* అవి తూతూ మంత్రపు రాజీనామాలే
* ప్రకటనలు చేసి స్పీకర్‌కు లేఖలు పంపని నేతలు
* రాజీనామాలు చేసినట్టు ప్రకటించిన కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌కు..
* స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా విరుద్ధమైన ఫార్మాట్‌లో రాజీనామాలిచ్చిన మరికొందరు
* వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి మాత్రమే స్పీకర్‌కు రాజీనామా లేఖలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ తీసుకున్న హడావుడి నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు, ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు పెద్ద ప్రహసనంగా మిగిలాయి. ఆయా నాయకుల రాజీనామాలన్నీ ఒక డ్రామాను తలపిస్తున్నాయి. రాజీనామాలు చేసిన వారిలో నలుగురైదుగురు మాత్రమే స్పీకర్ ఫార్మాట్‌లో శాసనసభ కార్యాలయానికి లేఖలు అందించారు. పైకి గంభీరమైన ప్రకటనలు చేసినప్పటికీ ఇతర నేతలు అలా లేఖలేవీ సమర్పించలేదు.
అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే నిర్ణీత ఫార్మాట్‌లో కాకుండా ఆమోదానికి వీల్లేని రీతిలో రాజీనామా పత్రాలు సమర్పించడం విశేషం. పదవులను వదులుకోవడం ఇష్టంలేకే వీరు అలాంటి ఫార్మాట్‌లో లేఖలిచ్చారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చిత్తశుద్ధితో రాజీనామా చేయాలనుకొనేవారు తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏకవాక్యంతో స్పీకర్‌కు ఏకవాక్య లేఖను సమర్పిస్తారని చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రకటనకు ముందే వైఎస్సార్ సీపీ రాజీనామాలు..
తెలంగాణపై కాంగ్రె స్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోవడానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించడం తెలిసిందే. రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ వారు రాజీనామాలు సమర్పించారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయడంలో కాంగ్రెస్ వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మరో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించారు. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి మొత్తం పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన వారంతా రాజీనామాలు సమర్పించగా కాంగ్రెస్, టీడీపీలలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ముందే తెలిసినా రాజీనామాలు చేయలేదు..
‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తారన్న సంగతి మా పార్టీ నేతలకు ముందే తెలుసు. అయినప్పటికీ అంతవరకు నిరీక్షించి నిర్ణయం వెలువరించిన రోజున రాజీనామాలపై వీరంతా తర్జనభర్జనపడ్డారు. పదవుల్లో కొనసాగుతూనే అధిష్టానం చెప్పినట్లు నడచుకొనే తీరులో వారి వ్యవహారం సాగుతోంది’ అని కాంగ్రెస్‌కే చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. రాజీనామా లేఖలను స్పీకర్ కార్యాలయంలో ఇవ్వాల్సి ఉండగా.. కొందరు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కొందరు సీఎంకు సమర్పించారు. ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్, పెంచికర్ల రమేష్‌బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆది నారాయణరెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, మురళీకృష్ణ, ఆనం వివేక్, సుధాకర్‌లు శాసనసభ కార్యాలయంలో లేఖలు అందించారు. కారుమూరి నాగేశ్వరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వంగా గీత, కన్నబాబు, పంతం గాంధీమోహన్, బంగారు ఉషారాణిలు బొత్సకు రాజీనామాపత్రాలు ఇచ్చినట్టు చెప్పుకున్నారు.
ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాసరావు, మళ్ల విజయప్రసాద్, పాముల రాజేశ్వరి, ముత్యాలపాపలు కూడా రాజీనామా పత్రాలు సమర్పించారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, టి.విజయకుమార్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు జుట్టు జగన్నాయకులు, కొర్లభారతి, మీసాల నీలకంఠం నాయుడు, బొడ్డేపల్లి సత్యవతి.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి రాజీనామా పత్రాలు ఇచ్చారు.
ఐదుగురు మంత్రుల రాజీనామా..
కాంగ్రెస్ తెలంగాణ తీర్మానానికి నిరసనగా రాజీనామాలు చేస్తామని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మంత్రులంతా అంగీకరించారు. చివరకు సీఎం సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఐదుగురు మంత్రులు రాజీనామాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి లేఖలు అందించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, అహ్మదుల్లాలు సీఎంకు రాజీనామా లేఖలు ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. మరునాడు విశ్వరూప్, మహీధర్‌రెడ్డిలు సీఎంను కలసి లేఖలు అందించారు. కొండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజులు రాజీనామాలు సమర్పించారు. అయితే వీరిలో కొందరు సచివాలయంవైపు రానప్పటికీ ఇంటి వద్ద ఎప్పటిలాగే తమ విధులు నిర్వర్తిస్తున్నారు.
ఎంపీలదీ అధిష్టానం దారే
కాంగ్రెస్ ఎంపీలు కూడా రాజీనామాల డ్రామాను రక్తికట్టించారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దని, అసెంబ్లీ, పార్లమెంటులో విభజన అంశంపై వాదనలు గట్టిగా వినిపించాల్సి ఉంటుందని పిలుపునిచ్చిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ఆ మేరకు లేఖను పార్లమెంటుకు అందించారు. ఎస్పీవై రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, సాయిప్రతాప్, హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, కేవీపీ రామచంద్రరావు, మాగుంట సుబ్బరామిరెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి రాజీనామాలు ఫ్యాక్స్‌ల ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపించారు.
రాయపాటి సాంబశివరావు అమెరికా నుంచి ఫ్యాక్స్‌ద్వారా రాజీనామా లేఖను పంపినట్టు సన్నిహితుల ద్వారా చెప్పించారు. అయితే వీరు రాజీనామా చేసినా అధిష్టానం సూచనల మేరకు వ్యూహాత్మకంగా నడుస్తున్నారన్న విమర్శలున్నాయి. పార్లమెంటు సమావేశాలకు హాజరవుతూ పార్టీ నిర్దేశించిన విధంగా ఆహార భద్రత బిల్లుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ ఎంపీలే చెబుతున్నారు.
టీడీపీ.. అటు రాజీనామాలు, ఇటు సభల్లో ఆందోళనలు..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నేతల్లాగానే నాటకాలు ఆడుతున్నారన్న విమర్శలు సీమాంధ్ర నేతల నుంచి వస్తున్నాయి. తెలంగాణకు ఆ పార్టీ తరఫున చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారు. కేంద్రం దాని ఆధారంగా రాష్ట్ర విభజనకు సిద్ధపడుతుండగా వారంతా ఆందోళనలకు దిగుతున్నారని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రాజీనామాలు చేయిస్తున్నట్లు కొత్త నాటకానికి తెరలేపినా ఆ ఉత్తుత్తి రాజీనామాల డ్రామాలో కూడా ఆయన భాగస్వామి కాకుండా దూరంగా ఉండిపోయారంటూ సీమాంధ్ర నేతలు విమర్శిస్తున్నారు.
చంద్రబాబు విభజనను స్వాగతిస్తుండగా ఆ పార్టీ ఎంపీలు హరికృష్ణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు.. విభజనకు వ్యతిరేకంగా రాజీనామాలు సమర్పించారు. అయితే రాజీనామా చేసినా తిరిగి సభకు వెళ్తూ నినాదాలతో సభను అడ్డుకొనే ప్రయత్నాలు సాగించారు. ఇవన్నీ సీమాంధ్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నాలేనన్న విమర్శలున్నాయి.
ఆ పార్టీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘనీ, పరసా రత్నం, బీద మస్తాన్‌రావు, బల్లి దుర్గాప్రసాద్, రామకృష్ణ, కందుల నారాయణరెడ్డి, శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, వి.జోగేశ్వరరావు, జయమంగళం వెంకటరమణ, దాసరి బాలవర్ధన్‌రావు, అశోక్ గజపతిరాజు, ముద్దు కృష్ణమనాయుడు, కోళ్ల లలితకుమారి, వెలగపూడి రామకృష్ణబాబు, జి.రామానాయుడు, సోములు రాాజీనామాలు సమర్పించామని ప్రకటించారు. వీరంతా స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా అందుకు విరుద్ధమైన ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించడంతో అవన్నీ ఆమోదానికి పనికిరానివిగా మారాయి. కాగా, కాంగ్రెస్, టీడీపీల నుంచి డజనుకు మించి రాజీనామా లేఖలు స్పీకర్ కార్యాలయానికి అందలేదని అసెంబ్లీ సచివాలయ అధికారులు చెప్పడం కొసమెరుపు.
ప్రకటనలే.. లేఖలివ్వలే!
Published Thu, Aug 15 2013 3:47 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
Advertisement
Advertisement