నెల్లూరు (అర్బన్) : ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండో బ్యాచ్ (మెడికల్ సీట్లు) ప్రారంభం కోసం ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నుంచి రావాల్సిన అనుమతులపై ఉత్కంఠ నెలకొంది. ఎంసెట్ పరీక్ష ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మరి కొద్దిరోజుల్లో మెడికల్ సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఎంసీఐ బృందం తనిఖీచేసి నెలరోజులు దాటినా ఇంతవరకు రెండో బ్యాచ్‌కు అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల అధికారుల్లో ఆందోళన నెలకొంది.
నెలరోజులు దాటినా..
రెండో బ్యాచ్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఏప్రిల్ 27వ తేదీన రెండోసారి ఎంసీఐ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన బృందం మెడికల్ కాలేజీకి వచ్చింది. సిబ్బంది కొంత తక్కువగా ఉండటం, హాస్టళ్లలో పూర్తిస్థాయి సదుపాయాలు లేకపోవడం, ఫర్నీచర్ కొరత, జీజీహెచ్‌లో లోపాలను ఎంసీఐ గుర్తించినట్లు తెలిసింది. అధికారుల అంచనా ప్రకారం ఎంసీఐ తనిఖీ చేసి వెళ్లిన నెలరోజుల్లోపే అనుమతుల విషయంపై తేల్చేస్తారు. అయితే ఈసారి నెల రోజులు దాటినా ఎంసీఐ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో అందరిలోనూ భయం నెలకొంది.
ఎమ్మెల్యేలు స్పందించాకే...
ఎంసీఐ నుంచి ఇంకా అనుమతుల విషయంపై నెల్లూరు సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు స్పందించిన తర్వాత కళాశాల అధికారుల్లో చలనం వచ్చింది. అనుమతులు రాకపోతే విద్యార్థులు నష్టపోతారని ఎమ్మెల్యేలు డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు గత నెల 29న కళాశాలకు వచ్చి అధికారులతో మాట్లాడారు. అసలు ఏం జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా అనుమతులు వస్తాయని ఆరాతీశారు. ఈ విషయాన్ని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాలని సదరు అధికారులకు సూచించారు.
అధికారులు మే నెలాఖరులోగా వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఎంసీఐ నుంచి అనుమతులు రాకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఇది జరిగాక మంత్రి నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. ఎంసీఐ ఏం పరిశీలించింది? లోపాలు ఏమిటని తెలుసుకొని వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. అనంతరం దీనిపై వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు.
కాలేజీ అధికారులు ఎంసీఐ గుర్తించిన లోపాల గురించి, వాటిని సర్దుబాటు చేసిన వివరాలను డీఎంఈ దృష్టికి తీసుకెళ్లారు. ఎంసీఐ అనుమతి ఇవ్వలేని పక్షంలో మే ఆఖరివారంలో పిలిచి చెబుతుందని, అయితే ఇంతవరకు తమకు ఎంసీఐ నుంచి పిలుపురాలేదని మరికొద్దిరోజుల్లో ఎంసీఐ అనుమతి వస్తుందని ఆశాభావంగా ఉన్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌రావు చెబుతున్నారు. అయితే ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
రెండో బ్యాచ్ టెన్షన్
Published Sun, Jun 7 2015 12:10 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement