పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడిన దృశ్యం
కర్నూలు, ఎమ్మిగనూరు రూరల్: అక్కడ చదువుకునేది పేద పిల్లలనో.. వారికి ఏదైన జరిగితే అడిగేవారు రారనో.. తెలియదు కానీ.. వందల మంది విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. ఏదైన జరిగితే అక్కడ తమ పిల్లలు ఉండరనో.. ఏమో గాని తమకేమి సంబంధం లేన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు దీటుగా ఫలితాలు సాధిస్తామంటున్న విద్యాశాఖ కనీసం విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోతోంది. ఇందుకు నిదర్శనం సోగనూరు ఏంపీయూపీ పాఠశాల. ఇక్కడ 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 194 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 8 గదులు ఉండగా ఒక గదిని అంగన్‌వాడీ కేంద్రానికి ఉపయోగిస్తున్నారు. మిగిలిన ఏడు గదుల్లో ఆరు గదుల పైకప్పు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు క్షణ క్షణం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొన్ని తరగతులు వరండాల్లోనే నిర్వహించాల్సి వస్తోంది. మంగళవారం తరగతి గదిలో విద్యార్థులుండగా సిమెంట్ పెచ్చులూడి పడటంతో బయటకు పరుగులు తీశారు. త్రుటిలో విద్యార్థులకు ప్రమాదం తప్పింది.
మెట్లు కట్టారు. రక్షణ మరిచారు..
పాఠశాలలో తరగతులను అప్‌గ్రేడ్ చేస్తున్నారే తప్పా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించటం లేదు. పాఠశాల భవనం పైన మరో రెండు గదుల నిర్మాణం చేపట్టారు. ఈ గదులకు వెళ్లేందుకు కింది నుంచి మెట్లను ఏర్పాటు చేశారు. అయితే మెట్లకు రక్షణ గోడ నిర్మించక పోవటంతో పిల్లలు పైకి ఎక్కటానికి భయపడుతున్నారు. దీంతో భవనంపై ఉన్న రెండు గదులకు ఉపాధ్యాయులు తాళం వేయ టంతో నిరుపయోగంగా మారిపోయియి.
Comments
Please login to add a commentAdd a comment