* కీలక బిల్లుల ఆమోదం కోసం వ్యూహం
* ‘ఆల్ పార్టీ కమిటీ’ వేస్తామని సీమాంధ్ర ఎంపీల వద్ద ప్రతిపాదన
* పార్లమెంటు సమావేశాలకు సహకరించాలన్న కమల్‌నాథ్
* జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్న పలువురు సభ్యులు
* అవసరం లేదన్న కాంగ్రెస్.. ఆందోళన విరమణకు నో అన్న ఎంపీలు
* నేడు స్పీకర్ సమక్షంలో అఖిలపక్ష పార్లమెంటరీ నేతల సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకించే పేరుతో సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు కార్యక్రమాలను స్తంభింపచేస్తుండటంతో.. కీలకమైన ఆహార భద్రత, భూసేకరణ బిల్లులను పార్లమెంటులో ఆమోదించటానికి కాంగ్రెస్ ‘ఆల్ పార్టీ కమిటీ’ అనే కొత్త ఎత్తుగడను ముందుకు తీసుకువచ్చింది. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ బిల్లులకు ఆమోదం పొందలేకపోతున్న యూపీఏ సర్కారు.. గురువారం సభలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
సభ్యుల సస్పెన్షన్‌ను ప్రతిపాదిస్తూ అధికారపక్షం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పారీలన్నీ వ్యతిరేకించటంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. దీంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కొత్త వ్యూహంతో మరో కొత్త కమిటీ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. సీమాంధ్ర సభ్యులు పార్లమెంటులో ఆందోళనను విరమించి సభ సజావుగా సాగటానికి సహకరించాలని.. వారి ఆందోళనలను పరిశీలించటానికి జాతీయ పార్టీల సభ్యులతో ఆల్ పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ప్రతిపాదించారు.
విభజన నిర్ణయం తీసుకున్నది కేవలం కాంగ్రెస్ పార్టీయేనని.. కేంద్రం ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆందోళన విరమించి.. తమ అభ్యంతరాలను ఆల్ పార్టీ కమిటీకి వివరించాలని సూచించారు. ఈ కమిటీ పేరుతో పార్లమెంటు సజావుగా సాగేలా చేసుకుని.. ఆహార భద్రత తదితర బిల్లులకు ఆమోదం పొందవచ్చనేది కాంగ్రెస్ ఎత్తుగడగా తెలుస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల ఎదుట విడివిడిగా కమిటీ ప్రతిపాదన చేయగా.. తొలుత వారి నుంచి మిశ్రమ స్పందన లభించినట్లు సమాచారం. కొందరు ఆల్ పార్టీ కమిటీ బదులుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించగా.. అలాంటి కమిటీ అవసరం లేదని కమల్‌నాథ్ పేర్కొన్నట్లు చెప్తున్నారు.
ఈ విషయంలో సీమాంధ్ర ఎంపీలతో సీపీఐ తదితర పార్టీల నేతలు గురుదాస్‌దాస్‌గుప్తా వంటి వారు కూడా దౌత్యం నెరపినట్లు తెలిసింది. దీనిపై ఆలోచించి చెప్తామన్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తర్వాత కేవీపీ నివాసంలో సమావేశమై మళ్లీ కమిటీలకు ఒప్పుకుని ఆందోళన విరమిస్తే ప్రజల దృష్టిలో మరింత చులకన అవుతామని భావించి.. ఆందోళన కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్.. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ కొత్త కమిటీ ఎత్తుగడ!
Published Fri, Aug 23 2013 1:29 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM
Advertisement
Advertisement