సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు మెదక్ జిల్లా వేదికైంది. శనివారం నుంచి మూడు రోజులపాటు ఈ ప్రదర్శనను కొండాపూర్ మండలం గిర్మాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫెయిర్‌ను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు జె.గీతారెడ్డి, వి.సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తదితరులు కూడా హాజరుకానున్నారు.
ఇది రాష్ట్ర స్థాయి ప్రదర్శన అయినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల 11 జిల్లాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొంటున్నట్టు సమాచారం. ప్రారంభోత్సవానికి మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ హాజరుకావటం లేదని తెలిసింది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇందులో మొత్తం 620 మంది విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఎగ్జిబిట్ చొప్పున మొత్తం 620 నమూనాలను ప్రదర్శించనున్నారు.
తరలివచ్చిన విద్యార్థులు..
ఆయా జిల్లాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి వరకు గిర్మాపూర్‌లోని గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు వీలుగా విద్యార్థులు తమపేరు, ప్రదర్శన పేర్లను నమోదు చేసుకున్నారు. పదిమంది ప్రొఫెసర్లు ఈ ప్రదర్శనకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. వచ్చే నెల 8న ఢిల్లీలోని ప్రగతిమైదానంలో జాతీయస్థాయి ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఇందుకుగాను రాష్ట్రం తరఫున 50 అత్యుత్తమమైన ఎగ్జిబిట్స్‌ను, విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
సైన్స్‌ఫెయిర్‌కు అంతా సిద్ధం..
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. బాలురకు గురుకుల పాఠశాల హాస్టల్ భవనంలో, బాలికలకు సంగారెడ్డి మండలం కంది సమీపంలోని కేశవరెడ్డి స్కూల్ హాస్టల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు. ఆర్‌జేడీ గోపాల్‌రెడ్డి, డీఈఓ రమేశ్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లాకు గర్వకారణం: రమేశ్, డీఈఓ
రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌ను జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని డీఈఓ రమేశ్ అన్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్ల కోసం 11 కమిటీలు వేసినట్టు చెప్పారు. ఈ వేడుకలో జిల్లాకు చెందిన 89 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. సైన్స్‌ఫెయిర్‌ను విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని చెప్పారు.
సైన్స్ పండుగకు సర్వం సిద్ధం
Published Sat, Sep 28 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement