైల్‌లో భార్యాభర్తలిద్దరూ సంపాదించాలి...కానీ పిల్లలు మాత్రం వద్దు. ఆ ఇద్దరు సంపాదించిన డబ్బుతో ఎంజాయ్‌ చేస్తారు. వారి జీవితానికి వారే రాజు...వారే రాణి అన్నమాట. ఈ డింక్‌ లైఫ్‌ స్టైల్‌ 1980 దశకంలో జర్మనీ, జపాన్‌ లాంటి దేశాల్లో ప్రారంభమైందని చెబుతారు. 

గత దశాబ్ద కాలంగా మన దేశంలోని మెట్రో సిటిలైన న్యూఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కత లాంటి నగరాల్లో ప్రారంభమైంది. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్లిన మన ప్రాంత యువతీయువకులు డింక్‌ సంస్కృతికి అలవాటు పడుతున్నారు. ఈ కారణంగా ఈ సంస్కృతి ఇక్కడ కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమైందని చెప్పొచ్చు. డింక్‌ లైఫ్‌స్టైల్‌ గురించి సోషల్‌ మీడియాలో గొప్పగా ప్రచారం జరుగుతున్న తీరుతో కొందరు ఔత్సాహిక యువతీయువకులు అటువైపు మొగ్గుచూపుతున్నారు.  

ఉద్యోగ భద్రత లేకపోవడం 
మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరినా వారికి ఇష్టం లేకపోయినా, కంపెనీకి వారి పని నచ్చకపోయినా ఉద్యోగం పోతుంది. ఆ తర్వాత ఇంకో ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు ఒకే కంపెనీలో రెండు, మూడేళ్లు మించి పనిచేయడం లేదు. 

వారు మారడమో, కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించడమో చేయడం వల్ల వారు కంపెనీలు మారుతున్నారు. ఈ క్రమంలో వారికి ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. కొంత కాలం వేచి చూసి ఉద్యోగం వల్ల కావాల్సినంత కూడబెట్టుకున్నామని భరోసా కలిగాక పిల్లలు, వారి పెంపకం గురించి ఆలోచించే వారు ఎక్కువయ్యారు.  

పిల్లలను పెంచడమూ భారంగా...! 
కొందరు యువతీయువకులు పిల్లలను పెంచడాన్ని కూడా భారంగా భావిస్తున్నారు. మెట్రో సిటీల్లో వారిద్దరే ఉంటుండటంతో ఒకవేళ పిల్లలు కన్నా వారిని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. పిల్లలను కనేందుకు, వారిని పెంచేందుకు తరచూ సెలవులు పెట్టాల్సి రావడం, ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టాల్సి ఉండటం నేటి కొందరు యువతీయువకులకు ఇష్టం ఉండటం లేదు. పిల్లలు పెద్దగైతే మెట్రో సిటీల్లో వారి చదువులు, వారిని పెంచేందుకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారు. 

కొంత కాలం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసి సంపాదించి, కూడబెట్టి, ఎంజాయ్‌ చేసిన తర్వాత మాత్రమే పిల్లలను కనాలనే ఆలోచనతో ఉంటున్నారు. ఈ మేరకు కొందరు తల్లిదండ్రులకు కూడా తెలియకుండా భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని పిల్లలను ఇప్పుడే వద్దనుకుంటున్నారు.

నచ్చిన జీవితాన్ని ఆనందించేందుకే...!
ఒకప్పుడు ప్రొఫెషనల్‌ కోర్సులు కేవలం ఉన్నత వర్గాల పిల్లలు మాత్రమే చదివేవారు. కానీ దివంగత సీఎం వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పట్టాలు తీసుకుని బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు వెళ్తున్నారు. ఆ క్రమంలోనే వారికి తగినట్లే మెట్రో సిటీల్లో ఉద్యోగం చేసేవారో, లేక ఉన్నత చదువులు చదివిన వారో ఎంచుకుంటున్నారు. 

ఇద్దరూ అక్కడే కలిసి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు చదవాలంటే ఆషామాషీ కాదు. పాఠశాల, ఇంటర్, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ఎక్కడా టైమ్‌ వేస్ట్‌ చేయకుండా, విలాసాల జోలికి వెళ్లకుండా చదువుతూ ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఈ క్రమంలో ఉద్యోగం వచ్చేంత వరకు వారి జీవితంలో ఎంజాయ్‌ అనే పదం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఉద్యోగంసంపాదించాక కూడా ఎంజాయ్‌ లేకపోతే ఎలాగంటూ పిల్లల కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు.   

‘డింక్‌’తో దేశాభివృద్ధికి గొడ్డలిపెట్టు 
చైనా వంటి దేశాల్లో యువత కంటే వృద్ధులే అధిక సంఖ్యలో ఉండటంతో అక్కడ అభివృద్ధి రేటు క్రమంగా క్షీణిస్తోంది. ఈ కారణంగా ఒకప్పుడు పిల్లలే వద్దని చెప్పిన ఆ దేశం ఇప్పుడు ఎంత మంది పిల్లలనైనా కనండని చెబుతోంది. ఎందుకంటే పిల్లలు కనకపోతే ఆ దేశాభివృద్ధి ఆగిపోతుంది. ఏ దేశానికైనా యువతీయువకులే ఆయువుపట్టు. అభివృద్ధికి వారే మూలాధారాలు. 

యువత ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో డింక్‌ అనే లైఫ్‌స్టైల్‌ పేరుతో యువతీయువకులు పిల్లలు వద్దంటేæ ఈ దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. జననాల రేటు తగ్గిపోయి కొంతకాలానికి ఈ దేశంలో వృద్ధు్దల సంఖ్య ఎక్కువై పనిచేసే యువత సంఖ్య తక్కువ అవుతుంది. 

అప్పుడు మళ్లీ పేద దేశంగా మన దేశం మారిపోతుంది. సంతానోత్పత్తి అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ మనజాలదు. ఇంట్లో, కుటుంబంలో పిల్లలు ఉండటాన్ని తల్లిదండ్రులకే కాదు అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది.  

మార్కెట్‌లో ఒడిదుడుకులే కారణం 
సమాజంలో డింక్‌ లాంటి సంస్కృతులు రావడానికి మార్కెట్‌లోని ఒడిదుడుకులే కారణం. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ప్రైవేటు కంపెనీలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు లేవు.

ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే మెట్రోసిటీలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో మళ్లీ పిల్లలు, వారి బాధ్యతలు అంటూ జీవితాన్ని ఎంజాయ్‌ చేయలేకపోతామనే భయంతో నేటి యువత ఉన్నారు. ఈ క్రమంలో వారిలో డింక్‌ లాంటి ఆలోచనలు రావడంలో తప్పేమీలేదు.   
–  జీఆర్‌ శర్మ, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగి, కర్నూలు

వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకుంటున్నారు 
భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ పిల్లలు ఇప్పుడే వద్దనే జంటలు ఇటీవల ఎక్కువయ్యారు. దీనికి ఆర్థిక ప్రాధాన్యత కూడా ఒక కారణం. ఆర్థికంగా స్థిరపడటం, వ్యక్తిగత స్వేచ్ఛ కోరుకోవడం ప్రధాన అంశాలు.  ఇది ఒక కొత్త జీవనశైలి.

 దీనికి సామాజిక ఒత్తిడి కూడా ఒక కారణం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. ఇంట్లో పిల్లలను పెద్దలే ఎక్కువగా చూసుకునేవారు. ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలను కంటే వారి ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు.    
– డాక్టర్‌ ఎం.మల్లికార్జున, అసోసియేట్‌ 
ప్రొఫెసర్, పీడియాట్రిక్స్, జీజీహెచ్, కర్నూలు

30 ఏళ్ల తర్వాత పిల్లలను కంటే ఆరోగ్య సమస్యలు 
సాధారణంగా 25 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు ప్రసవం అయితే వారికి జని్మంచే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. 30 నుంచి 35 ఏళ్ల మధ్య గర్భం దాల్చితే వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. నెలలు నిండకుండా బిడ్డ జని్మంచడం, బీపీ, థైరాయిడ్, షుగర్‌ వంటివి రావడం జరుగుతాయి. వివాహమైన వెంటనే పిల్లలను కనకూడదన్న ఆలోచన మంచిదే గానీ మరీ ఆలస్యమైతేనే ఇబ్బంది. కొంత మంది ఈ ఇబ్బందులను అధిగమించేందుకు ఎగ్‌ ఫ్రీజింగ్, సెమన్‌ ఫ్రీజింగ్‌ చేసుకుంటున్నారు. దీనివల్ల వారు అనుకున్న వయస్సులో పిల్లలను కనేందుకు వీలు చేసుకుంటున్నారు.   
 – డాక్టర్‌ పి.శిరీషారెడ్డి, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, కర్నూలు  

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement