న్యాయవాదులపై దాడికి పాల్పడుతున్న వేణు యాదవ్ బంధువులు
నంద్యాలవ్యవసాయం : రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నంద్యాల పట్టణంలో న్యాయవాదులు చేస్తున్న దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ నాయకుడి మేనల్లుడు కంకణం కట్టుకున్నాడు. మహా దీక్ష శిబిరంపై దాడి చేసి హల్‌చల్ సృష్టించాడు. తన వాహనానికి అడ్డయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషకు దిగాడు. శిబిరం ముందు ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుతూ న్యాయవాదులతో వాదనకు దిగాడు. ఇదేమిటని ప్రశ్నించిన ఇద్దరు న్యాయవాదులపై చెప్పుకాళ్లతో తన్ని బీభత్సం సృష్టించాడు. అతని వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై చేయి చేసుకునేంత పని చేశారు.
ఇంత జరుగుతున్నా న్యాయవాదులు మాత్రం సంయమనం పాటించి అతన్ని అక్కడి నుంచి పంపించి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో బార్ అసోసియేషన్ తరఫున ఫిర్యాదు చేశారు.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సోమవారం మహాదీక్ష శిబిరం వద్దకు పలు ప్రజా సంఘాల, అఖిలపక్ష పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలిపారు. వందలాది మంది శిబిరం వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నూనెపల్లె వైపు నుంచి శ్రీనివాససెంటర్ వైపు కారులో వెళ్తున్న స్థానిక టీడీపీ కౌన్సిలర్ వాకాశివశంకర్‌యాదవ్ మేనల్లుడు వేణు యాదవ్ కారు కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది.
సహనం కోల్పోయిన ఆయన కారుదిగి ‘‘మీ దీక్షలతో ఒరిగేముంది.. ఎవరి కోసం చేస్తున్నారు’’ అంటూ అసభ్యకరంగా తిడుతూ..శిబిరం వద్ద ఉన్న న్యాయదేవత ఫ్లెక్సీని చెప్పుకాళ్లతో తన్నుకుంటూ న్యాయవాదులపైకి దూసుకొచ్చాడు. న్యాయవాదులు తేరుకొనేలోపే ఇద్దరిపై చెప్పుకాళ్లతో తన్నుతూ బీభత్సం సృష్టించాడు. దీక్షలో కూర్చున్నవారు సైతం లేచి వచ్చే పరిస్థితి నెలకొంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోవడంతో ఏం జరుగుతుందో తెలియక దీక్షలో కూర్చున్నవారు అయోమయానికి గురయ్యాడు.
వేణుయాదవ్ వెంట వచ్చిన మహిళలు సైతం న్యాయవాదులపై దుర్భాషలకు దిగారు. ఎంత సర్దిచెప్పినా వినకుండా బూతు మాటలతో వాగ్వాదం చేశారు. చివరకు తన మనుషులను పిలిపించి దీక్షా శిబిరాన్ని తగలబెడతానంటూ హెచ్చరికలు జారీ చేశాడు. తనతో వాగ్వాదానికి దిగినవారి అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. సమస్య తీవ్రతరం అవుతుండటంతో సీనియర్ న్యాయవాదులు జోక్యం చేసుకొని వేణు యాదవ్‌ను బుజ్జగిస్తూ దీక్షా శిబిరం నుంచి పంపించారు.
దీక్ష భగ్నానికి కుట్ర...
గత 40రోజులుగా హైకోర్టు ఏర్పాటుకు న్యాయవాదులు శాంతియుత వాతావరణంలో చేస్తున్న రిలేనిరాహార దీక్షలకు అనూహ్య స్పందన లభిస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక ప్రజల నుంచి సైతం సంఘీభావం ప్రకటిస్తున్నారు. దీనిని ఓర్వలేని అధికార పార్టీ నాయకులు దీక్ష భగ్నానికి కుట్ర పన్నారని పలువురు న్యాయవాదులు సోముల నందీశ్వరరెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రతాపరెడ్డిలు ఆరోపిస్తున్నారు.
హైకోర్టు ఏర్పాటైతే సీమ వాసులందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తాము దీక్షలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. తమపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది గిట్టని వారి పనేనని బీజేపీ నాయకుడు నిమ్మకాయల సుధాకర్ అన్నారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకే దాడి చేశారని, పోలీసులు తప్పక చర్యలు తీసుకోవాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లెస్వామిరెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment