సీటు బెల్టు ప్రాణాలకు రక్షణ
పశ్చిమగోదావరి, తణుకు : రోడ్డుపై అడుగు పెడితే చాలు.. ప్రమాదం ఏ రూపంలో ముంచుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. చిన్న నిర్లక్ష్యం సైతం భారీ మూల్యానికి దారి తీస్తుంది. సుఖవంతమైన ప్రయాణానికి, వేగంగా గమ్యస్థానానికి చేర్చే వాహనాలు ప్రాణాలను సైతం గాల్లో దీపాల్లా మార్చేస్తున్నాయి. అయితే ప్రమాదాల నివారణకు, ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయట పడేందుకు ఏర్పాటు చేసిన సాంకేతిక, రక్షణ వ్యవస్థలను సైతం తేలిగ్గా తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నాం. ఇటీవల నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. అయితే కేవలం ప్రముఖులు మృతి చెందిన సమయంలోనే గుర్తుకు వచ్చే రక్షణ చర్యలు నిరంతరం పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అటు పోలీసు, ఇటు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
చిన్నపాటి నిర్లక్ష్యంతో ..
రెండేళ్ల క్రితం తణుకు మండలం దువ్వ గ్రామ పరిధిలోని పదహారో నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కోల్‌కతా నుంచి చెన్నై వెళుతున్న కంటైనర్‌ను తప్పించబోయిన కారు డ్రైవర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇదే సమయంలో కంటైనర్ డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం డివైడర్‌పై బోల్తా పడింది. ఇదే సమయంలో కారు కూడా నుజ్జు కావడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే వీరు సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే మృతి చెందినట్లు అప్పట్లో పోలీసు అధికారులు నిర్ధారించారు.
∙తణుకు మండలం తేతలి పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బటయ పడ్డారు. అన్నవరం నుంచి విజయవాడ వెళుతున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు దాటి మురుగుకాల్వలో పడింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు కాగా కారులో ప్రయాణిస్తున్నవారు సీటు బెల్టు పెట్టుకోవడంతో ప్రాణాలతో బయట పడ్డారు.
ఇలా రోడ్డు ప్రమాదాలు కేవలం వాహన చోదకుల నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయి. దీనికి తోడు వారు నిబంధనలు పాటించడం లేదని రవాణా, పోలీసు శాఖలకు చెందిన అధికారులు చెబుతున్నారు. ప్రతి మూడు ప్రమాదాల్లో ఒక దానికి అతివేగం కారణంగా కాగా మిగిలిన రెండు ప్రమాదాలు నిబంధనలు పాటించక పోవడంతోనే జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాహన వేగం నిర్ణీత వేగం కంటే ఐదు శాతం తగ్గించి నడపడం వల్ల 30 శాతం ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువత ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 16–30 మధ్య వయసున్న వారే అధిక సంఖ్యలో మృతి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. చాలా ప్రమాదాల్లో మరణాల సంఖ్య పెరగడానికి సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ వాడకపోవడంతోనే కారణమని తెలుస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రమాదాల సమయంలో కారులో నుంచి రోడ్డు మీదకు విసిరేయకుండా సీటు బెల్టు ఉపయోగపడుతుంది. దీంతో పాటు సీటు బెల్టు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెనై గాయాల తీవ్రతను తగ్గిస్తాయి. మరోవైపు ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులు తలకు తీవ్ర గాయాలు కావడంతోనే చనిపోతున్నారు. హెల్మెట్ ధరిస్తే తలకు గాయాలు తగలవు. తగిలినా అవి స్వల్పంగా ఉంటాయి. తల నుంచి రక్తస్రావం కూడా జరగకుండా హెల్మెట్ రక్షణ కవచంగా కాపాడుతుంది.
సీటు బెల్టు ఇలా పని చేస్తుంది...
వాహనాల్లో వినియోగించే ప్రధాన రక్షణ వ్యవస్థల్లో కారుసీటు బెల్టు అత్యంత ప్రధానమైంది. ఎన్నో పరిశోధనలు చేసి వాహనాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. కారులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాలకు లోనైతే సీటుబెల్టు ధరించి ఉన్న వారిలో ప్రాణాపాయాన్ని 75 నుంచి 80 శాతం వరకు తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. సాధారణంగా సీటు బెల్టుతో కారులోని సేఫ్టీ బెలూన్లకు అనుసంధానమై ఉంటాయి. ఇటీవల వస్తున్న కొత్త మోడళ్లలో అన్ని వైపుల నుంచి బెలూన్లు తెరుచుకునేలా డిజైన్ చేశారు. మరో వైపు సీటు బెల్టు ధరించకపోతే హెచ్చరిస్తూ సిగ్నల్ వ్యవస్థ ఒకటి పని చేస్తుంది. సీటు బెల్టు ధరించిన సమయంలో 80 నుంచి 100 కిలోమీటర్లు వేగం దాటిన తర్వాత వాహనం బలంగా దేన్నయినా ఢీకొడితే ప్రయాణికుడి వేగవంతమైన కదలికల ద్వారా ఒత్తిడి సీటు బెల్టుపై పడి వెంటనే బెలూన్లు ఓపెన్ అయ్యేలా వ్యవస్థ నిర్మితమై ఉంది. అంతే కాకుండా ప్రయాణికుడు డేష్‌బోర్డు, సీలింగ్, స్టీరింగ్ లేదా అద్దాలపై పడిపోకుండా సీటు బెల్టు రక్షణ కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment