రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘కేంద్ర ప్రభుత్వం’ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పార్లమెంటులో నిరసనలు ఆపబోమని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘కేంద్ర ప్రభుత్వం’ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు పార్లమెంటులో నిరసనలు ఆపబోమని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు. సీమాంధ్రలో కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని జాతీయ పార్టీలు గుర్తించాయన్నారు.
గురువారం లోక్‌సభలో తమ నిరసన సందర్భంగా సస్పెన్షన్ వేటు వేయాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ సభ్యులు సహా మెజారిటీ పార్టీలు వ్యతిరేకించాయని చెప్పారు. గురువారం సాయంత్రం సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు ఇంట్లో సమావేశమయ్యారు.
కేంద్ర మంత్రులు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జె.డి.శీలం, ఎంపీలు సాయిప్రతాప్, ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులరెడ్డిలు హాజరయ్యారు. శుక్రవారం లోక్‌సభలో వ్యవహరించాల్సిన తీరు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న కమిటీ తదితరాలపై చర్చించారు.
అనంతరం ఎంపీ అనంత నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ....‘ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన జరుగదని స్పష్టమైన హామీ కావాలి. హామీ వచ్చే వరకు మా నిరసన కొనసాగుతుంది’’ అని స్పష్టం చేశారు. తమ రాజీనామాలు స్పీకర్ ఫార్మట్‌లో, స్పీకర్‌కే ఇచ్చామని తెలిపారు. తమ రాజీనామాలు ఎందుకు పెండింగ్‌లో ఉంచారనేది స్పీకర్‌నే అడగండి’’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.