సాక్షి, అమరావతి: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఖజానాను ఖాళీ చేయడమే లక్ష్యంగా రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర వ్యవహార శైలిపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రభుత్వానికి సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా రవిచంద్ర వ్యవహరిస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా రవిచంద్ర ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేయడం పట్ల నివ్వెరపోతున్నారు.
ఈనెల 27న కాంట్రాక్టర్లకు రూ.వెయ్యి కోట్లు చెల్లింపు
ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల కోసం మిగతా రంగాలకు ఇవ్వ కుండా కొన్ని నిధులను నిల్వ ఉంచుతారు. అయితే రవిచంద్ర పనితీరు అందుకు భిన్నంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈనెల 27న కాంట్రాక్టర్లకు ఆయన ఏకంగా రూ.1,000 కోట్ల బిల్లులను చెల్లించేశారు. నాబార్డు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టిన పనులైనా సరే ఉద్యోగుల వేతనాలు చెల్లించిన తరువాతే మిగతా రంగాల బిల్లులను ఆర్థిక శాఖ చెల్లిస్తుంది. ప్రతి నెల 1వతేదీ నుంచి 10వతేదీ వరకు కేవలం ఉద్యోగుల వేతనాల బిల్లులనే మంజూరు చేస్తారు. 10వ తేదీ తరువాతే మిగతా రంగాలకు చెందిన బిల్లులను పాస్ చేస్తారు. అయితే ఉద్యోగుల వేతనాలను చెల్లించడానికి సైతం ఖజానాలో నిధులు లేకుండా ఖాళీ చేయడమే లక్ష్యంగా రవిచంద్ర పని చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాలు వెల్లడై కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న విషయం తేటతెల్లమైనప్పటికీ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేయడం పట్ల సచివాలయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
రెండు రోజుల్లో రూ.2,325 కోట్లు
ఎన్నికల ఫలితాల ముందు రోజు అంటే 22వ తేదీన ఏకంగా రూ.2,025 కోట్ల మేర బిల్లులను కాంట్రాక్టర్లకు రవిచంద్ర చెల్లించేసిన విషయం తెలిసిందే. ఫలితాల రోజు అంటే 23వ తేదీన మరో రూ.300 కోట్ల బిల్లులను చెల్లించేశారు. ఇవన్నీ కాంట్రాక్టర్లకు చెందిన బిల్లులే కావడం గమనార్హం. ఒకపక్క చిరు ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. మరోపక్క కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదల చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వకుండా నీరు–చెట్టు లాంటి పనులు చేసిన టీడీపీ నేతలకు బిల్లులను రవిచంద్ర చెల్లిస్తున్నారు.
సీఎస్ ఆదేశాలను ధిక్కరించడం కాదా?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏయే బిల్లులు చెల్లించాలో సూచిస్తూ ప్రాధాన్యతలను నిర్ధారించినప్పటికీ ఆయన ఆదేశాలను ధిక్కరించే రీతిలో రవిచంద్ర వ్యవహరించడం సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ‘చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన చెప్పిన పనులన్నీ అధికారులు చేయాల్సిన పనిలేదు. కానీ రవిచంద్ర చంద్రబాబు చెప్పిన వారికల్లా బిల్లులు చెల్లించడం ఆశ్యర్యం కల్పిస్తోంది’ అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. గవర్నర్ నరసింహన్ డిజిగ్నేటెడ్ సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రకటించినా సరే ఇంకా చంద్రబాబు చెప్పినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎలా పనిచేస్తారనే చర్చ సచివాలయంలో కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు రెగ్యులర్‌గా చెల్లించాల్సిన బిల్లులన్నీ పక్కనపెట్టేసి కేవలం చంద్రబాబుకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే బిల్లులనే రవిచంద్ర చెల్లింపులు చేశారు. అందుకోసం పెద్ద ఎత్తున అప్పులు చేసి మరీ చెల్లింపులు చేయడం గమనార్హం.
కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర!
ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లించేందుకు రూ.4,500 కోట్లు అవసరం. అయితే రవిచంద్ర ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేకుండా చేశారు. మంగళవారం నాటికి వేస్ అండ్ మీన్స్ రూ.1,500 కోట్లతోపాటు మరో రూ.500 కోట్లు ప్రత్యేక డ్రాయింగ్ నిధిని కూడా వాడేశారు. ఈ నెలలోఓపెన్ మార్కెట్‌లో సైతం రుణం పొందేందుకు వీలు లేకుండా ఫలితాల ముందే రుణం తీసుకున్నారు. ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని కొత్త ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఇందులో కనిపిస్తోందని, ఏ అధికారీ ఇంత బరితెగించి వ్యవహరించరనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. మళ్లీ ఓవర్ డ్రాఫ్ట్‌కి వెళ్తేగానీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్థికశాఖ వర్గాలు వాఖ్యానిస్తున్నాయి.
ఆర్థిక శాఖ ధిక్కార శైలి
Published Wed, May 29 2019 3:56 AM | Last Updated on Wed, May 29 2019 4:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment