నరక'వేతన' | School Staff Suffering With Wages Shortage | Sakshi
Sakshi News home page

నరక'వేతన'

Published Mon, Apr 22 2019 1:05 PM | Last Updated on Mon, Apr 22 2019 1:05 PM

School Staff Suffering With Wages Shortage - Sakshi

పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట):  పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం మండల సమాఖ్యల ద్వారా నియమించిన పారిశుద్ధ్య కార్మికులకు ఈ విద్యా సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా వేతనం ఇవ్వకుండా వారి కుటుంబాలను ప్రభుత్వం పస్తులు పెట్టింది. పాఠశాలలను బట్టి, విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి అరకొరగా వేతనం నిర్ణయించిన  సర్కారు దానినీ కనీసం మూడు నెలలకో, ఆరు నెలలకో కూడా విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతోంది. సాధారణంగా నివాస గృహాల్లో నలుగురుకు మించకుండా వినియోగించే మరుగుదొడ్లను శుభ్రం చేయడానికే పారిశుద్ధ్య కార్మికులు రూ.1000పైగా వేతనం తీసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో అసలు ఆ పని చేయడానికీ కార్మికులు ముందుకు రాని పరిస్థితి ఉంది. అటువంటి వారికి వేతనం ఎక్కువగా నిర్ణయించాల్సి ఉండగా అతితక్కువ వేతనాన్ని నిర్ణయించింది. అయినా పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కార్మికులు ఆ అరకొర వేతనానికీ సిద్ధపడ్డారు. అయినా ప్రభుత్వం వారికి వేతనాలు ఇవ్వకుండా కాలం వెళ్ళబుచ్చడంతో కార్మికులు తిండిమెతుకుల కోసం కూడా అప్పు చేయాల్సి వస్తోంది.

రూ.800 నుంచిరూ. 4 వేల లోపు వేతనాలు..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మొత్తం 3,297 ఉన్నాయి. వాటిలో 2,550 ప్రాథమిక, 251 ప్రాథమికోన్నత, 496 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,916  పాఠశాలల్లోమాత్రమే పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం  నియమించింది. వీటిల్లో 20 మంది నుంచి సుమారు వెయ్యి మంది వరకూ విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికులకు రూ.800 నుంచి రూ. 4వేల వరకూ వేతనంగా నిర్ణయించారు.

డీఆర్‌డీఏ, అటవీశాఖల నుంచి చెల్లింపులు..
పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీశాఖల నుంచి చెల్లింపులు చేస్తోంది. అటవీ శాఖ నుంచి 1,466 మంది కార్మికులకు, గ్రామీణాభివృద్ధిసంస్థ నుంచి 1,450 మంది కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే అటవీ శాఖ నుంచి చెల్లిస్తున్న కార్మికులకు గత జనవరి నుంచి వేతనాలు నిలిచిపోగా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి అంటే గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకూ ఒక్క నయాపైసా కూడా వేతనాలు చెల్లించలేదు. ఈ లెక్కన అటవీశాఖ నుంచి సుమారు రూ. 1.30 కోట్లు, గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి రూ. 2.60 కోట్లు మొత్తం కలిపి సుమారు రూ.3.90 కోట్లు వేతనాల బకాయిలు ఉన్నాయి.

పాఠశాల విద్యాశాఖకు రూ.100 కోట్ల బడ్జెట్‌ విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల వేతనాల  కోసం  2017–18, 2018–19 సంవత్సరాలకు ప్రభుత్వం గత జనవరిలో పాఠశాల విద్యాశాఖకు రూ.100 కోట్లు విడుదల చేసింది. అయితే అప్పటి  నుంచి ఇప్పటి వరకూ అటవీశాఖకు గానీ, గ్రామీణాభివృద్ధి సంస్థకు గానీ పాఠశాల విద్యాశాఖ నిధులు విడుదల చేయలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాల్సిన మండల సమాఖ్యలు చేతులెత్తేశాయి. ఈ నెలలోనే అన్ని తరగతులకూ సమ్మెటివ్‌ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలో విద్యా సంవత్సరం కూడా ముగిసిపోతోంది. తిరిగి పాఠశాలలు తెరిచే వరకూ పారిశుద్ధ్య కార్మికుల అవసరమే ఉండదు కనుక వారికి వేతనాలు చెల్లించే విషయంలో అధికారులు పెద్దగా పట్టించుకునే అవకాశం కూడా కనిపించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement