వైఎస్సార్ నా రాజకీయ గురువు
* మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ
రేగోడ్, న్యూస్‌లైన్: ‘ఓడినా గెలిచినా.. మాట మీద నిలబడతాను.. అది మా తండ్రి రాజనర్సింహ, గురువు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి నేర్పించారు. నా రాజకీయ గురువు వైఎస్సార్.. ’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం గజ్వాడలో గురువారం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సాగుకోసం సింగూరు జలాలందిస్తామని ఆనాడు రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో భూసేకరణకు ఎకరానికి రూ. 2 లక్షల 30 వేలు ఇచ్చామని తెలిపారు. చెక్రియాల మంచినీటి పథకం ద్వారా రానున్న 50 ఏళ్ల వరకు కూడా జోగిపేటకు పుష్కలంగా మంచినీరు అందుతుందన్నారు. అందోల్ నియోజకవర్గం ప్రజలకు ఎవరేం చేశారో ఆలోచించి ఓట్లేయాలని కోరారు. రూ. వేల కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తాగునీరు, సీసీ రోడ్లు, మురికికాల్వల్లాంటి మౌలిక సదుపాయలను కల్పించామని దామోదర చెప్పారు. తెలంగాణలోని ప్రజల దృష్టి అంతా అందోల్‌పైనే ఉందని చెప్పారు.
1998 ఉప ఎన్నికలల్లో జోగిపేటను నందనవనం చేస్తానని, దత్తత కూడా తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయారన్నారు. కేసీఆర్‌ది కుటుంబపాలన అని ఆయన విమర్శించారు. మాటల గారడితో ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి బాబూ మోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డిలకు సిద్ధాంతాలు లేవని తెలిపారు. మాణిక్‌రెడ్డి ఏ పార్టీలో కాలుపెట్టినా ఆ పార్టీ మటాష్ అని అన్నారు. ఏ ఒక్కరోజూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడని బాబూమోహన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు.