సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె విరమణ
ఫలించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చలు
తన హయాంలో రాష్ట్రం విడిపోదని సీఎం హామీ ఇచ్చారు: మురళీకృష్ణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ నిరవధిక సమ్మెకు దిగిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మెను విరమిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సచివాలయంలోని ఆయన కార్యాలయంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ప్రతినిధులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమావేశానంతరం సమ్మె విరమిస్తున్నట్టు ఉద్యోగులు ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగానే కొనసాగుతుందన్న సీఎం హామీ మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ఉద్యోగులకు, సచివాలయ ఉద్యోగులకు చాలా వ్యత్యాసం ఉందని, సమ్మె వల్ల నిధుల విడుదల జరగక పేదలకు పెన్షన్లు, పథకాలు ఆగినందున సమ్మె వెంటనే విరమించాలని సీఎం కోరారని చెప్పారు. సీఎం హామీ మేరకు సమ్మె విరమించి ఉద్యోగులంతా శుక్రవారం నుంచి విధుల్లో చేరుతున్నట్టు తెలిపారు. తన హయాంలో రాష్ట్రం విడిపోదని సీఎం కిరణ్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఒకవేళ రాష్ట్ర విభజనపై ముందడుగు పడితే తిరిగి మెరుపు సమ్మె చేపట్టేందుకు వెనుకాడబోమని మురళీకృష్ణ హెచ్చరించారు.
రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు
సీమాంధ్ర ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేసేందుకు వీలుగా ఉద్యోగ బృందాన్ని రాష్ట్రపతి వద్దకు తీసుకెళ్తామని, అందులో సచివాలయ ఉద్యోగులకూ భాగస్వామ్యం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని మురళీకృష్ణ తెలిపారు. ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారన్నారు. సమ్మెలో ఉన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించనందున ఇబ్బంది పడుతున్నారని, పండుగలను దృష్టిలో పెట్టుకుని ఒక నెల వేతనాన్ని ముందుగా చెల్లించాలన్న తమ వినతికి సీఎం అంగీకరించినట్టు తెలిపారు. పీఆర్సీ అమల్లోకి రానందున ఇంటీరియం రిలీఫ్ అందజేసే అంశాన్నీ పరిశీలిస్తామని, ఉద్యోగులకు సమగ్ర ఆరోగ్య కార్డులు అందజేసేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ లభించిందని వెల్లడించారు.
సమ్మె విరమణను స్వాగతిస్తున్నాం: నరేందర్‌రావు
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించడాన్ని స్వాగతిస్తున్నట్టు సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సమన్వయ సంఘం చైర్మన్ నరేందర్‌రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర రాజకీయ నేతల మాయలో పడి ఉద్యోగులు సమ్మెకు దిగారని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయవద్దని సూచించారు. పీఆర్సీ, హెల్త్‌కార్డులు, కరువుభత్యం వంటి అంశాలపై సర్కారుపై కలిసి పోరాడి సాధించుకుందామని సీమాంధ్ర ఉద్యోగులకు సూచించారు.